
మా రాజువు నువ్వేనయ్యా..
సాగునీటి ప్రాజెక్టులతోనే వ్యవసాయమే ఆధారిత జిల్లా అభివృద్ధి సాధ్యమని భావించిన దివంగత ముఖ్యమంత్రి
► ఇందూరు మదిలో చెరగని ముద్ర
► మెడికల్ కళాశాలతో చేరువైన వైద్య సేవలు
►జలయజ్ఞంలో మొదటి ప్రాజెక్టులు అలీసాగర్, గుత్ప
► ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఉన్నత చదువులు
► ఎందరి ప్రాణాలను కాపాడిన ఆరోగ్య శ్రీ
► జిల్లాలో రూ.3,484 కోట్లతో పనులు ప్రాణహిత చేవెళ్ల పనులు
► తెలంగాణ యూనివర్సిటీ తో విద్యాకుసుమాల పరిమళం
► లెండి ప్రాజెక్టుతో జుక్కల్‌లో సాగునీటి గలగలలు
బీడు వారిన నిజాంసాగర్ చివరి ఆయకట్టును ‘అలీసాగర్, గుత్ప’తో తడిపిన మహానేత స్మృతులు రైతన్న మదిలో ఎన్నటికీ చెరిగిపోవు. విశ్వవిద్యాలయంతో ఉన్నత విద్యను చేరువ చేసిన మహానేతను విద్యార్థిలోకం మరిచిపోదు. వైద్య కళాశాలతో ఉన్నత వైద్యాన్ని చేరువ చేసిన ‘డాక్టర్’ సాబ్ నిరుపేదలకు అండగా నిలిచారు. ఆరోగ్యశ్రీతో లక్షలాది మందికి కార్పొరేట్ వైద్యం అందుతోంది. ఆర్థిక స్థోమత లేక ఇంటర్‌తో ఫుల్‌స్టాప్ పెట్టాలకున్న పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా ఉన్నత చదువుల నందించిన రాజన్నను గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. నిరుపేదల సంక్షేమంతో పాటు, జిల్లా సమగ్రాభివృద్ధికి బాటలు వేసిన మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం.
సాక్షి, నిజామాబాద్ : సాగునీటి ప్రాజెక్టులతోనే వ్యవసాయమే ఆధారిత జిల్లా అభివృద్ధి సాధ్యమని భావించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జిల్లాలో పలు సాగునీటి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. సాగునీరందక బీడు భూములుగా మారిన నిజాంసాగర్ ప్రాజెక్టు చివరి ఆయకట్టును స్థిరీకరించేందుకు గుత్ప, అలీసాగర్ ఎత్తిపోతల పథకాలకు శ్రీకారం చుట్టారు. జలయజ్ఞంలో భాగంగా చేపట్టిన ఈ ఎత్తిపోతల ద్వారా సుమారు 92 వేల ఎకరాలకు సాగు నీరందుతోంది. నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టును స్థిరికరించాలనే లక్ష్యంతో ప్రధాన కాలువల ఆధునికీకరణ పనులకు భారీగా ఎత్తున రూ.549.60 కోట్లు మంజూరు చేశారు.
తెలంగాణ వరప్రదాయినిగా పేరున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద కాలువ నిర్మాణం చేపట్టారు. అలాగే చౌట్‌పల్లి హన్మంతరెడ్డి ఎత్తిపోతల పథకం పనులను దాదాపు పూర్తి చేశారు. జుక్కల్ నియోజకవర్గంలో సాగునీటి రంగం అభివృద్ధికి బాటలు వేసేందుకు మహారాష్ట్ర – ఆంధ్ర అంతర్రాష్ట్ర ప్రాజెక్టు లెండికి శ్రీకారం చుట్టారు. సుమారు మూడు లక్షల ఎకరాలకు అదనపు ఆయకట్టును సాగులోకి తెచ్చేందుకు ప్రాణహిత – చేవెళ్ల సుజలా స్రవంతి పథకం కింద జిల్లాలో రూ.3,484 కోట్లతో పనులు చేపట్టారు.
తెలంగాణ యూనివర్సిటీ
ఉన్నత చుదువుల కోసం రాజధానికి తరలివెళ్లాలనే బాధలు లేకుండా విశ్వ విద్యాలయాన్ని మంజూరు చేసిన మహానేత.. జిల్లాలో ఉన్నత విద్యాభివృద్ధికి బాటలు వేశారు. 2006 మార్చిలో మూడు కొత్త యూనివర్సిటీ (యోగి వేమన, నన్నయ్య, తెలంగాణ యూనివర్సిటీ)ల ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 2006 సెప్టెంబర్ నుంచి నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ గిరిరాజ్ కళాశాలలో తాత్కాలికంగా తరగతులు ప్రారంభమయ్యాయి.
అనంతరం డిచ్‌పల్లి శివారులో 577 ఎకరాల సువిశాల స్థలంలో వర్సిటి కోసం 4 సొంత భవనాలు నిర్మించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా 2009 జనవరి 30న సువిశాలమైన క్యాంపస్‌లో వర్సిటీ ప్రారంభమైంది. మొదట్లో ఆరు కోర్సులతో ప్రారంభమైన ఈ యూనివర్సిటీ ప్రస్తుతం 26 కోర్సులకు చేరుకుంది. ప్రతిష్టాత్మక ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల సరసన చేరింది. ఏటా వందలాది మంది పేద, మధ్యతరగతి విద్యార్థులు ఉన్నత చదువులకు నిలయంగా మారింది.
వైద్య కళాశాల
రోగం వస్తే అత్యవసర వైద్య చికిత్స కోసం హైదరాబాద్‌కు వెళ్లలేక మార్గమధ్యంలో అనేక మంది ప్రాణాలు వదులుకోవాల్సిన పరిస్థితి. వృత్తిరీత్య వైద్యులైన వైఎస్‌ఆర్ ఇలాంటి నిరుపేదలకు ఉన్నత వైద్యం చేరువ చేసేందుకు జిల్లాకు వైద్య కళాశాలను మంజూరు చేశారు. 2009 మేలో ఖిల్లా వద్ద శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఈ వైద్య కళాశాల స్థలాన్ని నగరంలోకి మార్చారు. మొదటి సంవత్సరం వంద సీట్లు.. రూ.రెండు వందల కోట్లు కేటాయించారు. ఈ వైద్య కళాశాల ఇప్పుడు నిత్యం వందలాది మందికి ఉన్నత వైద్యసేవలందిస్తోంది.
మహానేత పర్యటన..
నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా పాలననందించిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో జిల్లాల్లో అత్యధికంగా పర్యటించారు.
గతంలో ఏ ముఖ్యమంత్రి పర్యటించని విధంగా 28 సార్లు రావడం జిల్లాపై ఆయనకున్న అనుబం«ధాన్ని గుర్తు చేస్తోంది. 2004లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నవంబర్‌లో మొదటి సారిగా జిల్లాకు వచ్చారు.