ఎస్పీని కలిసిన వైఎస్ వివేకా
► మహేష్‌నాయుడుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
కడప అర్బన్: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి శుక్రవారం ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణను కలిసి రెండు సమస్యలపై చర్చించారు. సుండుపల్లె మండలం ఎంపీపీ అజంతమ్మ ఇంటిని రాత్రికి రాత్రే ఎర్రచందనం స్మగ్లర్, టీడీపీ నాయకుడు మహేష్‌నాయుడు, మరికొంతమంది దౌర్జన్యంగా కూల్చివేశారు. సదరు నిందితులపై చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరినట్లు ఆయన విలేకరులకు తెలిపారు.
ఆర్‌సీపీ నేతల సమస్యపై: ఆర్‌సీపీ నేతలు నిమ్మకాయల రవిశంకర్‌రెడ్డితోపాటు 11 మందిపై తాలూకా పోలీసుస్టేషన్ పరిధిలో గురువారం రౌడీషీట్లను ఓపెన్ చేశారు. ఈ సమస్యపై అఖిలపక్ష నేతలు ఎస్పీని కలిసేందుకు వచ్చిన సమయంలో వైఎస్ వివేకానందరెడ్డి ఎస్పీ బంగ్లాకు వచ్చారు. ఆ సమయంలో ఆర్‌సీపీ నేతలు వైఎస్ వివేకానందరెడ్డికి తాము ఎదుర్కొంటున్న సమస్య గురించి వివరించారు. స్పందించిన వైఎస్ వివేకా స్పందించి ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. రౌడీషీట్లు ఆర్‌సీపీ నేతల ప్రవర్తనను బట్టి భవిష్యత్తులో తొలగిస్తామని, సమస్యను పరిశీలిస్తామని ఎస్పీ తెలిపారని వైఎస్ వివేకా వెల్లడించారు.