జోహార్ రాజన్నా..
అనంతపురం : రైతు బాంధవుడు, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి జిల్లా ప్రజలు ఘన నివాళులర్పించారు. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ వైఎస్ ఏడో వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించారు. మహానేత విగ్రహాలను ఆరాధించడంతో పాటు పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. అనంతపురంలోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకటరామిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ, మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి, ఏడీసీసీబీ చైర్మన్ లింగాల శివశంకర్‌రెడ్డి, రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి తదితరులు వైఎస్ చిత్రపటానికి పూలమాల వేసి.. నివాళులర్పించారు.
విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు బండి పరుశురాం ఆధ్వర్యంలో పెద్దాస్పత్రిలో రోగులకు బ్రెడ్డు, పండ్లు పంపిణీ చేశారు. సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు మిద్దె భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో వికలాంగ విద్యార్థులకు పెన్నులు, నోట్‌బుక్కులు పంపిణీ చేశారు. కనకదుర్గ లారీ అసోసియేషన్ ప్రతినిధులు పురుషోత్తంరెడ్డి, పుల్లారెడ్డి, రామాంజులరెడ్డి ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ రాజీవ్‌రెడ్డి ఆధ్వర్యంలో కళ్ల అద్దాలు పంపిణీ చేశారు. మహిళా విభాగం నగర అధ్యక్షురాలు శ్రీదేవి ఆధ్వర్యంలో మారుతీనగర్‌లోని ఆశ్రమంలో వృద్ధులకు దుప్పట్లు అందజేశారు.
• రాప్తాడు నియోజకవర్గంలోని ఆత్మకూరులో నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి మాజీ ఎంపీ అనంత , నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి హాజరయ్యారు. కనగానపల్లి మండలం ముద్దలాపురంలో అన్నదానం చేశారు. ఎల్లకుంట్లలో వైఎస్ విగ్రహానికి నివాళులర్పించారు.
• ఉరవకొండ నియోజకవర్గంలోని కూడేరులో వైఎస్ విగ్రహానికి ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి పూలమాల వేసి.. నివాళులర్పించారు. అనంతరం వికలాంగ విద్యార్థులకు స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఉరవకొండ పట్టణంలో మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బోయ సుశీలమ్మ ఆధ్వర్యంలో వైఎస్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. నాయకులు అశోక్, బసవరాజు పాల్గొన్నారు.
• రాయదుర్గం పట్టణంలో మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ వర్ధంతి నిర్వహించారు. ప్రజలకు అన్నదానం, ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పాలు, బ్రెడ్డు పంపిణీ, వృద్ధాశ్రమంలో అన్నదానం చేపట్టారు. రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి గౌని ఉపేంద్రరెడ్డి పాల్గొన్నారు.
• హిందూపురం పట్టణంలోని పరిగి బస్టాండులో వైఎస్ విగ్రహానికి వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ పాలాభిషేకం చేశారు. సదాశివనగర్, మిట్టమీదపల్లిలోనూ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు.
• కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని కంబదూరు మండలం కర్తనపర్తిలో గ్రామస్తులు మాధవయ్య, నాగరాజు ఆధ్వర్యంలో జరిగిన అన్నదాన కార్యక్రమంలో సమన్వయకర్త ఉషాశ్రీచరణ్ పాల్గొన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎల్‌ఎం మోహన్‌రెడ్డి కళ్యాణదుర్గంలోని వైఎస్ విగ్రహానికి నివాళులర్పించారు.
• గుంతకల్లు పట్టణంలో పార్టీ సమన్వయకర్త వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఆర్సీఎం చర్చిలోని మానసిక వికలాంగ ఆశ్రమంలో దుస్తులు, ప్రభుత్వ ఆస్పత్రిలో పాలు, బ్రెడ్డు పంపిణీ చేశారు.
= పుట్టపర్తి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో వర్ధంతి కార్యక్రమం జరిగింది. నల్లమాడలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బీఎస్ కేశవరెడ్డి పాల్గొన్నారు.
• తాడిపత్రి ప్రభుత్వ ఆస్పత్రి రోగులకు పార్టీ సమన్వయకర్త వీఆర్ రామిరెడ్డి బ్రెడ్డు, పండ్లు పంపిణీ చేశారు. అదనపు సమన్వయకర్త రమేష్‌రెడ్డి ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో పండ్లు, బ్రెడ్డు పంపిణీ, రూరల్ పరిధిలోని ఆవుల తిప్పాయపల్లి అనాథాశ్రమంలో అన్నదానం చేశారు.
• కదిరి పట్టణంలోని సైదాపురం ఎస్సీకాలనీలో సమన్వయకర్త డాక్టర్ సిద్ధారెడ్డి ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. అందరితో కలిసి ఆయన అక్కడే సహపంక్తి భోజనం చేశారు.
• పెనుకొండ నియోజకవర్గంలోని గోరంట్లలో వైఎస్ విగ్రహానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ పూలమాలలు వేసి నివాళులర్పించారు.
• ధర్మవరం పట్టణంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి గుర్రం శ్రీనివాసరెడ్డి, బత్తలపల్లిలో బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటి సూర్యప్రకాష్‌బాబు ఆధ్వర్యంలో వర్ధంతి నిర్వహించారు.
• శింగనమల నియోజకవర్గంలోని బుక్కరాయసముద్రం, పుట్లూరులో జిల్లా పరిషత్ మాజీ చైర్‌పర్సన్ తోపుదుర్తి కవిత, నియోజకవర్గ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి, నాయకులు ఆలూరి సాంబశివారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ విగ్రహానికి నివాళులర్పించారు.
• మడకశిర పట్టణంలో పార్టీ సమన్వయకర్త డాక్టర్ తిప్పేస్వామి ఆధ్వర్యంలో వైఎస్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు. గుడిబండ మండలం బీటీ పల్లిలో అన్నదానం చేశారు.