మనసున్న మారాజు వైఎస్ | ysr death anniversary in anantapur | Sakshi
Sakshi News home page

మనసున్న మారాజు వైఎస్

Published Sat, Sep 3 2016 12:06 AM | Last Updated on Sat, Jul 7 2018 2:52 PM

ysr death anniversary in anantapur

అనంతపురం : దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి తన పాలనలో అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అమలు చేసి ‘మనసున్న  మారాజు’గా వారి హృదయాల్లో నిలిచిపోయారని వైఎస్సార్‌సీపీ నాయకులు కొనియాడారు. వైఎస్‌ ఏడో  వర్ధంతిని పురస్కరించుకుని శుక్రవారం వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో వైఎస్‌ చిత్రపటానికి పూలమాలలు వేశారు.  అనంతరం స్థానిక సుభాష్‌రోడ్డులోని మహానేత విగ్రహం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో కరువును పారదోలేందుకు హంద్రీ–నీవాను చేపట్టిన ఘనత వైఎస్సార్‌దేనన్నారు.  ప్రస్తుత సీఎం చంద్రబాబు గతంలో అధికారంలో ఉన్నప్పుడు హంద్రీ–నీవాను కేవలం పునాదిరాళ్లకే పరిమితం చేశారని విమర్శించారు.

వైఎస్‌ వచ్చాక ఈ ప్రాజెక్టుకు రూ. 6,872 కోట్లు  కేటాయించారన్నారు. దీనిద్వారా జిల్లాలోనే 3.50 లక్షల ఎకరాలకు నీటిని ఇవ్వాలని సంకల్పించిన మహానుభావుడు అన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని 2012లో తాము ప్రజా ప్రతినిధులుగా ఉన్నప్పుడు  జిల్లాకు కృష్ణాజలాలు  తెచ్చామని గుర్తు చేశారు. అయితే.. సీఎం చంద్రబాబు తాను తెచ్చానని గొప్పలు చెప్పుకోవడం తగదన్నారు.  వైఎస్‌lఆదర్శాలను ముందుకు తీసుకెళ్లడం వైఎస్సార్‌సీపీ కార్యకర్తలుగా తమపై బాధ్యత ఉందన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ మాట్లాడుతూ వైఎస్‌ అన్ని వర్గాల ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నారని గుర్తు చేశారు.

ఆయన హయాంలో అనేక సంక్షేమ పథకాలతో లబ్ధి పొందిన కోట్లాది తెలుగు ప్రజలు వైఎస్‌ను దైవంగా భావిస్తున్నారన్నారు.  మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి మాట్లాడుతూ...వైఎస్‌  లేని లోటు ఈరోజు తెలుగు ప్రజలకు స్పష్టంగా  అర్థమవుతోందన్నారు. సీఎంగా ఉన్నప్పుడు ప్రపంచంలో ఏ నాయకుడూ చేయని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు.  అనంతపురం జిల్లాకు తాగు,సాగు నీరు అందించేందుకు ఆయన చేసిన కృషి మరువలేనిదన్నారు.  రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ... వైఎస్‌ చేపట్టిన జలయజ్ఞం ఫలాలను ఈరోజు చూస్తున్నామన్నారు.

నిత్య కరువు పీడితమైన అనంత జిల్లా రైతాంగాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతోనే హంద్రీ–నీవా చేపట్టారన్నారు. సీఎం చంద్రబాబు దోపిడీకి మారుపేరు అని విమర్శించారు. ఇంతటి అధ్వాన పాలన ఎప్పుడూ చూడలేదన్నారు. కార్యక్రమంలో ఏడీసీసీబీ చైర్మన్‌ లింగాల శివశంకర్‌రెడ్డి, మాజీ మేయర్‌ రాగే పరశురాం, నాయకులు తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి, చవ్వా రాజశేఖర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి గౌస్‌బేగ్, సంయుక్త కార్యదర్శులు నదీంఅహమ్మద్, మీసాల రంగన్న, నగర అధ్యక్షులు రంగంపేట గోపాల్‌రెడ్డి, అధికార  ప్రతినిధి  ఆలుమూరు శ్రీనివాసరెడ్డి, యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్‌ రాజీవ్‌రెడ్డి, ట్రేడ్‌ యూనియన్‌ నేత కొర్రపాడు హుసేన్‌పీరా, బీసీ సెల్, సేవాదళ్‌æ, ట్రేడ్‌ యూనియన్‌  జిల్లా అధ్యక్షులు పామిడి వీరాంజనేయులు, మిద్దె భాస్కర్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డి, బాలనరసింహారెడ్డి, మహిళా విభాగం నగర అధ్యక్షురాలు శ్రీదేవి పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement