
మృత్యువుతో పోరాటం
♦ విషమంగా వైఎస్సార్‌సీపీ కార్యకర్త బాబులు పరిస్థితి
♦ దాడికి బాధ్యులు ఎమ్మెల్యే అనుచరులే..
కోట(గూడూరు): టీడీపీ వర్గీయుల దాడిలో తీవ్రంగా గాయపడి నెల్లూరు నారాయణ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్సార్‌సీపీ నాయకులు బాబులు, శ్రీధర్‌ల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వీరిలో బాబులు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైఎస్సార్‌సీపీ నాయకులు తెలిపారు. వైఎస్సార్‌సీపీ నాయకుడు పేర్నాటి శ్యాంప్రసాద్‌రెడ్డి తన అనుచరులపై దాడిని ఖండించారు. మరో వైపు కొత్తపట్నం పంచాయతీ పరిధిలోని నాలుగు గ్రామాల్లో శనివారం కూడా పోలీస్ పహారా కొనసాగింది.
వాకాడు సీఐ సత్యనారాయణ, గూడూరు రూరల్ సీఐ అక్కేశ్వరరావు, ఆరుగురు ఎస్సైలు, సిబ్బంది పికెట్ ఏర్పాటు చేశారు. అట్రాసిటీ డీఎస్పీ సుధాకర్ కొత్తపట్నంలో జరిగిన ఘటనపై విచారణ జరిపారు. దాడి చేసిన కొత్తపట్నం ఎంపీటీసీ, టీడీపీ నాయకుడు తిరుపాలయ్య గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్‌కు ముఖ్య అనుచరుడని తెలుస్తోంది. తిరుపాలయ్యతోపాటు ముద్దాయిలను కాపాడేందుకు ఎమ్మెల్యేనే స్వయంగా రంగంలోకి దిగి కేసు తీవ్రతను తగ్గించేలా పోలీస్ అధికారులపై ఒత్తిడి పెంచినట్లు సమాచారం.
ఫ్యాక్షన్ ఏరియాగా మారుతున్న కోట మండలం
కోట మండలంలో అధికారపార్టీ నేతల ఆగడాలకు, దౌర్జన్యాలకు అంతే లేకుండాపోతోంది. ఎమ్మెల్యే అండదండలు ఉండడంతో గ్రామాల్లో వివాదాలకు ఆజ్యం పోస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారు. ఒకవైపు కేసవరం పంచాయతీ రాఘవాపురంలో పోలీస్ పికెట్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇక్కడ రెండు నెలలుగా ఇరువర్గాల మధ్య ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. ఇరువర్గాల వారు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ అనుచరులే కావడం గమనార్హం. ఒకరు తొలి నుంచి టీడీపీలో ఉన్న వారు కాగా ఎమ్మెల్యేతోపాటు టీడీపీలోకి వెళ్లిన వారు మరొకరు.
సమర్థులైన పోలీసు అధికారులు ఉన్నా ఒత్తిళ్ల కారణంగా నిస్సహాయస్థితిలో ఉంటూ ఘర్షణలను నివారించలేకపోతున్నారు. ఇరువర్గాలకు చెందిన 60 మందిపై కేసులు నడుస్తున్నాయి. మండలంలో ఇదే విషయమై చర్చ జరుగుతుండగా తాజాగా కొత్తపట్నం పంచాయతీలో చోటుచేసుకున్న దాడులు ప్రజల్ని భయపెడుతున్నాయి. భూవివాదమై మాట్లాడుకునేందుకు పిలిచి ఎమ్మెల్యే అనుచరుడు తిరుపాలయ్య ముందుగా వేసుకున్న పథకం ప్రకారం వైఎస్సార్‌సీపీ నేత పేర్నాటి అనుచరులపై మారుణాయుధాలతో దాడి చేశారు.