కార్మికుల హక్కులు కాల రాస్తున్నాయ్
అనంతపురం : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నాయకులు ధ్వజమెత్తారు. వైఎస్సార్‌సీపీ ట్రేడ్ యూనియన్ 7వ ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళవారం జిల్లా కార్యాలయంలో ఘనంగా జరుపుకొన్నారు. ట్రేడ్ విభాగం జిల్లా అధ్యక్షులు మరువపల్లి ఆదినారాయణరెడ్డి అధ్యక్షతన జరిగిన వేడుకల్లో ముందుగా పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన సాగుతోందన్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు బరి తెగిస్తున్నారన్నారు. అధికారులపైన, మహిళలపైన దౌర్జన్యాలకు పాల్పడుతున్నారన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు దుప్పటి పంచాయితీలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చాక విద్యా, వైద్య రంగాలు సర్వనాశనం అయ్యాయన్నారు. వైఎస్సార్‌సీపీ క్రమశిక్షణ సంఘం సభ్యులు బి.ఎర్రిస్వామిరెడ్డి, మాజీ మేయర్ రాగే పరుశురాం, నాయకులు చవ్వా రాజశేఖరరెడ్డి మాట్లాడుతూ అధికారంలో వస్తే కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేస్తామని చెప్పిన చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత విస్మరించారని మండిపడ్డారు. కార్మికుల న్యాయమైన హక్కులు, సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ పోరాడుతుందన్నారు. మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు నదీం అహ్మద్ మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో ఐజీ స్థాయి అధికారికే రక్షణ లేకపోతే ఇక సాధారణ ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు.
మరువపల్లి ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ట్రేడ్ విభాగం ఎప్పుడూ కార్మికుల పక్షాన ఉంటుందన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి గౌస్‌బేగ్, సంయుక్త కార్యదర్శి మీసాల రంగన్న, నగర అధ్యక్షులు రంగంపేట గోపాల్‌రెడ్డి, అనంత చంద్రారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధులు చింతకుంట మధు, ఆలమూరు శ్రీనివాసరెడ్డి, ప్రధానకార్యదర్శులు కాలువ వెంకటరాముడు, రామచంద్రారెడ్డి, నాయకులు రిలాక్స్ నాగరాజు, యూపీ నాగిరెడ్డి, షఫీ, జేఎం బాషా, పాన్ సాదిక్, నిమ్మల నాగరాజు, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బోయ సుశీలమ్మ, కృష్ణవేణి, శ్రీదేవి, దేవి, కొండమ్మ, హజరాబి, షమీమ్, విద్యార్థి విభాగం నాయకులు బండి పరుశురాం, నరేంద్రరెడ్డి, షహతాజ్ తదితరులు పాల్గొన్నారు.