నేడే ‘హోదా’ భేరీ
►రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో శాంతియుత ఆందోళనలు
►‘జల్లికట్టు’ పోరాటం స్ఫూర్తితో ర్యాలీలు, కొవ్వొత్తుల ప్రదర్శనలు
►పాల్గొననున్న వైఎస్సార్‌సీపీ, ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు,
విద్యార్థి, యువజన సంఘాలు
►ఆందోళన కార్యక్రమాలకు అనుమతి లేదన్న పోలీసులు
►నేతలను ముందుగానే అదుపులోకి తీసుకోవాలని యోచన
►ఆంక్షలతో పోరాటాన్ని అణచలేరని యువత స్పష్టీకరణ
సాక్షి నెట్‌వర్క్: ప్రత్యేక హోదా సాధనే ధ్యేయంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో శాంతియుత ఆందోళనకు రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు సమరోత్సాహంతో సన్నద్ధమవుతున్నాయి. తమిళనాడులో విజయవంతమైన జల్లికట్టు ఉద్యమం స్ఫూర్తితో ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్‌లోనూ ఈ నెల 26న గణతంత్ర దినోత్సవం రోజు జిల్లా కేంద్రాల్లో శాంతియుత ఆందోళన చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోపాటు యువజన సంఘాలు పిలుపునిచ్చాయి. పాలకుల కళ్లు తెరిపించేలా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని పేర్కొన్నాయి. కాంగ్రెస్, వామపక్షాలు, లోక్‌సత్తా తదితర పార్టీలు, బీసీ సంఘాలు, ఇతర ప్రజాసంఘాలు కూడా ప్రత్యేక హోదా సాధన కోసం పోరుబాట పట్టాలని నిర్ణయించాయి.
అణచివేతకు ప్రభుత్వ కుట్ర
ప్రత్యేక హోదా కోసం నినదించే గళాలను అణచివేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకారులను ఎక్కడికక్కడ నిలువరించేందుకు భారీగా పోలీసు బలగాలను మోహరిస్తోంది. రాష్ట్రంలో ఆందోళనా కార్యక్రమాలకు ఎలాంటి అనుమతి లేదని పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికే ప్రకటించారు. పలుచోట్ల 144 సెక్షన్ విధించారు. చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ప్రత్యేక హోదా ఉద్యమంలో పాల్గొంటారని భావిస్తున్న ప్రతిపక్ష నేతలు, ప్రజా సంఘాలు, యువజన సంఘాల ప్రతినిధులను ముందస్తుగానే అదుపులోకి తీసుకోవాలని యోచిస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా నిరసన కార్యక్రమాల్లో పాల్గొని తీరుతామని యువత తేల్చిచెబుతున్నారు.
ఆర్‌కే బీచ్‌లో నిరసనకు జగన్ రాక
విశాఖపట్నంలోని ఆర్‌కే బీచ్‌లో నిర్వహిం చనున్న కొవ్వొత్తుల ప్రదర్శనకు ఇప్పటికే జనం రాక మొదలైంది. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. విజయ నగరంలో గురువారం కోట జంక్షన్ నుంచి గంటస్తం భం మీదుగా అంబేడ్కర్ జంక్షన్ వరకు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించనున్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని వైఎస్సార్ కూడలి వద్ద కొవ్వొత్తులు వెలిగించి ప్రత్యేక హోదా విషయంలో ప్రభుత్వ తీరుపై నిరసన తెలపనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఫైర్‌స్టేషన్ సెంటర్‌లో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించనున్నారు. జిల్లాలో ఇప్పటికే 144 సెక్షన్ ఉండగా, మంగళవారం నుంచి సెక్షన్ 30 కూడా అమలు చేస్తున్నారు. అలాగే తూర్పు గోదావరి జిల్లా కేంద్రమైన కాకినాడలో కొవ్వొత్తుల ప్రదర్శనకు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. సాయంత్రం ఐదు గంటలకు కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని వైఎస్సార్ విగ్రహం నుంచి ప్రారంభమయ్యే కొవ్వొత్తుల ప్రదర్శన భానుగుడి సెంటర్ వరకు కొనసాగనుంది. గుంటూరులోనూ నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు నేతలు, యువకులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
పోలీసుల తనిఖీలు
అనంతపురంలోని సుభాష్‌రోడ్డులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖ రరెడ్డి విగ్రహం వద్ద నుంచి టవర్‌క్లాక్ వరకూ కొవ్వొత్తులతో భారీ ప్రదర్శన చేపట్టనున్నారు. వైఎస్సార్ జిల్లా కేంద్రమైన కడపలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనున్నారు. నగరంలో బుధవారం యువతీ యువకులు పెద్ద ఎత్తున కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. కర్నూలు జిల్లా కేంద్రంలో ఆందోళన కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రజలు జిల్లా కేంద్రానికి తరలిరాకుండా పోలీసులు తనిఖీల పేరుతో హడావుడి చేస్తున్నారు. చిత్తూరు వీధుల్లో కొవ్వొత్తుల ర్యాలీకి నాయకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఒంగోలు కలెక్టరేట్ (ప్రకాశం భవనం) వద్ద కొవ్వొత్తుల ప్రదర్శనకు వైఎస్సార్‌సీపీ సిద్ధమైంది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలో గాంధీ విగ్రహం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు భారీ ఎత్తున కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ జరపాలని వైఎస్సార్‌సీపీ నిర్ణయించింది.