
పీలేరు కేసుకూ ప్రాణం...
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిపై టీడీపీ ప్రభుత్వ కక్షసాధింపు మరింత పెరిగింది. పాతకేసులన్నింటినీ తిరగదోడే ప్రయత్నాలు ప్రారంభించింది. 2009లో గోడరాతలు రాశారన్న కారణంతో పీలేరు పోలీసులు నమోదు చేసిన కేసును తాజాగా వెలికితీశారు. ఆ కేసులో చెవిరెడ్డిని పీలేరు పోలీ సులు గురువారం కస్టడీకి తీసుకున్నారు.
సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో నమోదైన కేసు ను తిరగదోడి నాలుగురోజుల క్రితం చెవిరెడ్డిని అరెస్టు చేసి నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించిన సంగతి తెల్సిందే. అక్కడే ఉన్న చెవిరెడ్డిని పీలేరు పోలీసులు పీటీ వారెంట్‌పై అదుపులోకి తీసుకున్నారు.
గురువారం రాత్రి ఆయనను పీలేరు అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి వెంకటకవిత ఎదుట హాజరుపరిచారు. ఎమ్మెల్యేకి ఫిబ్రవరి 3 వరకు జడ్జి రిమాండ్ విధించారు. అనంతరం పోలీసు భద్రత నడుమ చెవిరెడ్డిని తిరిగి నెల్లూరు సెంట్రల్ జైలుకు తీసుకెళ్లారు.