చంద్రబాబు పతనం మొదలైంది: గడికోట
కదిరి : మంత్రివర్గ విస్తరణతో సీఎం చంద్రబాబు నాయుడి పతనం మొదలైందని వైఎస్సార్‌సీపీ రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన అనంతపురం జిల్లా కదిరి పట్టణంలోని పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ పీవీ సిద్దారెడ్డి స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో టీడీపీ తరఫున గెలిచిన ఓ ఎమ్మెల్యే టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో చేరితే చంద్రబాబు పెద్ద పెద్ద మాటలన్నారని, అయితే ఇప్పుడు తమ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. నీతులు చెప్పడానికేనా? ఆచరించడానికి కాదా? అని నిలదీశారు.
అన్ని పార్టీల కలయికతో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడం బహుశా దేశంలోనే ఎన్నడూ చూడలేదని ఎద్దేవా చేశారు. ముస్లిం మైనార్టీలకు మంత్రి పదవి ఇస్తానని ఆశలు కల్పించి విస్తరణలో మొండిచేయి చూపారన్నారు. వచ్చే ఎన్నికల్లో మైనార్టీలు టీడీపీకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. కదిరి, రాయచోటి ప్రాంతాలనుంచి ఎంతోమంది పొట్టకూటికోసం వివిధ ప్రాంతాలకు వలసలు వెళుతున్నారని, అయితే.. మెరుగైన జీవితం గడిపేందుకే కేరళ, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లారని ఈ ప్రభుత్వం చెప్పడం దారుణమని గడికోట దుయ్యబట్టారు. అక్కడ అడుక్కోవడం మెరుగైన జీవితమా? అని ప్రశ్నించారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కరువు రావడం సహజమన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సిద్దారెడ్డి తదితరులు పాల్గొన్నారు.