హైదరాబాద్: కృష్ణా జిల్లాలో ముగ్గురు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని నూజివీడు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు మండిపడ్డారు. గురువారం ఆయన హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడారు. ఏడాది తర్వాత టీడీపీ ఎమ్మెల్యేలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి క్యూ కడతారని ఆయన జోస్యం చెప్పారు. ప్రస్తుతం ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకల్లా తయారైందంటూ ఆయన ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి ఎందుకు వచ్చామా అని ఇప్పుడు వారంతా బాధ పడుతున్నారని మేకా ప్రతాప్ అప్పారావు అన్నారు.