
అసెంబ్లీలో ఏకపక్ష ధోరణి
శాసనసభా సమావేశాల్లో ఏకపక్ష ధోరణి కొనసాగుతున్నందుకే స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై తమ పార్టీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించిందని వైఎస్సార్‌సీపీ
♦ అందుకే స్పీకర్‌పై ‘అవిశ్వాసం’
♦ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల కో-ఆర్డినేటర్ శ్రీకాంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: శాసనసభా సమావేశాల్లో ఏకపక్ష ధోరణి కొనసాగుతున్నందుకే స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై తమ పార్టీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించిందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల కో-ఆర్డినేటర్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు. ఆయన సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. శాసనసభలో తాము(వైఎస్సార్‌సీపీ సభ్యులు) మాట్లాడినపుడు ఒక విధంగా, వాళ్లు(టీడీపీ సభ్యులు) మాట్లాడితే మరో విధంగా స్పీకర్ వ్యవహరిస్తున్నారని అన్నారు. శాసనసభ నుంచి ప్రత్యక్ష ప్రసారం కాని దృశ్యాలను స్పీకర్ అనుమతితోనే విడుదల చేస్తున్నామని ప్రభుత్వ చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు ఓవైపు చెబుతూ ఉండగా మరోవైపు తనకు తెలియదని స్పీకర్ చెప్పడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు.
వైఎస్సార్‌సీపీ సభ్యురాలు రోజా శాసనసభలో అభ్యంతరకరంగా ప్రవర్తించారంటూ సోషల్ మీడియాలో వచ్చిన దృశ్యాల్లో ఆమె అనని మాటలు అన్నట్లుగా ఎడిటింగ్ చేశారని ఆరోపించారు. స్పీకర్, శాసనసభ కార్యదర్శి, అసెంబ్లీ ప్రసార హక్కులు తీసుకున్న టీవీ... అందరూ కలిసి కుట్ర పన్ని, వైఎస్సార్‌సీపీ నేతలను అప్రతిష్టపాలు చేసేందుకు పూనుకున్నారని మండిపడ్డారు.
స్పీకర్ గారూ! టీడీపీ వాళ్ల తిట్లు వినిపించవా?
ప్రతిపక్ష సభ్యులనుద్దేశించి సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరం కావా? అని శ్రీకాంత్‌రెడ్డి నిలదీశారు. అధికారపక్షం సభ్యులు అసెంబ్లీలో పలు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఆయన టీవీలో ప్రదర్శించారు. వారంతా ఇష్టం వచ్చినట్లు మాట్లాడినా స్పీకర్ కనీసం నియంత్రించే ప్రయత్నం చేయలేదని శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు ఇష్టానుసారంగా ప్రతిపక్ష నేతను దూషించినా, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను దుర్భాషలాడినా స్పీకర్‌కు తప్పనిపించలేదా? అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. శాసనసభలో ప్రజా సమస్యలు చర్చకు రానీయకుండా అధికారపక్షం అడ్డుకుంటోందని విమర్శించారు. వాటిని ప్రస్తావించడానికి పోడియం వద్దకు వెళితే స్పీకర్ ఇష్టానుసారంగా అధికారపక్ష సభ్యులతో తిట్టిస్తున్నారని విమర్శించారు.