బాబు పాలనలో అధికారులకే దిక్కులేదు
ఏలూరు: సీఎం చంద్రబాబునాయుడు పాలనలో అధికారులకే దిక్కులేకుండా పోయిందని ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత నాయకుల పాలనతో ప్రస్తుత ఎమ్మెల్యేలను పోల్చిచూస్తే రౌడీలే నాయకులయ్యారన్నారు. ఒక మేజిస్ట్రేట్‌గా ఫైరింగ్ ఆదేశాలు ఇవ్వగలిగిన తహసీల్దార్‌ను సైతం జుట్టుపట్టి లాగిన నాయకులు పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్నారన్నారు.
రాజకీయాలను నేరమయం చేశారని, ఇటువంటి నాయకులను ఎన్నుకునే ముందు ప్రజలు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని అన్నారు. జిల్లా అధికారులకు కూడా దిక్కు లేకుండాపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరహా పాలనపై కార్యకర్తలు గ్రామ గ్రామానికి వెళ్లి ప్రజల్ని చైతన్యవంతులను చేయాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రబాబునాయుడు వెనుకబడిన తరగతుల కోసం మేనిఫెస్టోలో 120 హామీలు ఇచ్చినా ఒక్కటి కూడా అమలు కాలేదన్నారు. డ్వాక్రా, రైతు రుణమాఫీ హామీ మనం కూడా ఇద్దామని ఎన్నికల ముందు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని తాము అడిగామని, ఆయన నాలుగు రోజులు గడువు అడిగి ఆ తర్వాత దానిపై ఆర్థిక నిపుణులతో అధ్యయనం చేయించిన తర్వాత ‘30 ఏళ్లు రాజకీయాల్లో ఉండాల్సిన వయసు మనది. ప్రజల్ని అమలు కాని హామీలతో మోసం చేయడం సరికాదు’ అని చెప్పారని గుర్తు చేసుకున్నారు.
గత ఏడాది బ్యాంకర్లు రూ.55 వేల కోట్లను రైతులకు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా.. రూ.19 వేల కోట్లు మాత్రమే ఇచ్చారని పేర్కొన్నారు. రుణమాఫీ కారణంగా రైతులు డిఫాల్టర్లుగా మారడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందన్నారు. డ్వాక్రా వ్యవస్థ కుప్పకూలడానికి చంద్రబాబు ప్రకటించిన రుణమాఫీయే కారణమన్నారు. ఇసుక, చివరకు మట్టితో కూడా వ్యాపారం చేస్తున్నారని, డబ్బుతోనే మళ్లీ గెలవచ్చని చంద్రబాబునాయుడు భావిస్తున్నారని చెప్పారు. వచ్చే రెండేళ్లపాటు పోరాటం చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసం కార్యకర్తలు సర్వశక్తులు ఒడ్డాల్సిన అవసరం ఉదన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సర్వే చేయిస్తే 72 శాతం ప్రజలు వారిని వ్యతిరేకిస్తున్నట్టు తేలిందని చెప్పారు.