‘పచ్చ’పాతంపై కన్నెర్ర | YSRCP protest in black dress and attends assembly | Sakshi
Sakshi News home page

‘పచ్చ’పాతంపై కన్నెర్ర

Published Sun, Mar 20 2016 2:44 AM | Last Updated on Sun, Sep 3 2017 8:08 PM

‘పచ్చ’పాతంపై  కన్నెర్ర

‘పచ్చ’పాతంపై కన్నెర్ర

అసెంబ్లీలో అడుగిడకుండా రోజాను అడ్డుకోవడంపై ఆగ్రహం
నల్లబ్యాడ్జీలతో వైఎస్సార్ సీపీ శ్రేణుల నిరసన ప్రదర్శనలు
టీడీపీ సర్కారు దుర్నీతిపై మార్మోగిన నినాదాలు
అంబేడ్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు, రాస్తారోకోలు

కాకినాడ:  ప్రజాస్వామిక విలువలకూ, సంప్రదాయాలకూ స్వచ్ఛమైన అద్దంలా ఉండాల్సిన శాసనసభ.. పచ్చజాగీరుగా మారడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కన్నెర్రజేశాయి. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన సభాపతి ‘పచ్చ’పాతంతో వ్యవహరించడంపై దుమ్మెత్తిపోశాయి. తమ పార్టీ ఎమ్మెల్యే ఆర్‌కే రోజా సస్పెన్షన్ చెల్లదని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసినా జంకూగొంకూ లేకుండా ఆమెను అసెంబ్లీలోకి అనుమతించక పోవడంపై ఆగ్రహంతో భగ్గుమన్నాయి. పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయానుసారం, జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ పిలుపు మేరకు శనివారం అన్ని నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ‘ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి-రాజ్యాంగాన్ని గౌరవించండి’ అనే నినాదం జిల్లా అంతటా మార్మోగింది. స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ముఖ్యమంత్రి చంద్రబాబుల తీరును మార్చాలంటూ అంబేడ్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు అందజేశారు.

 ప్రత్తిపాడులో..
ఎమ్మెల్యే రోజాను అసెంబ్లీలోకి అడుగు పెట్టకుండా అడ్డుకోవడాన్ని నిరసిస్తూ ఏలేశ్వరంలో ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు.

అమలాపురంలో..
అమలాపురం మద్దాలవారిపేటలో వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యులు కుడుపూడి చిట్టబ్బాయి, పినిపే విశ్వరూప్‌లు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రోజాను అసెంబ్లీలోకి అడుగు పెట్టకుండా అడ్డుకోవడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని వారు  పేర్కొన్నారు. ఈదరపల్లిలో అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. ఉప్పలగుప్తంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి దంగేటి రాంబాబు ఆధ్వర్యంలో, అల్లవరంలో రాష్ట్ర కార్యదర్శి బొమ్ము ఇజ్రాయిల్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు.

పిఠాపురంలో..
పిఠాపురం-కాకినాడ జాతీయ రహదారిలో నర్సింగపురం వద్ద మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, నాయకులు, కార్యకర్తలు అర్ధనగ్నంగా రాస్తారోకో చేశారు. అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి వినతి పత్రం అందజేశారు. జిల్లా సంయుక్త కార్యదర్శులు కారే శ్రీను, కర్రి ప్రసాద్, జిల్లా సెక్రటరీ మొగలి అయ్యారావు తదితరులు పాల్గొన్నారు.

రాజమహేంద్రవరం రూరల్‌లో..
కడియంలో రూరల్ కోఆర్డినేటర్, మాజీ ఎంపీ గిరజాల వెంకటస్వామినాయుడు ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన వ్యక్తం చేశారు. అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. తహశీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి గిరజాల బాబు తదితరులు పాల్గొన్నారు. ధవళేశ్వరంలో రూరల్ కోఆర్డినేటర్ ఆకుల వీర్రాజు ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు.

రాజానగరంలో..
పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి రోజాను అసెంబ్లీలో అడుగుపెట్టకుండా అడ్డుకోవడం అప్రజాస్వామికమన్నారు. నియోజకవర్గంలోని మండల కమిటీల ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహాల వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు టీడీపీ వైఖరికి నిరసన తెలిపారు. రాజానగరంలో మండల సమావేశం జరుగుతుండగా వైఎస్సార్ సీపీ శ్రేణులు లోపలకు వెళ్ళడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ప్రభుత్వ వైఖరికి నిరసనగా బయటే ఆందోళన చేశారు.

 పి.గన్నవరంలో..
పార్టీ కో ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు, నాయకులు, కార్యకర్తలు పి.గన్నవరం మూడురోడ్ల సెంటర్లో  నల్లబ్యాడ్జీలు ధరించి, మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. మామిడికుదురు, అంబాజీపేట సెంటర్లలో అంబేడ్కర్ విగ్రహాలు ఎదుట నినాదాలు చేశారు.

 రాజోలులో..
పార్టీ కో ఆర్డినేటర్ అల్లూరు కృష్ణంరాజు ఆధ్వర్యంలో వైఎస్సార్  విగ్రహం వద్ద కళ్ళకు గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని, న్యాయ స్థానాలను ఖౠతరు చేయకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు అరాచకంగా పాలిస్తున్నారని విమర్శించారు.

 కాకినాడ రూరల్‌లో..
నియోజకవర్గ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో కరప పీహెచ్‌సీ ఎదురుగా ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్ద  తెలుగుదేశం వైఖరికి నిరసనగా నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రోజాను అసెంబ్లీలోకి అడుగుపెట్టనివ్వకపోవడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అన్నారు.

 అనపర్తిలో..
కో ఆర్డినేటర్ డాక్టర్ సత్తిసూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో అనపర్తిలో అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.

 కాకినాడ సిటీలో..
పార్టీ కాకినాడ సిటీ కో ఆర్డినేటర్ ముత్తా శశిధర్, నగర అధ్యక్షుడు ఆర్‌వీజేఆర్ కుమార్‌ల ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. శశిధర్ మాట్లాడుతూ ప్రభుత్వం కోర్టు ధిక్కారానికి పాల్పడుతోందని విమర్శించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి నారాయణరావు, రాష్ట్ర ప్రచారకమిటీ ప్రధాన కార్యదర్శి  రావూరి వెంకటేశ్వరరావు, రాష్ట్ర బీసీసెల్ కార్యదర్శి అల్లి రాజబాబు తదితరులు పాల్గొన్నారు.

 ముమ్మిడివరంలో..
కో ఆర్డినేటర్ గుత్తుల సాయి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు నల్లబ్యాడ్జీలతో ముమ్మిడివరంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు.  జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టి అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు.

 కొత్తపేటలో..
రాష్ట్ర పార్టీ కార్యదర్శి గొల్లపల్లి డేవిడ్ రాజు ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వ విధానాలను దుయ్యబట్టారు. రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి బండారు రాజా, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు మార్గాని గంగాధర్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి ముసునూరి వెంకటేశ్వరరావు  తదితరులు పాల్గొన్నారు.

 మండపేటలో..
కో ఆర్డినేటర్ వేగుళ్ల పట్టాభిరాయ్య చౌదరి ఆధ్వర్యంలో స్థానిక ఎస్సీ కాలనీలో అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. నల్లబ్యాడ్జీలు కట్టుకుని రాజ్యాంగాన్ని రక్షించాలని కోరుతూ నినాదాలు చేశారు. రైతు విభాగం రాష్ర్ట కార్యదర్శి రెడ్డి రాధాకృష్ణ, అర్బన్ కన్వీనర్ పోతంశెట్టి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

 పెద్దాపురంలో..
కో ఆర్డినేటర్ తోట సుబ్బారావునాయుడు పెద్దాపురం మున్సిపల్ కార్యాలయం సెంటర్‌లో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి ప్రభుత్వ వైఖరికి నిరసనగా ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్ర కార్యదర్శులు జిగిని వీరభద్రరావు, ఆవాల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

 రామచంద్రపురంలో..
ప్రధాన రహదారిలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద పట్టణ కన్వీనర్ గాధంశెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో పార్టీ జిల్లా వైద్య విభాగం అధ్యక్షుడు డాక్టర్ యనమదల మురళీకృష్ణ, గీత దంపతులు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెట్టా శ్రీనివాసరావు, రైతు విభాగం నాయకులు కొవ్వూరి త్రినాథ్‌రెడ్డి, రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి మాగాపు అమ్మిరాజు తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగాన్ని గౌరవించాలని, చట్టాలను కాపాడాలని, ఎమ్మెల్యే రోజాను అసెంబ్లీలోకి అనుమతించాలని నినాదాలు చేశారు.

 రంపచోడవరంలో..
రంపచోడవరంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొమ్మిశెట్టి బాలకృష్ణ, జిల్లా కార్యదర్శి పత్తిగుళ్ళ రామాంజనేయులు, ఎంపీపీ అడగాటి సత్యనారాయణరెడ్డిల ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహం ఎదురుగా నిరసన ప్రదర్శన నిర్వహించారు.

 రాజమహేంద్రవరం సిటీలో..
రాజమహేంద్రవరం బస్టాండ్ సెంటర్‌లో పార్టీ నాయకుడు ఆదిరెడ్డి వాసు ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి  నిరసన వ్యక్తం చేశారు. నగరపాలక మండలిలో పార్టీ ఫ్లోర్‌లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి పోలు కిరణ్‌మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 జగ్గంపేటలో..
గండేపల్లిలో మండల పార్టీ అధ్యక్షుడు పరిమి బాబు ఆధ్వర్యంలో, జగ్గంపేటలో వైస్ ఎంపీపీ మారిశెట్టి భద్రం, సర్పంచ్ ప్రసన్నరాణిల  ఆధ్వర్యంలో, కిర్లంపూడి, గోకవరం మండలాల్లో ఆయా మండల పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహాల ఎదుట నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.

తునిలో..
తునిలో పార్టీ కార్యాలయం నుంచి నాయకులు, కార్యకర్తలు గొల్లప్పారావు సెంటర్ వరకు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించి, అక్కడ మానవహారంగా ఏర్పడి ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement