ప్రశ్నిస్తే కేసులా?
- వైఎస్ జగన్‌పై కేసు అప్రజాస్వామికం
- మండిపడిన వైఎస్సార్ సీపీ నాయకులు
- జిల్లావ్యాప్తంగా ధర్నాలు
- భారీగా హాజరైన పార్టీ శ్రేణులు, ప్రజలు
- రాష్ట్రానికి చంద్రబాబు రూపంలో పట్టిన శనిని సాగనంపాలని పిలుపు
కృష్ణా జిల్లాలో దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులను ప్రశ్నించిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అక్రమ కేసు బనాయించారంటూ వైఎస్సార్‌సీపీ శ్రేణులు మండిపడ్డాయి. ఈ చర్యను నిరసిస్తూ పార్టీ నాయకులు, కార్యకర్తలు గురువారం జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేపట్టారు. టీడీపీ ప్రభుత్వ అప్రజాస్వామిక తీరును దుయ్యబట్టారు. అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
అనంతపురం : ‘బస్సు ప్రమాదంలో పది మంది చనిపోతే హుటాహుటిన అక్కడికెళ్లి పరిస్థితిని సమీక్షించాల్సిన ముఖ్యమంత్రి, మంత్రులు వారి బాధ్యతను విస్మరించారు. కానీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అక్కడికి వెళ్లారు. మృతదేహాలకు పోస్టుమార్టం చేయకుండానే పంపేందుకు అధికారులు ప్రయత్నించడం చూసి ఇదేంటని బాధితుల తరఫున ప్రశ్నించారు. ప్రజల తరఫున ప్రశ్నించడం ప్రతిపక్ష నేతగా ఆయన బాధ్యత. దానికి కేసు నమోదు చేస్తారా? రాష్ట్రంలో ఏం జరుగుతోంది? చంద్రబాబు రూపంలో రాష్ట్రానికి శని పట్టుకుంది. ఈ శనిని సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు’ అని మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి అన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అక్రమ కేసులకు నిరసనగా గురువారం జిల్లా వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేపట్టారు.
ఇందులో భాగంగా అనంతపురం తహసీల్దార్ కార్యాలయం ఎదుట చేపట్టిన ధర్నాలో గురునాథరెడ్డి మాట్లాడారు. క్షతగాత్రులను పరామర్శించడం జగన్‌మోహన్‌రెడ్డి చేసిన తప్పా అని ప్రశ్నించారు. ప్రభుత్వ దుర్మార్గాలను ఎత్తి చూపుతున్న ఏకైక వ్యక్తి జగనే అని, దాన్ని జీర్ణించుకోలేకే ఆయనపై కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు. ఇలాంటి కేసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. గతంలో అనంతపురం తహసీల్దార్ మహబూబ్‌బాషాపై టీడీపీ కార్యకర్త దాడి చేస్తే ప్రభుత్వం కానీ, జిల్లా కలెక్టర్ కానీ ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. నగరపాలక సంస్థ కమిషనర్ సురేంద్రబాబుపై అధికార పార్టీ కార్పొరేటర్లు దుశ్చర్యలకు పాల్పడినా కలెక్టర్ స్పందించలేదన్నారు.
పోస్టుమార్టం నివేదిక అడిగితే కేసా?
రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్‌పై కేసు నమోదు చేయడం ప్రభుత్వ నిరంకుశ వైఖరికి అద్దం పడుతోందన్నారు. పోస్టుమార్టం నివేదిక అడిగినందుకు ప్రతిపక్ష నాయకుడిపై కేసు బనాయించారంటే ఇది ప్రజాస్వామ్యమేనా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీ నాయకులను భయభ్రాంతులకు గురి చేయడం ద్వారా ప్రభుత్వం తన ఉనికిని కాపాడుకోవాలని చూస్తోందని విమర్శించారు.
అనవసరంగా రెచ్చగొట్టొద్దని, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తల సహనాన్ని పరీక్షించొద్దని హెచ్చరించారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సింది పోయి అధికార పార్టీకి తొత్తుగా మారడం బాధాకరమన్నారు. పార్టీ నగర అధ్యక్షుడు రంగంపేట గోపాల్‌రెడ్డి అధ్యక్షతన చేపట్టిన ఈ ధర్నాలో కదలిక ఎడిటర్ ఇమాం, పార్టీ జిల్లా అధికార ప్రతినిధులు పోరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి, చింతకుంట మధు, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యోగీశ్వర్‌రెడ్డి, నాయకులు మహానందరెడ్డి, యూపీ నాగిరెడ్డి, తాటిచెర్ల నాగేశ్వరరెడ్డి, జయరాంనాయక్, మిద్దె భాస్కర్‌రెడ్డి, కొర్రపాడు హుసేన్‌పీరా, జేఎం బాషా, మారుతీనాయుడు, పరుశురాం, మిద్దె కుళ్లాయప్ప, శ్రీదేవి, కార్పొరేటర్లు బాలాంజనేయులు, షుకూర్, జానకి, సరోజమ్మ, పార్వతమ్మ, ఎంపీటీసీ సభ్యులు సుబ్బారెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- రాయదుర్గం పట్టణంలో మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ ఆఫీసు నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి..అనంతరం ధర్నా చేశారు.
- మడకశిర తహసీల్దార్ కార్యాలయం ఎదుట జరిగిన ఆందోళనలో నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ తిప్పేస్వామి తదితరులు పాల్గొన్నారు.
- కదిరిలో నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సిద్దారెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.
- కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని శెట్టూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నియోజకవర్గ సమన్వయకర్త ఉషశ్రీచరణ్ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి గంటపాటు నిరసన తెలియజేశారు.
- శింగనమల నియోజకవర్గంలోని యల్లనూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట చేపట్టిన నిరసనలో పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- ఉరవకొండ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాలో ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి బసవరాజు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
- గుంతకల్లు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డి అక్కడికి వెళ్లి ఆందోళనకారులను విడుదల చేయించారు.