మరో 'సారీ'! | yunamula ramakrishna did not get rajyasabha seat | Sakshi
Sakshi News home page

మరో 'సారీ'!

Published Wed, Jun 1 2016 11:00 AM | Last Updated on Mon, Sep 4 2017 1:25 AM

yunamula ramakrishna did not get rajyasabha seat

  • మంత్రి యనమలకుమళ్లీ భంగపాటు
  • పెద్దల సభలో ఈసారీ దక్కని సీటు
  • చేయిచ్చిన చంద్రబాబు
  • చిక్కాలకూ నిరాశే
  •  
     సాక్షి ప్రతినిధి, కాకినాడ : తెలుగుదేశం పార్టీలో అన్నింటా నంబర్-2 అని చెప్పుకునే రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుకి మరోసారి భంగపాటు తప్పలేదు. పెద్దల సభకు వెళ్లాలన్న ఆయన చిరకాల కోరిక తీరకుండానే.. రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. ఈ పరిణామంతో యనమల వర్గం డీలా పడింది. టీడీపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు తరువాత అంతటి ప్రాధాన్యం ఉన్న యనమలకు ఈసారి రాజ్యసభ సీటు ఖాయమని  జిల్లాలో ఆయన వర్గం విస్తృత ప్రచారం చేసుకుంది. చివరకు అదంతా ప్రచారానికే పరిమితమైంది.
     
     మూడు దశాబ్దాల రాజకీయ జీవితం ఉన్న యనమల.. గతంలో తునిలో ప్రజా వ్యతిరేకత ఎదురైన సందర్భంలోనే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. పెద్దల సభలో ప్రాతినిధ్యం లభిస్తుందని, ఇందుకు చంద్రబాబు ఆశీస్సులు కూడా ఉంటాయన్న నమ్మకంతోనే ఆయన ఆ రోజు ఆ నిర్ణయానికి వచ్చి ఉంటారని పార్టీ నేతలు చెబుతారు. యనమల ఆ నిర్ణయం తీసుకున్న తరువాత ఇప్పటివరకూ రెండుసార్లు రాజ్యసభ ఎన్నికలు జరిగాయి. ఆ రెండుసార్లు కూడా యనమలకు రాజ్యసభ స్థానం ఖాయమనే ప్రచారం తొలినుంచీ జరిగి, చివరకు ఆశలు ఆవిరైపోవడం రివాజుగా మారింది.
     
     షరా మామూలుగానే మొండిచేయి
     ఆవిర్భావం నుంచీ టీడీపీలో ఉన్న యనమల రెండుసార్లు పీఏసీ చైర్మన్‌గా, అసెంబ్లీ స్పీకర్‌గా, ఆర్థిక, వాణిజ్య పన్నుల శాఖల మంత్రిగా పని చేశారు. ప్రస్తుతం ఆర్థిక మంత్రిగా ఉన్నారు. 2009లో ఓటమి తరువాత తన రాజకీయ వారసుడిగా వరుసకు సోదరుడైన కృష్ణుడిని 2014 ఎన్నికల్లో బరిలోకి దింపారు. గతంలో తునిలో తన ఓటమికి కృష్ణుడి ఏకపక్ష విధానాలే కారణమని తెలిసి కూడా.. వారసుడిగా ఆయననే బరిలోకి దింపి, ఫలితాల్లో బోర్లా పడ్డారు. అంతకుముందే యనమలను ఎమ్మెల్సీని చేయడంతో రాజ్యసభ ఆశలకు నీళ్లొదులుకోవాల్సిందేనని చెప్పకనే చెప్పినట్టయింది. అయినప్పటికీ రాజ్యసభ తాజా ఎన్నికల్లో బీసీ కోటాలోనైనా యనమలకు బెర్తు ఖాయమని ఆయన వర్గీయులు ఆశలు పెట్టుకున్నారు. తీరా చూస్తే అవకాశం ఉన్న మూడింటిని సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, ఎన్‌డీఏ నుంచి సురేష్‌ప్రభుకు టీడీపీ కేటాయించింది. షరా మామూలుగానే యనమలకు మొండిచేయి చూపింది.
     
     చిక్కాలకూ చేయి!
     రాజ్యసభకు ద్వైవార్షిక ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ యనమల, మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నాయకుడు చిక్కాల రామచంద్రరావుల పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. ఈ దఫా కూడా జిల్లా నుంచి వారిద్దరి పేర్లూ తెరపైకి వచ్చాయి. ‘యనమల రాజ్యసభకు వెళ్లిపోతారు. జిల్లా రాజకీయాల్లో ఆయన వేలుపెట్టరు. జిల్లా అంతా నీ కనుసన్నల్లోనే ఉంటుంద’ని టీడీపీలోకి వెళ్లిపోయిన సందర్భంలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు పార్టీ పెద్దలు చెప్పారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఈసారి యనమలకు రాజ్యసభ సీటు ఖాయమనుకున్నారు. కానీ చివరకు నిరాశే ఎదురైంది. టీడీపీ రాజకీయాల్లో తలపండిన యనమల ఈ విషయాన్ని ముందే తెలుసుకుని ఉంటారు.
     
     అందుకే జిల్లాలో సీనియర్, కాపు సామాజికవర్గానికి చెందిన చిక్కాల పేరును రాజ్యసభకు పరిశీలించాల్సిందిగా అధిష్టానానికి చెప్పి ఉంటారని అంటున్నారు. వివాద రహితుడిగా, నిజాయితీపరుడిగా, పేరొందిన చిక్కాల రాజ్యసభ సీటుకు అన్నివిధాలా అర్హుడేనని పార్టీ నేతలు అంటున్నారు. కానీ ఈ రెండు అంశాలనూ ఏనాడూ పరిగణనలోకి తీసుకోని పార్టీ అధినేత చంద్రబాబు నైజాన్ని దగ్గరగా చూసి కూడా చిక్కాల పేరును యనమల ప్రతిపాదించడం విస్మయం కలిగిస్తోంది. ఇదే అంశాన్ని ఆ పార్టీ ముఖ్యులు అంతర్గత సంభాషణల్లో చర్చించుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement