
టీడీపీ దళిత నేత, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ వర్ల రామయ్యకు సీఎం చంద్రబాబునాయుడు మొండి చెయ్యి చూపించారు. రాజ్యసభ పదవికి వర్ల రామయ్య పేరును పరిశీలించిన చంద్రబాబు, చివరకు ఆయన్ను పక్కన పెట్టి టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు కనకమేడల రవీంద్రకుమార్‌కు కట్టబెట్టారు. దీంతో దళిత, బీసీ వర్గాలు భగ్గుమంటున్నాయి. వర్ల రామయ్య ఆగ్రహంతో రగిలిపోయారు.
సాక్షి, విజయవాడ: టీడీపీలో కీలక పదవులన్నీ ఒకే సామాజిక వర్గానికి ఇస్తున్నారని ఆ పార్టీకి చెందిన దళిత, బీసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుజనాచౌదరి, సీఎం రమేష్‌లతో సమానంగా వర్ల రామయ్యకు రాజ్యసభ సీటును ఎందుకివ్వరని దళిత నాయకులు ప్రశ్నిస్తున్నారు. పార్టీలో చేరినప్పటి నుంచి వర్ల రామయ్య పార్టీ అభివృద్ధికి కష్ట పడుతున్నారని ఆయనకు ఇచ్చే గుర్తింపు ఇదేనా.. అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీలో లాబీయింగ్‌లు, బలమైన శక్తులకే కీలకమైన పదవులు దక్కుతాయనే విషయం మరొకసారి నిరూపితమైందని ఆ పార్టీలోని వర్గాలు అంటున్నాయి. సీఐగా చేస్తున్న ఉద్యోగాన్ని వదిలివేసి టీడీపీలో చేరిన వర్ల రామయ్యకు 2009 ఎన్నికల్లో చివర నిమిషంలో తిరుపతి ఎంపీ టిక్కెట్ ఇవ్వడంతో ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో పామర్రు అసెంబ్లీ సీటు ఇస్తే ఉప్పులేటి కల్పన చేతిలో పరాజయం పాలయ్యారు. ఆ తరువాత ఎమ్మెల్సీ పదవిని ఆశించినప్పటికీ చివరకు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ సారి పామర్రు సీటు కూడా ఇచ్చే అవకాశం లేకపోవడంతో రాజ్యసభ సీటును వర్ల ఆశించి భంగపడ్డారు.
చంద్రబాబును ఆకట్టుకునేందుకు....
టీడీపీ అధినేత చంద్రబాబును ఆకట్టుకునేందుకు వర్ల రామయ్య విశ్వ ప్రయత్నం చేశారు. ఇటీవల విజయవాడలో మాదిగల మహాసభను నిర్వహించి మాదిగ హక్కుల పోరాట సమితికి చెందిన ఇద్దరు కీలకనేతల్ని టీడీపీలో చేర్పించారు. అదే సభలో చంద్రబాబును ఆకాశానికి ఎత్తుతూ ఆయన దళితులకు న్యాయం చేస్తారంటూ స్తుతించారు. సీటు వస్తుందనే నమ్మకంతో ఆదివారం తన కుటుంబసభ్యులతో కలిసి చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నించారు. చివరి నిమిషంలో ఆయనకు సీటు రాలేదని తెలుసుకుని నీరుకారిపోయారు. తన కుటుంబసభ్యులతో కలిసి వెనుతిరిగి వెళ్లిపోయారు. పార్టీ నిర్ణయం తనకు బాధ కలిగిస్తోందని ఆయన మీడియాతో బహిరంగంగానే చెప్పారు.
ఓటుకు కోట్లు కేసును చేపట్టినందుకేనా...?
చంద్రబాబు ఇరుక్కున్న ఓటుకు కోట్లు కేసును హైకోర్టు న్యాయవాది కనకమేడల రవీంద్ర కుమార్ వాదిస్తున్నారు. ఈ కేసులో చంద్రబాబు ఏ విధమైన ఇబ్బందులు పడకుండా ఉండేందుకు రవీంద్రకుమార్‌కు రాజ్యసభ సీటు ఇచ్చారని టీడీపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కృష్ణా జిల్లా అవనిగడ్డకు చెందిన రవీంద్రకుమార్ గతంలో బెజవాడ బార్ అసోసియేషన్‌లోనూ పనిచేశారు. ఆయన టీడీపీకి చేసిన సేవ కంటే చంద్రబాబుకు సహాయం చేసినందుకే ఈ పదవి దక్కిందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment