
అవినీతి రహిత సమాజం యువతతోనే సాధ్యం
లోక్‌సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ
బద్వేలు అర్బన్: అవినీతి రహిత సమాజం యువతతోనే సాధ్యమవుతుందని లోక్‌సత్తాపార్టీ జాతీయ అధ్యక్షులు, ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫామ్స్ జనరల్ సెక్రటరీ డాక్టర్ జయప్రకాష్ నారాయణ పేర్కొన్నారు. బుధవారం స్థానిక రాచపూడి నాగభూషణం డిగ్రీ మరియు పీజీ కళాశాలలో దేశాభివృద్ధిలో, అవినీతి రహిత సమాజ స్థాపనలో యువత పాత్ర అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రతి విద్యార్థి ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలని అప్పుడే అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారన్నారు. అందరికీ విద్య అందించినపుడే సమాజ నిర్మాణం కూడా బాగుంటుందన్నారు. సెంట్రల్ ఎక్సైజ్ అండ్ సర్వీస్ టాక్స్ అసిస్టెంట్ కమిషనర్ గంగిరెడ్డి తరుణ్‌రెడ్డి మాట్లాడుతూ సమాజంపై అవగాహన పెంచుకోవడంతోపాటు అనుకున్నది సాధించాలనే సంకల్పం ఏర్పరుచుకోవాలని అప్పుడే విజయం సాధించగలుగుతారన్నారు. సదస్సు అనంతరం పీపుల్ అగైనెస్ట్ కరప్షన్ అనుబంధ సంస్థ ప్రజ్ఞ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీ పరీక్షలలో మొదటి, ద్వితీయ, తృతీయ స్థానాలలో గెలుపొందిన పి.సుబ్బరాయుడు, రాజశేఖర్, ఐ.సునీల్‌కుమార్‌లకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కళాశాల వ్యవస్థాపకులు రాచపూడి నాగభూషణం, ఏవో రాచపూడి సాయిక్రిష్ణ, పీపుల్ అగైనెస్ట్ కరప్షన్ వ్యవస్థాపకులు మారంరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి, ఎస్‌ఐలు నరసింహారెడ్డి, రఫి, నూర్ అహ్మద్, తదితరులు పాల్గొన్నారు.