'అవినీతి పరులెవరో అందరికీ తెలుసు'
Published Sat, Jan 21 2017 9:09 PM | Last Updated on Sat, Mar 9 2019 4:13 PM
హైదరాబాద్: వ్యవస్థను మార్చాలంటే మ్యాజిక్ అవసరం లేదు.. నీతి, నిజాయితీ ఉంటే చాలని లోక్‌సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ అన్నారు. అవినీతిపరులు ఎవరో నాయకులందరికీ తెలిసినా తెలియనట్టు డ్రామాలు ఆడుతున్నారని వ్యాఖ్యానించారు. ఆయన పలు అంశాలపై విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రానికి వంద మంది చొప్పున భయంకర అవినీతి పరులను గుర్తించండి అని ప్రభుత్వానికి సూచించారు. కనీసం దేశంలో 1000 మంది అక్రమార్కులను గుర్తించినా అవినీతిని నియంత్రించినట్లేనని అన్నారు. అధికారం అంటే పెద్ద గోడలు, రాజ భవనాలు కట్టడం, చార్టెడ్ విమానాల్లో తిరగడం కాదు.. ప్రజలకు సేవ చేయటమేననిన్నారు.
నోట్ల రద్దుపై...
కేంద్ర ప్రభుత్వం నవంబర్ 8న తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంతో మొదటి ప్రభావం సామాన్యులపైనే పడిందని, ఆర్ధిక వ్యవస్థ దెబ‍్బతిందని జయప్రకాశ్ నారాయణ్ అన్నారు. నిజాయితీగా డబ్బు సంపాదించినా.. డబ్బు రూపంలోకి మార్చటం తప‍్పనిసరి అని అన్నారు. సామాన్యులకు డబ్బు, క్యాష్ లెస్ అవకాశాలు పెరగకపోతే నోట్ల రద్దు నిర్ణయం వృథా అయినట్లేనని తెలిపారు. రాష్ట్రం, కేంద్రం కలిసి కూర్చుని చర్చిస్తే ఇలాంటి సమస్యల పరిష్కారం ఈజీ అవుతుందని అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ విషయంలో చొరవ తీసుకుని రియల్ ఎస్టేట్ రంగంలో క్యాష్ వాడకం లేకుండా చేయాలని సూచించారు.
ఇప్పుడూ అవే రాజకీయాలు..
తెలంగాణ సీఎం కేసీఆర్ గ్రామీణ పోలీస్ అధికారులను నియమించడం మంచిదేనన్నారు. అలాగే, ఆరోగ్య రక్ష పథకం మంచి ఆలోచన అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పెంచాలని సూచించారు. జిల్లాల విభజన వల్ల నిధుల అందుబాటు పెరిగిందన్నారు. కొత్త జిల్లాలకు అధికారం వెళ్ళిందని చెప్పారు. అయితే, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న రాజకీయమే ఇప్పుడూ కొనసాగుతోందని తెలిపారు. అసెంబ్లీ సమావేశాల తీరులో పెద్ద మార్పు లేదన్నారు. శాసనసభ్యుడిని రాజకీయ పార్టీకి బానిస చేశారన్నారు. రెండు రాష్ట్రాలు చెడు విషయాల్లో కాకుండా మంచి విషయాల్లో పోటీ పడాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజల అవసరాలు తీరటం ముఖ్యం.. ప్రజలకు సేవలు అందేలా చూడటం ముఖ్యం. లోక్‌సత్తా కార్యక్రమాల ఫలితంగా రాజకీయాల పట్ల ప్రజల్లో విముఖత తగ్గింది.
జల్లికట్టు అంశంపై...
జల్లికట్టు విషయంలో జాతీయ స్థాయి నిర్ణయాలు ఎందుకన్నారు జయప్రకాశ్ నారాయణ్. ఈ విషయాన్ని ఆ రాష్ట్రం చూసుకుంటుందని అన్నారు. అధికార కేంద్రీకరణ చాలా అపాయకరమని చెప్పారు. నలబై ఏళ్ల క్రితం కందిమల్లయ్యపల్లెలో జంతు బలి సందర్భంగా పోలీసు కాల్పుల్లో ప్రజలు చనిపోయారని గుర్తు చేశారు.
Advertisement
Advertisement