
రోడ్డు పక్కకు దూసుకు పోయిన బస్సు
రాయవరం (మండపేట): ఈ విద్యా సంవత్సరంలో పాఠశాల బస్సులకు స్పీడ్ గవర్నర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకున్న రవాణా శాఖ, ఇప్పుడు జీపీఎస్ వ్యవస్థను ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని పాఠశాల, కళాశాల బస్సులకు జీపీఎస్ ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటికే రవాణాశాఖకు ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. జీపీఎస్ అమలు చేయడంపై మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్లు(ఎంవీఐ), పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలతో చర్చించి ప్రణాళిక రూపొందించనున్నారు. ఈ విధానం అమలుపై బస్సుల యాజమాన్యాలతో అవగాహన, చైతన్య సదస్సులు ఏర్పాటు చేయాలని కూడా భావిస్తున్నారు. ఈ వ్యవస్థ ఇటు యాజమాన్యానికి, ఇటు తల్లిదండ్రులకు ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు.
యాజమాన్యాలకు అవగాహన
జీపీఎస్ వ్యవస్థను అమలు చేసుకోవడం వల్ల కలిగే లాభాలు, విద్యార్థులకు కలిగే ప్రయోజనాలపై రవాణా శాఖ అధికారులు త్వరలో సంబంధిత యాజమాన్యాలతో అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. అలాగే తల్లిదండ్రులకు ప్రత్యేక సమావేశం నిర్వహించి చైతన్యం చేస్తారు. నాణ్యత ప్రమాణాల ఆధారంగా ధర రూ.4వేల నుంచి రూ.6వేల వరకు ఉంటుంది. జీపీఎస్ పరికరం బస్సులకు అమర్చడంలో సంబంధిత యాజమాన్యాలు అయిష్టత ప్రదర్శించే అవకాశం ఉంది. అయితే జీపీఎస్ అమర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను సవిరంగా తెలియజేసి వారు అమర్చుకునే విధంగా అధికారులు అవగాహన కల్పించనున్నారు. జీపీఎస్ వల్ల బస్సు డ్రైవర్ల పనితీరు క్షుణ్ణంగా తెలిసే వీలుంటుంది.
జిల్లాలో పరిస్థితి ఇదీ..
జిల్లా వ్యాప్తంగా పాఠశాల, కళాశాల బస్సులు సుమారు 3500 ఉన్నాయి. అనుకోని సంఘటన జరిగితే ఎక్కడ, ఎలా ప్రమాదం జరిగిందో జీపీఎస్ వల్ల తెలుసుకునే అవకాశం ఉంటుంది. పాఠశాల/కళాశాల బస్సులు ఎలా వెళ్తున్నాయి అనే విషయాన్ని సెల్‌ఫోన్‌లోనే యాప్‌ను క్లిక్ చేసి చూసే వీలుంటుంది. ఎక్కడైనా ప్రమాదం జరిగితే ఏ ప్రాంతంలో జరిగిందో స్పష్టంగా తెలుసుకునే వీలుంటుంది.
ప్రత్యేక యాప్..
పాఠశాల, కళాశాల బస్సులకు జీపీఎస్ వ్యవస్థను అమర్చిన తర్వాత సంబంధిత వివరాలు తల్లిదండ్రులు, బస్సు యాజమాన్యాలు తెలుసుకోవడానికి వీలుగా ప్రత్యేక యాప్ తయారు చేస్తున్నట్లు సమాచారం. యాప్‌ను జీపీఎస్‌కు అనుసంధానం చేసిన తర్వాత విద్యార్థుల తల్లిదండ్రుల సెల్‌ఫోన్‌లో ఈ ప్రత్యేక యాప్‌ను డౌన్‌లోడ్ చేయించి దాన్ని ఎక్కడి నుంచైనా పరిశీలించేలా చర్యలు చేపట్టనున్నారు. బస్సు బయలు దేరిన దగ్గర నుంచి పాఠశాల/కళాశాలకు చేరేంత వరకు ఎన్ని సార్లు ఆగింది, ఏ ఏ కూడళ్లలో అగింది, తదితర వివరాలు యాప్‌లో స్పష్టంగా తెలుస్తాయి. ఈ విధానం అందుబాటులోకి వస్తే విద్యార్థులకు మరింత భద్రత కల్పించినట్లవుతుంది.
విద్యార్థుల భద్రత కోసమే..
విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకునే పాఠశాల/కళాశాల బస్సులకు జీపీఎస్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచించింది. జీపీఎస్ వ్యవస్థ ఏర్పాటు మంచి ఆలోచన. ఇది యాజమాన్యాలకు, విద్యార్థుల తల్లిదండ్రులకు ఉపయోగకరంగా ఉంటుంది. జీపీఎస్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఆదేశాలు వచ్చాయి. త్వరలోనే అవగాహన సమావేశాలు ఏర్పాటు చేసి, ప్రభుత్వం రూపొందించే నియమ నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటాం. – జి.సంజీవ్‌కుమార్, ఎంవీఐ, మండపేట
Comments
Please login to add a commentAdd a comment