అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ నెల 24, 25 తేదీల్లో మన దేశం పర్యటించబోతున్నారు. దీన్ని మన దేశం మాత్రమే కాదు...ట్రంప్ సైతం విశేషమైన సందర్భంగా పరిగణిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ 2017లో అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ట్రంప్‌ను అనేకసార్లు కలిశారు. కానీ ట్రంప్ తొలిసారి మన దేశం వస్తున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు మరో తొమ్మిది నెలల్లో రాబోతుండగా జరగనున్న ఈ పర్యటన అనేకవిధాల కీలకమైనది. ఈ పర్యటనపై ఇరువైపులా చాలా ఆశలున్నాయి. అతి పెద్ద మార్కెట్ అయిన భారత్‌తో వాణిజ్య, రక్షణ, ఇంధన రంగాల్లో ఒప్పందాలు కుదుర్చుకుని దేశానికి దండిగా ప్రయోజనం చేకూర్చానని చెప్పుకోవడం ట్రంప్‌కు చాలా అవసరం. అలాగే అనేక ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాల్లో రెండు దేశాల మధ్యా సమన్వయం మరింత పెరగాలని అమెరికా కోరుకుంటోంది. వాణిజ్య రంగంలో ఉన్న లోటును సరిచేసి అమెరికా ప్రయోజ నాలకు భంగం వాటిల్లకుండా చూడాలని ట్రంప్ చాన్నాళ్లుగా తహతహలాడుతున్నారు.
భారత్ ఉత్పత్తులపై తాము తక్కువ టారిఫ్‌లు విధిస్తున్నా, తమ ఉత్పత్తులపై మాత్రం ఆ దేశంలో అధికంగా వసూలు చేస్తున్నారని, ఇందువల్ల తాము భారీగా నష్టపోతున్నామని ట్రంప్ మొదటినుంచీ ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో ఆయనకు భారత్‌పైన మాత్రమే కాదు... చైనాతో సహా చాలా దేశాలపై ఫిర్యాదులున్నాయి. మన దేశంపై ఒత్తిడి పెంచి తమ ఉత్పత్తులపై టారిఫ్‌లు తగ్గేలా చూడాలని చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో నిరుడు మార్చిలో ఆయన సాధారణ ప్రాధా న్యతల వ్యవస్థ(జీఎస్‌పీ) కింద అర్థ శతాబ్దంగా మనకిస్తున్న వెసులుబాట్లు రద్దు చేయాలని నిర్ణయించారు. ఇందువల్ల భారత్ 560 కోట్ల డాలర్లు నష్టపోయిందని అమెరికా చెబుతోంది. మన దేశం వాదన మరోలావుంది. తమ టారిఫ్‌లు ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) నిబంధనలకు లోబడే వున్నాయని మన ప్రభుత్వం తెలిపింది. అయినా ట్రంప్ అంగీకరించలేదు. దాంతో మన దేశం కూడా అమెరికా నుంచి వచ్చే వివిధ ఉత్పత్తులపై అదనపు టారిఫ్‌లు విధించడం మొదలుపెట్టింది.
తన ఏలుబడిలో అమెరికా ప్రయోజనాలు నెరవేరుతున్నాయన్న అభిప్రాయం అందరిలో కలిగించడం ఈ తరుణంలో ట్రంప్‌కు చాలా అవసరం. రెండు దేశాలూ గతంలో కుదుర్చుకున్న కీలక భాగస్వామ్య ఒప్పందం పని తీరు ఎలావున్నదో సమీక్షించి, దాన్ని మరింత పటిష్టవంతం చేయడానికి ఎలాంటి చర్యలు అవసరమో అధినేతలిద్దరూ చర్చించుకునే అవకాశంవుంది. అలాగే ప్రస్తుత పర్యటనలో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదరాలని, తమ వ్యవసాయ ఉత్పత్తులు, వైద్య పరికరాలు భారత్ మార్కెట్‌ను ముంచెత్తాలని ఆయన బలంగా కోరుకుంటున్నారు.అయితే వాణిజ్య ఒప్పందంపై సంతకాలవుతాయా, ఆ ఒప్పందంపై అవగాహన మాత్రమే కుదురుతుందా అన్నది చూడాల్సివుంది. ట్రంప్ పర్యటనకు ముందే ఈ ఒప్పందానికి మెరుగులు దిద్దాలని ఇరు దేశాల అధికారులూ ప్రయత్నిస్తున్నా, పలు అంశాలపై ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు. గత సెప్టెంబర్‌లో ఐక్యరాజ్యసమితి సమావేశాల కోసం మోదీ అమెరికా వెళ్లినప్పుడు కూడా పరిమిత వాణిజ్య ఒప్పందంపై సంతకాలవుతాయని అనుకున్నారు. అయితే అది నెరవేరలేదు. ఏకీకృత గగనతల రక్షణ ఆయుధ వ్యవస్థ అమ్మకానికి సంబంధించిన రక్షణ ఒప్పందం ఈ పర్యటనలో కుదిరే అవకాశం వుంది. వీటి సంగతలావుంచి పనిలో పనిగా తమ దేశంలోని ఎన్నారైల ఆదరణ పొంది, వారి ఓట్లు సంపాదించడానికి భారత్ పర్యటన ఉపకరిస్తుందని ట్రంప్ భావిస్తున్నారు.
ఇక్కడ జరిపే పర్యటనపై ట్రంప్ ఎంతగా ఆత్రుత పడుతున్నారో ఆయన మాటల్నిబట్టే పోల్చుకోవచ్చు. పర్యటన సందర్భంగా గుజరాత్ సందర్శన కూడా వుంటుందని, ఆ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో విమానాశ్రయం నుంచి సభ జరిగే స్టేడియం వరకూ స్వాగతం చెప్పేందుకు 50 నుంచి 70 లక్షలమంది ప్రజానీకం హాజరవుతారని ప్రధాని మోదీ తనకు చెప్పారని ట్రంప్ ప్రక టించారు. ఆ సభలో మోదీతోపాటు ట్రంప్ కూడా ప్రసంగించబోతున్నారు. నిరుడు సెప్టెంబర్‌లో అమెరికాలోని హ్యూస్టన్ నగరంలో ‘హౌడీ మోదీ’ పేరిట నిర్వహించిన మెగా ఈవెంట్‌ను ఎవరూ మరిచిపోరు. దానికి దాదాపు 50,000మంది హాజరయ్యారు. ఆ సందర్భంగా ఇద్దరు నేతలూ స్టేడియం అంతా కలియతిరిగి సభికులకు అభివాదం చేశారు. మోదీ ఆ సభలో మాట్లాడుతూ ‘అబ్ కీ బార్–ట్రంప్ సర్కార్’ నినాదం ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడొకరు వేరే దేశాల నేతలు పర్య టనకొచ్చినప్పుడు నిర్వహించే సభల్లో పాల్గొన్న దాఖలా అంతక్రితం లేదు.
అలాగే మన ప్రధానులు కూడా గతంలో అక్కడి ఎన్నికల్లో ఫలానా వారికి ఓటేయమని చెప్పిన సందర్భం లేదు. డెమొక్రాట్లకు పట్టుండే టెక్సాస్ రాష్ట్రంలోని హ్యూస్టన్ నగరంలో పెద్ద సభ జరగడం, మన ఎన్నారైలంతా ఉత్సాహంగా పాల్గొనడం తనకు రాజకీయంగా మేలు కలిగిస్తుందని ట్రంప్ భావించారు. ఇప్పుడు అహ్మదాబాద్ సందర్శన కోసం ఆ ఉద్దేశంతోనే ఆయన ఎదురుచూస్తున్నారు. అమెరికాలో స్థిరపడిన భారతీయుల్లో గుజరాత్ పౌరులు గణనీయంగా వుంటారు. సాధారణంగా అధ్యక్షుడికే రెండో దఫా అవకాశం ఇవ్వడం అమెరికాలో రివాజు. గత శతాబ్దకాలంలో కేవలం నాలుగు సందర్భాల్లో మాత్రమే అందుకు భిన్నంగా జరిగింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ సజావుగా వుంటే రెండోసారి ఎన్నిక కావడం పెద్ద కష్టం కాదు.
అయితే ట్రంప్ తీసుకుంటున్న కొన్ని కఠిన చర్యల వల్ల అక్కడ చదువు కోసమో, ఉద్యోగాల కోసమో వెళ్లిన భారతీయులకు సమస్యలెదురవుతున్నాయి. కఠినమైన వీసా నిబంధనలను చూపి ఆ దేశంలో చదువుకుంటున్న అనేకమందిని అమెరికా వెనక్కి పంపింది. ఉపాధి విషయంలోనూ ఇలాంటి సమస్యలే ఎదురవుతున్నాయి. ట్రంప్ పర్యటనలో మన దేశం వీటిని కూడా లేవనెత్తితే అక్కడున్న వారికి ఉపశమనం దొరుకుతుంది.
Comments
Please login to add a commentAdd a comment