
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి
అజాతశత్రువూ, రాజనీతిజ్ఞుడూ, ఆర్థిక సంస్కరణల రథసారధి, పాకిస్తాన్‌తో మైత్రి కోసం పరితపించిన శాంతికాముకుడూ అంటూ దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయిని దేశప్రజలందరూ మనస్ఫూర్తిగా కీర్తించారు. తొలి ప్రధాని నెహ్రూ తర్వాత సహజ మరణం చెందిన ఏ అధినాయకుడూ ఇంతటి ఘనమైన వీడ్కోలు అందుకోలేదు. మహాత్మాగాంధీ అంత్యక్రియలలో నెహ్రూ, పటేల్, తదిర నాయకులు శుక్రవారంనాడు వాజపేయి అంతిమ యాత్రలో ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా నడిచినట్టు నడవ లేదు. భౌతిక కాయాన్నుంచిన శకటంపై మాత్రమే కూర్చున్నారు. భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తెచ్చిన కృష్ణార్జనులు అటల్ బిహారీ వాజపేయి, లాల్‌కృష్ణ అడ్వాణీ.
లోక్‌సభలో బీజేపీకి సొంత మెజారిటీ సాధించిపెట్టిన ఘనత నరేంద్ర మోదీది. 1984 ఎన్నికలలో బీజేపీ పొందిన రెండు లోక్‌సభ స్థానాల నుంచి 2014లో 282 స్థానాలు గెలుచుకోవడానికి ప్రధాన కారకులు ఈ త్రిమూర్తులు. ముగ్గురూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) భావజాలానికి సమంగా నిబద్ధులే. ఎవరి కాలమాన పరిస్థితుల ప్రకారం వారు వ్యవహరించారు. వీరు ముగ్గురినీ విడదీసి చూపించేది లౌక్యం. వాజపేయికి ఉన్న లౌక్యం అడ్వాణీకి లేదు. అడ్వాణీకి ఉన్నంత లౌక్యం కూడా మోదీకి లేదు. వాజపేయిని ఉదారవాది అనీ, లౌకికవాది అనీ, చెడ్డ పార్టీలో ఉన్న మంచి వ్యక్తి (Right person in wrong party) అనీ చాలామంది సంతాప సందేశా లలో ప్రశంసించారు. ఒకప్పుడు అంటరాని పార్టీగా ఉండిన బీజేపీకి అధికార పార్టీగా అందరి ఆమోదం సాధించాలంటే వాజపేయి వంటి నేత ఒక చారిత్రక అవసరం. చరిత్ర తనకు నిర్దేశించిన పాత్రను వాజపేయి సమర్థంగా పోషిం చారు.
ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లో కానీ హరియాణాలో కాని గోరక్షణ పేరు మీద హత్యాకాండ జరిగినప్పుడు నింద నేరుగా నరేంద్రమోదీపై పడుతోంది. 1992లో బాబరీ మసీదు విధ్వంసం జరిగినప్పుడు దోషిగా నాటి ప్రధాని పీవీ నరసింహారావును నిలబెట్టాం. కానీ 2002లో గుజరాత్‌లో అల్లర్లు జరిగి వేలమంది హతులైనప్పుడు నాటి ముఖ్యమంత్రి నరేంద్రమోదీని తప్పు పట్టారు. అప్పటి ప్రధాని వాజపేయికి అపఖ్యాతి రాలేదు. ఎందుకు? ఈ రోజుల్లో వందలమందిని నియమించి, కోట్ల ఖర్చు పెట్టి ప్రధానులూ, ముఖ్యమంత్రులూ తమ ‘ఇమేజ్’ని పెంచుకుంటూ, పోషించుకుంటూ ఉన్నారు. ట్విట్టర్లూ, పేస్ బుక్‌లూ, వాట్సప్‌లూ, సోషల్ మీడియాలోని ఇతర హంగులూ లేని కాలంలో వాజపేయి స్వయంగా తన ‘ఇమేజ్’ను కాపాడుకునేవారు. అందుకే ‘రా’ (రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్) మాజీ అధికారి అమర్‌సింగ్ దులత్ వాజపేయిని చాణక్యుడిగానూ, అడ్వాణీని సూటిగా ప్రయాణం చేసే ‘బాణం’ గానూ అభివర్ణించారు.
సుదీర్ఘ ప్రస్థానం
వాజపేయి విద్యార్థి దశలో వామపక్ష భావాల పట్ల ఆకర్షితుడైనా అంతలోనే ఆర్య సమాజం వైపు, అనంతరం ఆర్‌ఎస్‌ఎస్ వైపు మొగ్గారు. ప్రచారక్‌గా పని చేశారు. బ్రహ్మచారిగా మిగిలిపోయారు. ప్రతిభావంతుడైన వక్తగా, జనాకర్షణ కలిగిన నేతగా పేరు తెచ్చుకొని జనసంఘ్ నాయకత్వ శ్రేణిలో ముందు నిలిచారు. ఆత్యయిక పరిస్థితి అనంతరం జరిగిన ఎన్నికలలో జనతా పార్టీ విజయం సాధిం చింది. మొరార్జీ దేశాయ్ నాయకత్వంలోని మంత్రివర్గంలో వాజపేయి విదే శాంగ మంత్రి. బాధ్యతలు స్వీకరించేందుకు తన కార్యాలయంలో అడుగుపెట్టి నప్పుడు అక్కడ అంతవరకూ ఉండిన నెహ్రూ ఫోటోను ఎవరో తొలగించారని గుర్తించారు. వెంటనే దాన్ని తిరిగి పెట్టించిన సంగతి వాజపేయి స్వయంగా పార్లమెంటులో వివరించారు. 1957లో వాజపేయి లోక్‌సభలో తొట్టతొలి ప్రసం గంతోనే నెహ్రూ దృష్టిని ఆకర్షించారు. ‘ఈ యువకుడు భవిష్యత్తులో ప్రధాన మంత్రి అవుతాడు’ అంటూ ఒక విదేశీ ప్రముఖుడికి తనను నెహ్రూ పరిచయం చేసిన సంగతి కూడా వాజపేయి చెప్పేవారు.
పీవీ ప్రధానిగా ఉండగా ఐక్యరాజ్య సమితిలో పాల్గొన్న అధికార బృందానికి నాయకుడిగా తనను పంపిన విషయం కూడా తరచు వాజపేయి గుర్తు చేసేవారు. అందరివాడని ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టే ఉదంతాలే ఇవన్నీ. ఆర్‌ఎస్‌ఎస్ ఆదేశాల ప్రకారం కాక, స్వతంత్రంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటానని ఇతరులకు అర్థమయ్యే విధంగా వ్యవ హరించేవారు. 1996 నుంచి 2004 వరకూ దేశంలో ఉన్న పరిస్థితులలో ఆర్‌ఎస్ ఎస్‌కు విధేయుడుగా ఉంటూ ‘సంకీర్ణధర్మం’ నెరవేర్చడం సాధ్యమయ్యేది కాదు. అసలు సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పడేది కాదు. నితీష్‌కుమార్, జయలలిత, మమతా బెనర్జీ, రాంవిలాస్ పాశ్వాన్, జార్జి ఫెర్నాండెజ్ వంటి నికార్సయిన లౌకికవాదు లతో కూటమి నిర్మాణం చేయాలంటే వాజపేయి లౌకికవాదిగానే వ్యవహరిం చాలి. గోవిందాచార్య అభివర్ణించిన ‘ముఖౌటా’ (ముసుగు) ధరించడం తప్పని సరి. అదే సమయంలో ఆర్‌ఎస్‌ఎస్ భావజాలాన్ని విస్మరించరాదు. ఇటువంటి వ్యవహారాలలో వాజపేయి చాకచక్యానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. ప్రస్తు తానికి రెండు ఉదంతాలు మనవి చేస్తాను.
రెండు ఉదంతాలు
గుజరాత్‌లో కొందరు ముష్కరులు గోధ్రాలో రైలుకు నిప్పు పెట్టి అమాయకుల ప్రాణాలు తీశాక ఆ శవాలను ఊరేగించి, ప్రజలలో ఆగ్రహావేశాలు పెంచి, మార ణకాండకు పరిస్థితులు దారితీసిన పరిణామాలు సంభవించాయి. అనేకమంది అమాయకులు గోధ్రా ఘటనలోనూ, గుజరాత్ అల్లర్లలోనూ మరణించారు. నాటి గుజరాత్ ముఖ్యమంత్రి మోదీని బర్తరఫ్ చేయాలని ఎన్‌డీఏ కూటమిలోని కొన్ని పార్టీలు కోరాయి. ప్రధాని స్వయంగా గుజరాత్ సందర్శించారు. మోదీని పక్కనే కూర్చోబెట్టుకొని మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి ‘రాజ్‌ధర్మ’ను పాటించాలనీ, మతాల పట్లా, కులాల పట్లా వివక్ష పాటించకూడదనీ ఉద్బోధిం చారు. అంతవరకూ మోదీ మోముపైన కనిపించిన చిర్నవ్వు అదృశ్యమైంది. ‘నేను అదే పని చేస్తున్నా సార్’ అంటూ మోదీ సన్నగా స్పందించారు. రెండు సెకన్లు మౌనంగా ఉన్న వాజపేయి ‘నరేంద్రభాయ్ ఆ పనే చేస్తున్నారు’ అంటూ ముక్తాయించారు.
పత్రికలు అన్నీ వాజపేయి మోదీకి రాజధర్మం ఉపదేశించి నట్టూ, ఆయనను మందలించినట్టూ వార్తలూ, వ్యాఖ్యలూ ప్రచురించాయి. మోదీని బర్తరఫ్ చేయాలనే వాజపేయి నిర్ణయించుకున్నారనీ, అడ్వాణీ, అరుణ్ జైట్లీలు అడ్డుతగిలి ప్రధానిని శాంతింపజేశారనీ కూడా పత్రికలు వ్యాఖ్యానిం చాయి. పత్రికలకు వాజపేయి హితుడు. విలేఖరులకూ, సంపాదకులకూ అందు బాటులో ఉండేవారు. అనంతరం గోవాలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం జరిగింది. అందులో వాజపేయి అచ్చు హిందూత్వవాదిగా మాట్లాడినట్టూ, ముస్లింలకు సహనం లేదనీ, హిందువులకు సహనం సహజంగా ఉంటుందనీ వ్యాఖ్యానించినట్టూ వార్తలు వచ్చాయి. పార్లమెంటులో దీనిపై హక్కుల తీర్మానం చర్చకు వచ్చింది. తాను మిలిటెంట్ ముస్లింలకు సహనం లేదని అన్నానే కానీ, అందరినీ ఒకే గాట కట్టలేదని వాజపేయి సమర్థించుకున్నారు. పైగా ఇస్లాం కూడా శాంతినే ప్రబోధిస్తుందని అదే ప్రసంగంలో అన్నానని గుర్తు చేశారు.
ఆయనకు విశ్వనీయత ఉన్నది కనుక ఆ వివాదం అంతటితో సమసిపోయింది. అఖండ్ భారత్ నినాదం గుండె నిండా నింపుకున్న వ్యక్తి అయినా ప్రధాని పదవి స్వీకరించాక పాకిస్తాన్‌కు స్నేహ హస్తం అందించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రధానిగా ఎన్నికైన నవాజ్ షరీఫ్‌తోనూ, షరీఫ్‌ను తోసిరాజని అధికారం హస్తగతం చేసుకున్న జనరల్ ముషార్రఫ్‌తోనూ శాంతి చర్చలు జరిపారు. షరీఫ్ హయాంలో వాజపేయి బస్సులో లాహోర్ వెళ్ళి చరిత్ర సృష్టించారు. ముషార్రఫ్ ప్రేరేపించిన కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్‌ని చిత్తుగా ఓడించారు. అదే ముషా ర్రఫ్‌ను శాంతి చర్చల కోసం ఆగ్రాకు అహ్వానించారు. చర్చలు విఫలమైనాయి. వాజపేయి తరఫు నుంచి ప్రయత్న లోపం లేదు. రెండోది రామజన్మభూమి–బాబరీ మసీదు వివాదం. కరసేవకులు బాబరీ మసీదు కూల్చడానికి ఒక రోజు ముందు లక్నోలో జరిగిన బహిరంగ సభలో బాబరీ మసీదు కట్టడం అక్రమమైనదని న్యాయస్థానం తీర్పు ఇస్తుందంటూ వాజపేయి ఆవేశపూరితంగా మాట్లాడారు. కానీ మసీదు విధ్వంసం జరిగిన సమయంలో అయోధ్యలో లేరు. ఆ తర్వాత ఎన్‌డీటీవీ సంపాదకుడు ప్రణయ్ రాయ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కట్టడం కూలిపోయినందుకు చింతిస్తున్నట్టు చెప్పారు. ఈ వ్యవహారంలో నాటి ప్రధాని పీవీ దోషం ఏమీ లేదని కూడా అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ భావజాలన్ని అనుసరిస్తూనే లౌకికవాదిగా పేరు తెచ్చు కోవడానికి లౌక్యం, చాణక్యం వాజపేయికి బాగా ఉపకరించాయి.
లౌక్యం తెలియని అడ్వాణీ
అడ్వాణీకి ఈ తెలివి లేదు. ముక్కు సూటి మనిషి. మర్మం తెలియదు. వాస్తవానికి సోమనాథ్ నుంచి అయోధ్య వరకూ రథయాత్ర చేసి బీజేపీని గెలుపుబాట పట్టించిన నేత అడ్వాణీ. బీజేపీ నాయకత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలో ప్రధాని కావలసిన అర్హత ఆయనకు ఉంది. కానీ ‘ఏక్ ధక్కా ఔర్ దో’ అంటూ కర సేవకులను ఉమాభారతి ప్రోత్సహించినప్పుడు అడ్వాణీ అక్కడే ఉన్నారు. ఇతర పార్టీలను కూడగట్టాలంటే తన వ్యక్తిత్వం సరిపోదనీ, వాజపేయి వంటి నాయకుడు అవసరమనీ అడ్వాణీ భావించి కిరీటం మిత్రుడి తలపైన పెట్టారు. తాను కూడా ప్రధాని కావాలంటే అందరివాడుగా పేరు తెచ్చుకోవాలనీ, అందుకు వాజపేయిని అనుసరించాలనీ భావించి అడ్వాణీ చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. తాను పుట్టిన కరాచీ చూసేందుకు సతీసమేతంగా అడ్వాణీ పాకిస్తాన్‌లో పర్యటించారు. ఇండియా, పాకిస్తాన్‌లు ఇప్పుడు ఎవ్వరూ కాద నలేని స్వతంత్ర దేశాలంటూ లాహోర్‌లో అడ్వాణీ వ్యాఖ్యానించినప్పుడు ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు ఆశ్చర్యపోయారు.
కరాచీ వెళ్ళి జిన్నా మజార్‌ను సందర్శించి, సందర్శకుల పుస్తకంలో జిన్నాను చారిత్రక పురుషుడుగా ప్రస్తు తిస్తూ రెండు వాక్యాలు రాసి ఆర్‌ఎస్‌ఎస్‌కూ, ఇతర హిందూమతవాదులకూ ఆగ్రహం కలిగించారు. పార్టీ అధ్యక్ష పదవి కోల్పోయారు. వాజపేయి ఆ విధంగా ఎన్నడూ రాసి దొరికిపోయేవారు కాదు. ప్రముఖ టీవీ ప్రయోక్త కరణ్ థాపర్ రాసిన పుస్తకం ‘ది డెవిల్స్ అడ్వకేట్’లో ఒక ఆసక్తికరమైన అంశం వివరించారు. ఢిల్లీలో పాకిస్తాన్ హైకమిషనర్ అష్రాఫ్ జహంగీర్ ఖాజీ కరణ్‌కు మిత్రుడు. ఖాజీ కోరిక మేరకు ఆయనను నాటి ఉపప్రధాని అడ్వాణీకి పరిచయం చేశాడు. అడ్వాణీ, ఖాజీ ఇరవై విడతల రహస్య సమాలోచనలు జరిపారు. ఒకరి పట్ల ఒకరికి గురి కుదిరింది. అడ్వాణీ ప్రేరణతో వాజపేయి పాకిస్తాన్‌తో మరోసారి శాంతి చర్చలకు సిద్ధమైనారు. ఫలితంగా ముషార్రఫ్ ఇండియా సందర్శిం చడానికి అంగీకరించారు. వాజపేయి, ముషార్రఫ్ మధ్య చర్చలు సంతృప్తి కరంగా జరుగుతున్నాయి. శాంతి ఒప్పందంపైన సంతకాలు చేయడమే తరు వాయి అని వాజపేయి, నాటి భద్రతావ్యవహారాల సలహాదారు బ్రజేష్‌మిశ్రా భావించారు. అంతలోనే ఒక రాత్రి విందు జరుగుతున్న సమయంలో దావూద్ ఇబ్రహీం (1993 ముంబయ్ పేలుళ్ళ నిందితుడు) గురించి అడ్వాణీ ముషార్రఫ్‌తో ప్రస్తావించారు.
దాంతో ముషార్రఫ్ ‘మూడ్’ మారిపోయిందనీ, ఆగ్రా శిఖరాగ్ర సమావేశానికి బాట వేసిన అడ్వాణీయే చర్చలు విఫలం కావడానికి కారకుడయ్యారనీ అష్రాఫ్ తనకు చెప్పినట్టు దులత్ రాసిన ‘కశ్మీర్: ది వాజపేయి ఇయర్స్’ అనే పుస్తకంలో వివరించారు. ఏ మాత్రం లౌక్యం ఉన్నా అడ్వాణీ ఆ సమయంలో దావూద్ సంగతి ప్రస్తావించేవారు కాదు. అందుకే, ప్రధాని కావలసిన యోగ్యత ఉన్నా ఆయన ఉపప్రధాని పదవి దగ్గరే ఆగిపోయారు.కరుడుకట్టిన మితవాదిగా తనకున్న ‘ఇమేజ్’ని మార్చుకోవడానికి అడ్వాణీ ప్రయత్నించారు. మోదీ సైతం అటువంటి ప్రయత్నం చేయక తప్పని పరిస్థితులు ఇప్పుడున్నాయి. నాలుగున్నర సంవత్సరాలు మోదీ ప్రయాణం నల్లేరుమీద బండిలాగా సాగిపోయింది. ఆయన ఎవ్వరినీ సంప్రదించరనీ, మొండిఘటమనీ పేరు వచ్చింది. ‘సంకీర్ణధర్మం’ బొత్తిగా పాటించరనే అపకీర్తి వచ్చింది. అదే ధోరణి కొనసాగిస్తే 2019లో మెజారిటీ సాధించడం అసాధ్యమని మోదీ, షా గ్రహించారు. అందుకే నితీష్‌కుమార్‌ని బుజ్జగించేందుకు రాజ్యసభ ఉపాధ్యక్ష పదవి జెడీ (యూ)కి చెందిన హరివంశ్ నారాయణ్‌సింగ్ చేతిలో పెట్టారు. వాజపేయి జీవితం నుంచి లౌక్యం నేర్చుకోవలసిన అవసరం మోదీకి ఉన్నది. వాజపేయి వంటి వ్యక్తిత్వాన్ని మాత్రమే ప్రజలు ఆరాధిస్తారు. అశాంతికి దారి తీసే ఎటువంటి వాదనలనూ ప్రజలు ఆమోదించరు. అంతిమయాత్రలో ఏడు కిలోమీటర్ల దూరం నడిచిన మోదీ దివంగత నాయకుడు చూపిన బాటలో ఇకనుంచైనా నడిస్తే ఆయనకీ, బీజేపీకీ, దేశానికీ మేలు.
కె. రామచంద్రమూర్తి