కొత్త నీరు వస్తున్నదంటే పాత నీరు కొట్టుకుపోవాల్సిందే. పెను ప్రభంజనం చుట్టుముట్టినప్పుడు గడ్డిపోచలకైతే ఫర్వాలేదు గానీ...మహా వృక్షాలకు సమస్యే. గత వైభవాన్ని చూపి, చేసిన సేవలను ఏకరువుపెట్టి లాభంలేదు.
కొత్త నీరు వస్తున్నదంటే పాత నీరు కొట్టుకుపోవాల్సిందే. పెను ప్రభంజనం చుట్టుముట్టినప్పుడు గడ్డిపోచలకైతే ఫర్వాలేదు గానీ...మహా వృక్షాలకు సమస్యే. గత వైభవాన్ని చూపి, చేసిన సేవలను ఏకరువుపెట్టి లాభంలేదు. వినే వారుండరు. ఈ సంగతులన్నీ బీజేపీ అగ్రజులకు ఇప్పుడిప్పుడే అర్ధమవుతున్నట్టున్నాయి. లోక్‌సభ ఎన్నికల కోసం విడుదలవుతున్న జాబితాలు పార్టీ సీనియర్ నాయకులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఇన్నాళ్లూ ఎవరెవరికో అలవోకగా మాట సాయం చేయగలిగినవారు ఇప్పుడు తమ స్థానమెక్కడని వెదుక్కుంటున్నారు. ఎందుకిలా జరుగుతున్నదని ఆక్రోశిస్తున్నారు. నిరుడు జూన్‌లో నరేంద్ర మోడీని బీజేపీ జాతీయ ఎన్నికల ప్రచార సంఘం చైర్మన్‌గా నియమించినప్పుడే వీటన్నిటినీ ఎల్.కె. అద్వానీ ఊహించినట్టున్నారు. అందుకే పార్టీ పదవులన్నిటికీ రాజీనామాచేశారు. అందరూ వచ్చి బతిమాలాక ఆయన కొంచెం తగ్గినా నిరుడు సెప్టెంబర్‌లో నరేంద్ర మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించినప్పుడు మళ్లీ అలిగారు. ఇప్పుడిన్నాళ్లకు ఆయనకు మరో అవమానం ఎదురైంది. ఈసారి పోటీకి మధ్యప్రదేశ్‌లోని భోపాల్ స్థానాన్ని ఎంపిక చేసుకుంటే కుదరదు పొమ్మన్నారు. చాన్నాళ్లుగా ప్రాతినిధ్యంవహిస్తున్న గుజరాత్‌లోని గాంధీనగర్ స్థానమే కేటాయిస్తామని తేల్చిచెప్పారు. ఎంత అలిగినా లాభం లేకపోయింది. బీజేపీ తొలి జాబితాలో తనవంటి సీనియర్ నేతకు చోటివ్వలేదని మథనపడుతున్న ఆయనకు ఇది ఊహించని పరాభవం. తమదాకా రాలేదని ఊరుకున్న మిగిలిన అగ్ర నేతలకూ ఇప్పుడు అలాంటి అనుభవాలు మొదలయ్యాయి. సీనియర్ నేత మురళీమనోహర్ జోషి మోడీ కోసం వారణాసిని ఖాళీ చేసి కాన్పూర్‌కు వలసపోవలసి వచ్చింది. ఆయన ఎంత పట్టుబట్టినా చివరకు పార్టీ నిర్ణయానికి తలొగ్గక తప్పలేదు. మరో సీనియర్ నేత లాల్జీ టాండన్‌కు లక్నో సీటు దక్కలేదు. ఇప్పుడు జశ్వంత్‌సింగ్ వంతువచ్చింది. ఆయన అడిగిన బార్మార్(రాజస్థాన్) స్థానం కాంగ్రెస్‌నుంచి వచ్చిన కల్నల్ సోనారామ్ చౌధరికి కేటాయించారు. వాస్తవానికి బార్మార్ ఆయన సొంత స్థానమేమీ కాదు. ఆయన రాజస్థాన్‌లోని జోధ్‌పూర్, చిత్తోర్‌గఢ్‌ల నుంచి గతంలో ప్రాతినిధ్యంవహించి తాజాగా డార్జిలింగ్(పశ్చిమబెంగాల్) ఎంపీగా ఉన్నారు. ఇప్పుడు బార్మార్ కావాలని అడిగిన జశ్వంత్‌కు జాబితా ద్వారా జవాబొచ్చింది! పార్టీ సీనియర్ నాయకుణ్ణి కాదని, ఫిరాయించిన వ్యక్తికి ఎందుకు కట్టబెట్టారు? ఆ స్థానంలో జాట్‌లు అధిక సంఖ్యలో ఉన్నారు గనుక ఆ కులానికి చెందిన సోనారామ్‌కు ప్రాధాన్యమివ్వాలనుకున్నారా లేక జశ్వంత్‌ను పరాభవించడానికి ఇంతకు మించిన మార్గం లేదనుకున్నారా అన్నది అనూహ్యం.
ఏ పార్టీ అయినా గెలుపు గుర్రాలనే నమ్ముకుంటుంది. అందుకోసమని అవసరమనుకున్న చోట అభ్యర్థులను మారుస్తుంది. కురువృద్ధులైన నేతలను బుజ్జగించడమూ సాధారణమే. కానీ, బీజేపీలో జరుగుతున్నది అది కాదు. అద్వానీ అనుయాయులను లక్ష్యంగా చేసుకుని ఈ తంతు సాగుతున్నది. రెండు నెలలక్రితం ఆయననూ, ఆయన మద్దతుదార్లు ఒకరిద్దరినీ లోక్‌సభ స్థానాలు ఖాళీచేయాలని, అందుకు బదులుగా రాజ్యసభ సీట్లు ఇస్తామని బేరం పెట్టారని గుప్పుమంది. అది అంతకుమించి విస్తరించకుండా సర్దుకున్నారు. ఇప్పుడు జశ్వంత్‌కు జరిగిన పరాభవంపై సీనియర్ నాయకురాలు సుష్మా స్వరాజ్ బాహాటంగానే ధ్వజమెత్తారు. ఈ విషయంలో పార్టీ తీసుకున్న నిర్ణయం విచారకరమైనదని విమర్శించారు. పార్టీ ఇప్పుడు చాలా మెరుగైన స్థితిలో ఉండవచ్చు. సర్వేలన్నీ చెబుతున్నట్టు దాని నేతృత్వంలోని ఎన్డీఏకు వచ్చే ఎన్నికల్లో 220 స్థానాలు దాటిరావొచ్చు. కానీ, అందుకోసమని ఫిరాయింపులను గౌరవించి సీనియర్‌లను చిన్నబుచ్చడం ఎలాంటి ఎత్తుగడో అర్ధంకాని విషయం. ఈ ధోరణులపై పార్టీలో అక్కడక్కడ నిరసన ధ్వనులు వినిపించడం అప్పుడే మొదలైంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, యూపీ, బీహార్‌లలో కార్యకర్తలు పార్టీ సారథులకు వ్యతిరేకంగా వీధుల్లోకొచ్చారు. హేమమాలిని(మధుర), కిరణ్‌ఖేర్(చండీగఢ్), జనరల్ వీకే సింగ్(ఘజియాబాద్), జగదంబికాపాల్ (దోమరియాగంజ్)వంటివారంతా పార్టీ కార్యకర్తల ఛీత్కారాలను ఎదుర్కోవలసివచ్చింది. ‘విభిన్నమైన పార్టీ’గా చెప్పుకున్న బీజేపీ ఇప్పుడు ‘విభేదాల పార్టీ’గా ముద్రేయించుకుంటున్నది.
పార్టీలో అన్నిటా నరేంద్ర మోడీ ముద్ర స్పష్టంగా కనిపిస్తున్నది. ఆయన ఏమనుకుంటే అదే జరుగుతున్నది. మాట వినని వారెవరైనా ఉంటే మోడీ తరఫున ఆరెస్సెస్ రంగంలోకి దిగుతున్నది. బాగానే ఉంది. నిర్ణయాత్మకంగా వ్యవహరించడం, అందుకు అందరూ బద్ధులయ్యేలా చూడటం తప్పని ఎవరూ అనరు. కానీ, దేశాన్నేలబోతున్న పార్టీ ఇలా ఏకపక్షంగా, రోడ్డు రోలర్‌లా అన్ని రకాల నిరసనలనూ బేఖాతరు చేస్తూ ముందుకు సాగుతున్నదన్న అభిప్రాయం కలిగితే అది పార్టీకి కలగజేసే నష్టమే ఎక్కువ. అందరి అభిప్రాయాలకూ చోటు కల్పిస్తున్నారని, సమష్టి తత్వంతో ముందుకు వెళ్తున్నారని అనుకున్నప్పుడే దానికి సర్వజనామోదం లభిస్తుంది. ఇప్పుడు బీజేపీ అగ్ర నాయకత్వానికి ఇలాంటి హితవచనాలు చెవికెక్కుతున్న దాఖలాలు లేవు. పార్టీ అసలు... నకిలీగా విడిపోయిందని, ఇప్పుడు నకిలీయే రాజ్యమేలుతున్నదని జశ్వంత్ అంటున్నారు. ఆయనకు సుష్మా మద్దతు పలుకుతున్నారు. తమ ఒంటెత్తు పోకడలే ఈ పరిణామాలకు కారణమని, సకాలంలో దీన్ని సరిదిద్దుకోనట్టయితే నష్టం తప్పదని ఇప్పటికైనా పార్టీ నాయకత్వం గుర్తించగలిగితే అది వారికే మంచిది.