బీసీ రిజర్వేషన్‌ సునామి ‘మండల్‌’ | BS Ramulu Article On BC Reservations | Sakshi
Sakshi News home page

బీసీ రిజర్వేషన్‌ సునామి ‘మండల్‌’

Published Thu, Aug 23 2018 1:03 AM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM

BS Ramulu Article On BC Reservations - Sakshi

భారత రాజ్యాంగ నిర్మాణం తర్వాత భారత సామాజిక రాజకీయాలను కదిలించివేసిన ఘనత బి.పి. మండల్‌కే దక్కుతుంది. రాజకీయాల్లో ఉద్యోగ, విద్య, తదితర రంగాల్లో ప్రాతినిధ్యం లేని సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కోసం మండల్‌ సాగించిన కృషికి చారిత్రక ప్రాధాన్యం ఉంది. కాలం గడిచినకొద్దీ ఇది విస్తరిస్తూనే ఉంటుంది. మండల్‌ కమిషన్‌ నివేదిక లేకుండా జాతీయ బీసీ కమిషన్‌లు గానీ, రాష్ట్రాల్లో బీసీ కమిషన్‌లు గానీ లేవు. మండల్‌ కమిషన్‌ నివేదిక లేకుండా జాతీయ బీసీ కమిషన్‌లు గానీ, రాష్ట్రాల్లో బీసీ కమిషన్‌లు గానీ లేవు. భారత రాజకీయ, సామాజిక చరిత్ర నిర్మాణంలో మండల్‌ కమిషన్‌ నివేదిక నిర్వహించిన కీలకపాత్ర ఎవ్వరూ చెరిపివేయలేనిది. 

మండల్‌ కమిషన్‌ నివేదిక లేకుండా జాతీయ బీసీ కమిషన్‌లుగానీ, రాష్ట్రాల్లో బీసీ కమిషన్‌లు గానీ లేవు. ఇటీవల 123వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా ఎస్సీ, ఎస్టీ కమిషన్‌లలాగా బీసీ కమిషన్‌లకు కూడా రాజ్యాంగపరమైన విస్తృత అధికారాలు కల్పించారు. బీసీ కమిషన్‌లను నిర్మించడానికి, ఇప్పుడు 123వ రాజ్యాంగ సవరణ బిల్లుతో వాటిని పునర్నిర్మించడానికి మండల్‌ కమిషన్‌ నివేదికే ప్రాతిపదిక. ఇలా బిందే శ్వరి ప్రసాద్‌ మండల్‌ స్వాతంత్య్రానంతరం భారతీయ సామాజిక, రాజ కీయ పరిణామాల్లో ఒక ప్రత్యేక అధ్యాయం. దేశ రాజకీయాల్లో, ఉద్య మాల్లో, బీసీల జీవితాల్లో అనేక మలుపులకు, పరిణామాలకు మండల్‌ కమిషన్‌ ఒక రాజ్యాంగంలాగా స్ఫూర్తినిస్తూ వచ్చింది. బీసీలు ఉన్నంత కాలం ఈ దేశంలో మండల్‌ పేరు చిరస్థాయిగా నిలిచిపో తుంది. భారత దేశంలోని ప్రజలలో ఒక భాగాన్ని ‘అదర్‌ బేక్‌ వర్డ్‌ క్లాసెస్‌’(ఆఇట) (ఇతర వెనుకబడిన కులాలు)గా మండల్‌ కమిషన్‌ నివేదిక నిర్వచించింది. ఈ నివేదిక తర్వాతే, భారతీయ రాజకీయాల్లో బలహీన వర్గాల కోసం విధివిధానంపై తీవ్రమైన చర్చ ప్రారంభమైంది.

అధికారపక్షంలోనూ ప్రతిపక్ష పాత్రే!
బిందేశ్వరి ప్రసాద్‌ మండల్‌ 25 ఆగస్టు 1918లో బీహార్‌లో యాదవ సామాజిక వర్గంలో జన్మించారు. తన 23వ యేటా జిల్లా కౌన్సిల్‌కి ఎన్ని కయ్యారు. 1945–51 మధ్య కాలంలో మాధేపుర డివిజన్‌లో జీతం తీసుకోకుండా జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌గా పనిచేసారు. బి.పి. మండల్‌ రాజకీయ జీవితం భారత జాతీయ కాంగ్రెస్‌తో మొదలైంది. 1952 లో మొదటిసారి బీహార్‌ అసెంబ్లీకి శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. అధి కార పార్టీలో ఉంటూనే, బీహార్‌లోని బలహీనవర్గ కుర్మీలపై అగ్రవర్ణ రాజపుత్రులు దాడి చేయడాన్ని నిరసించారు. 1965లో తన నియోజక వర్గంలో భాగంగా ఉన్న గ్రామమైన పామాలో మైనారిటీలపై, దళితు లపై పోలీసులు చేస్తున్న అత్యాచారాలపై మాట్లాడాలని మండల్‌ భావిం చారు. కానీ అధికార పక్షంలో ఉండి ఈ అంశంపై మాట్లాడకూడదని ముఖ్యమంత్రి ఆదేశించినప్పుడు, తన మనస్సాక్షిని చంపుకోలేక ప్రతి పక్ష పాత్ర నిర్వహించడానికి సిద్ధమై సంయుక్త సోషలిస్ట్‌ పార్టీ (ఎస్‌.ఎస్‌.పి)లో చేరారు. తను నమ్మిన విలువల కోసం అధికార పార్టీని వదిలి ప్రతిపక్ష పాత్ర నిర్వహించడానికి సిద్ధమయ్యారు. డాక్టర్‌ రామ్‌ మనోహర్‌ లోహియా, జయ ప్రకాష్‌ నారాయణ్‌ల స్ఫూర్తితో సంయుక్త సోషలిస్ట్‌ పార్టీ (ఎస్‌.ఎస్‌.పి)లో చేరారు. ఆ క్రమంలో ఆ పార్టీ రాష్ట్ర పార్ల మెంటరీ బోర్డు ఛైర్మన్‌గా నియమితులయ్యారు. 


1967లో జరిగిన ఎన్నికలలో సంయుక్త సోషలిస్టు పార్టీ  అభ్యర్ధుల ఎంపికపై ఆయన చేసిన కృషి, ఆయన ప్రచారం వల్ల, 1962లో కేవలం 7 సీట్లు మాత్రమే కలిగి ఉన్న ఆ పార్టీకి 1967లో 69 సీట్లు వచ్చాయి. ఆ విధంగా బీహార్లో మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడింది. మండల్‌ పార్లమెంటు సభ్యుడు అయినప్పటికీ రాష్ట్ర మంత్రివర్గంలో చేర్చుకున్నారు. బిహార్‌ ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేసారు. పార్టీలో, ప్రభుత్వంలో విభేదాలు రావడం, కాంగ్రెస్‌ పార్టీ బయటి నుంచి మద్దతు ఇవ్వడంవల్ల 1968 ఫిబ్రవరి 1న  మండల్, బీహార్‌ రాష్ట్ర రెండవ బీసీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. కాంగ్రెస్‌ పార్టీ మద్దతు తీసుకున్నప్పటికీ రాజీ పడకుండా రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేతల అవినీతిపై అయ్యర్‌ కమిషన్‌ వేశారు. ఆ కమిషన్‌ నివేదికను బహిరంగపర్చవద్దంటూ నాటి ప్రధాని ఇందిర స్వయంగా ఒత్తిడి తీసుకు వచ్చినా నిరాకరించారు. దాంతో మండల్‌ ప్రభుత్వంపై అవి శ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు.

అలా 30 రోజులకే మండల్‌ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ‘ఓట్లను సంపాదించడానికి కులపరమైన విజ్ఞప్తిని సహించవచ్చు కానీ ప్రభుత్వాల నిర్ణయాల్లో ఏ కుల తత్వాన్ని సహించవద్ద’ని తన మంత్రులకు బోధించిన మండల్‌ తన ప్రభుత్వంలో, పరిపాలనలో కులతత్వాన్ని ప్రదర్శించకుండా పాలిం చారు. ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగిన తర్వాత మండల్‌ 1967 మార్చి 5న సోషిత్‌ దళ్‌ (అణగారిన ప్రజల పార్టీ)ని స్థాపించారు. 1967 నుండి 1970 వరకు లోక్‌సభ సభ్యునిగా పని చేశారు. 1972లో శాసన సభకు తిరిగి ఎన్నికయ్యారు. 1972లో అప్పటి బీహార్‌ ముఖ్యమంత్రి పాండే, మిథిలా యూనివర్సిటీ పేరుతో అందులో కింది ఉద్యోగి నుంచి వైస్‌ ఛాన్సలర్‌ దాకా ఒకే కులం వారిని నింపాలని చేసే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకించారు.

మండల్‌ కమిషన్‌తో రాజకీయాల్లో మూలమలుపు
బి.పి.మండల్‌ 1974లో శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. జయప్రకాష్‌ నారాయణ నేతృత్వంలో నడుస్తున్న అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారు. 1977లో జనతా పార్టీ తరపున లోక్‌సభకి ఎన్నికై 1979 వరకు కొనసాగారు. మండల్‌ సోషలిస్ట్‌ రాజకీయ చింత నాపరుడిగా పని చేసారు. 1978 డిసెంబరులో ప్రధా నమంత్రి మొరార్జీ దేశాయ్‌ బి.పి. మండల్‌ ఛైర్మన్‌గా, బీసీలకు రిజర్వేషన్ల కోసం ఐదు గురు సభ్యులతో కమిషన్‌ వేశారు. మండల్‌ కమిషన్‌ నివేదికను 1980 డిసెంబర్‌ 31న రాష్ట్రపతికి సమర్పించారు. రెండు సంవత్సరాలు పనిచేసి తన నివేదికను సమర్పించినట్లు పైకి కనిపించినప్పటికీ... ఆ కాలంలో అనేక శాసనసభలకు, పార్లమెంటుకు ఎన్నికలు జరిగే ఒత్తిడి మధ్య ప్రజలు, ప్రభుత్వాలు, పార్టీలు తలమునకలై ఉన్న నేపథ్యంలో అనేక కష్టాల కోర్చి సమాచారం సేకరించి కేవలం 10 నెలల్లో ఈ నివేదికను తయారు చేయడం మాటలు కాదు.


దేశంలోని 52 శాతం భారతీయుల గురించి, వారి ప్రాతినిధ్యం, అభివృద్ధి, విద్య, ఉద్యోగ అవకాశాల గురించి చట్టసభల్లో వారి ప్రాతి నిధ్యం గురించి స్పష్టంగా సూచించిన ‘మండల్‌ కమిషన్‌’ రిపోర్టు భారతదేశ రాజకీయాల్లోనే ఒక కొత్త మలుపు. భారత రాజ్యాంగంలో ఎస్సీ, ఎస్టీలకు చట్టసభల్లో, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించారు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యాసంస్థల్లో ఓబీ సీల అభ్యర్ధులకు 27 శాతం రిజర్వేషన్లు కేటాయించాలని మండల్‌ తన నివేదికలో సిఫారసు చేశారు. మండల్‌ కమిషన్‌ సిఫారసుల అమలును, 27 శాతం ఓబీసీ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ కోర్టులలో కేసులు నడిచాయి. ఇంద్రసహాని కేసు పేరున ప్రసిద్ధమైన ఈ కేసు విషయంలో సుప్రీంకోర్టు అనేక కోణా లను పరిశీలించి తన తీర్పును వెలువరించింది. కేంద్ర ప్రభుత్వానికి అనేక సూచనలను, ఆదేశాలను జారీ చేసింది. వాటిని అనుసరించి 1993 నుంచి కేంద్రంలో, రాష్ట్రాల్లో శాశ్వత ప్రాతిపదికపై బీసీ కమిషన్లు ఏర్పడుతూ వస్తున్నాయి.

చివరకు 27 శాతం బీసీ రిజర్వేషన్లను ప్రధాన మంత్రి పి.వి. నరసింహారావు అమలులోకి తీసుకువచ్చారు. భారత రాజకీయాల్లో అనేక సంచలనాత్మక మార్పులకు మండల్‌ కమిషన్‌ సిఫారసులు కేంద్ర మయ్యాయి. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి విద్యాసంస్థల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు ప్రవేశపెట్టడానికి నాటి ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ నాయకత్వంలో మానవవనరుల శాఖ మంత్రి అర్జున్‌ సింగ్‌ ప్రయత్నించినప్పుడు పెద్ద ఎత్తున వ్యతిరేక, ఆందో ళనలు మొదలయ్యాయి. దాంతో 27 శాతం రిజర్వేషన్‌ల అమలు కోసం ఆయా విద్యాసంస్థల్లో 27 శాతం సీట్లను అదనంగా పెంచి సామర స్యంగా సమస్యను పరిష్కరించే కృషి చేశారు. అయితే రాజకీయంగా చట్టసభల్లో రిజర్వేషన్లు ఇంకా సాధ్యం కావడం లేదు. ఈ లక్ష్యసాధన కోసం ఓబీసీలు దశాబ్దాలుగా ఆందోళనలు, ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు.

చెక్కుచెదరని రాజ్యాంగ స్ఫూర్తి
భారత రాజ్యాంగ నిర్మాణం తర్వాత భారత సామాజిక రాజకీయాలను కదిలించివేసిన బి.పి. మండల్‌ 1982 ఏప్రిల్‌ 13న మరణించారు. రాజకీయరంగం ద్వారా సంఘసంస్కరణలు తీసుకురావడానికి, సామా జిక ఉద్యమాల ద్వారా రాజకీయ సంస్కరణలను తీసుకురావడానికి, రాజకీయాల్లో ఉద్యోగ, విద్య, తదితర రంగాల్లో ప్రాతినిధ్యం లేని సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కోసం మహాత్మా జ్యోతిబాఫూలే, డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్, పెరియార్‌ ఇ.వి. రామస్వామి నాయకర్, రాంమనోహర్‌ లోహియా, బిందేశ్వరి ప్రసాద్‌ మండల్‌ చేసిన కృషి చరిత్రాత్మకమైనది. భారత రాజ్యాంగంలో ఆయా సామాజిక వర్గాలకు రక్షణలు, ప్రత్యేక కృషి గురించిన ఆర్టికల్స్‌ చేర్చడం, ప్రణాళికలు, పథకాలు చేప ట్టడంలో వీరి కృషి మహోన్నతమైనది. ఆయన శత జయంతి సంద ర్భంగా మండల్‌ కమిషన్‌ నివేదిక తెలుగు అనువాదం పూర్తిచేయడం జరిగింది. మండల్‌ ప్రాధాన్యత, మండల్‌ కమిషన్‌ ప్రాధాన్యత.. కాలం గడిచినకొద్దీ విస్తరిస్తూనే ఉంటాయి. భారతీయ రాజకీయ, సామాజిక చరిత్ర నిర్మాణంలో మండల్‌ కమిషన్‌ నివేదిక నిర్వహించిన కీలకపాత్ర ఎవ్వరూ చెరిపివేయలేనిది. బీసీ కమిషన్‌లకు రాజ్యాంగ ప్రతిపత్తి ఇవ్వడం అందుకు ఒక ప్రతీక.
(ఆగస్ట్‌ 25న బిందేశ్వరి ప్రసాద్‌ మండల్‌ శతజయంతి సందర్భంగా)

బి.ఎస్‌.రాములు 
వ్యాసకర్త ఛైర్మన్, తెలంగాణ బి.సి. కమిషన్, సామాజిక తత్వవేత్త ‘ మొబైల్‌ : 83319 66987

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement