గత సార్వత్రిక ఎన్నికల్లో చావు దెబ్బ తిన్న తర్వాత అస్తిత్వ సంక్షోభంలో కూరుకు పోయిన కాంగ్రెస్ పార్టీ తన 84వ ప్లీనరీ సమావేశాలను న్యూఢిల్లీలో మూడు రోజులపాటు జరుపుకుంది. కాంగ్రెస్ ఇప్పుడున్నంత బలహీనంగా గతంలో ఎప్పుడూ లేదు. లోక్‌సభలో ఆ పార్టీ బలం పట్టుమని 50 కూడా లేదు. దేశంలో ఇప్పుడు కేవలం మూడంటే మూడుచోట్ల మాత్రమే అధికారంలో ఉంది. అందులో కర్ణాటక ఒక్కటే చెప్పుకోదగ్గ రాష్ట్రం. మిగిలిన రెండూ–పుదుచ్చేరి, మిజోరం చిన్న రాష్ట్రాలే. ఇటీవలి ఉప ఎన్నికల్లో మంచి ఫలితాలు రావడం, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పుకోదగ్గ రీతిలో సీట్లు సాధించడం మాత్రమే ఆ పార్టీకి కాస్త ఊరట. ఈ నేపథ్యంలో ప్లీనరీ చివరిరోజైన ఆదివారం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సభ్యులనుద్దేశించి గంటకుపైగానే మాట్లాడారు. కొన్ని కీలక సందర్భాల్లో తన ప్రవర్తనాశైలితోనూ, తోచినట్టు మాట్లాడే తన వైఖరితోనూ గతంలో పార్టీని ఇబ్బం దులపాలు చేసిన రాహుల్‌గాంధీ ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చాక క్రమేపీ మారుతూ వచ్చారు. అంతక్రితం ఆయన్ను ‘పప్పు’ అని సంబోధించినవారి నోళ్లు మూతబడే స్థాయిలో ఈ మార్పు కనబడటం మొదలైంది.
స్వయంగా నేర్చుకుం టున్న పాఠాలో, సలహాదారుల చలవో... ఆయన తీరుతో దిగాలుపడి ఉన్న కాంగ్రె స్‌కు ఎంతో కొంత ఉత్సాహం పుట్టుకురావడమైతే నిజం. ముగింపు ప్రసంగం కూడా ఈ కొత్త ఒరవడినే చూపింది. బీజేపీ, ఆరెస్సెస్‌లను కౌరవులుగా తమ పార్టీని పాండ వులుగా అభివర్ణించి, వచ్చే సార్వత్రిక ఎన్నికలను కురుక్షేత్ర యుద్ధంతో పోల్చారు. అది సత్యానికి, అసత్యానికి మధ్య జరిగే సంగ్రామమని అభివర్ణించారు.
అధికారంలో ఉన్న పార్టీకి ఎన్నో ప్రయోజనాలు, అనుకూలతలు ఉన్నట్టే ఇబ్బందులు కూడా అధికమే. కీలక బాధ్యతల్లో ఉన్నవారు నిరంతరం ఎంతో అప్రమత్తంగా వ్యవహరిస్తూ, ఎక్కడేం జరుగుతున్నదో గమనించుకుంటూ దిద్దు బాటు చర్యలు తీసుకుంటూ ఉంటే నష్టాలను పరిమిత స్థాయికి తగ్గించుకోవచ్చు. అందుకు భిన్నంగా ఉంటే ఎదురు దెబ్బలు తప్పవు. గత సార్వత్రిక ఎన్నికల నాటికి వరసగా పదేళ్లపాటు అధికారంలో కొనసాగిన కాంగ్రెస్ కన్నూ, మిన్నూ కానని స్థితికి చేరుకుంది. పార్టీ ఎదుగుదల కాంక్షించి పనిచేసినవారిని శత్రువులుగా పరిగణించడం, భజనపరులను ప్రోత్సహించడం, వారు చెప్పినట్టల్లా నిర్ణయాలు తీసుకోవడం పెరిగిపోయింది.
కనీసం వార్డు సభ్యులుగా గెలవ లేనివారు సైతం సోనియా విధేయులమని చెప్పుకుని ఓ వెలుగు వెలిగారు. అదే సమయంలో తన నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంపై ఆరోపణల జోరు పెరుగుతున్నా పార్టీ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించింది. అంతా సవ్యంగా ఉన్నదని చెప్పడానికి, సమర్ధించుకోవడానికి అది అప్పుడప్పుడు ప్రయత్నించక పోలేదుగానీ... అవి ఆ పార్టీ ప్రతిష్టను మరింత దిగజార్చాయి. ఇప్పుడు బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వానికి ఉన్న సమస్యలు వేరు. గోరక్షణ పేరిట, దేశభక్తి పేరిట, సంస్కృతి పేరిట పలు రాష్ట్రాల్లో మూక దాడులు పెరిగిపోతున్నా వాటిని నివారించడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంలో అది విఫలమైంది. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకుని వాటికి వ్యతిరేకంగా ప్రకటనలిచ్చేవరకూ కింది స్థాయి నాయకులు వాటిని తేలిగ్గా తీసుకున్నారు. కొన్ని సందర్భాల్లో సమర్థించారు. ఇక పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ అమలు వగైరాల వల్ల పౌరులు పడిన యాతనల విషయంలోనూ సరైన స్పందన లేదు. నీరవ్‌మోదీ తదితరులు దేశం విడిచి వెళ్లి పోవడంలాంటి ఉదంతాలు అప్రదిష్ట కలిగించాయి. ఈ నేపథ్యంలో సహజం గానే రాహుల్‌గాంధీ విమర్శల పదును పెరిగింది. అధికారంలో కొస్తే రైతుల రుణాలు మాఫీ చేస్తామని, పేదలకు చేకూరే లబ్ధిని ఆధార్‌తో అడ్డుకోకుండా చూస్తామని ప్లీనరీ భరోసా ఇచ్చింది.
విపక్షంలో ఉన్నందువల్ల వచ్చిన వెసులుబాటు వల్ల విమర్శలు కురిపించడం బాగానే ఉన్నా... ప్రస్ఫుటమైన రీతిలో ఆత్మ విమర్శ కూడా అవసరమని, అది నోటిమాటగా మాత్రమేకాక ఆచరణలోనూ కనబడాలని గుర్తించడంలో మాత్రం రాహుల్ విఫలమయ్యారు. తాము ప్రస్తావించిన కుంభకోణాలకైనా, నిరుపేద జనాన్ని ఇబ్బందులపాలు చేస్తున్న ఆధార్‌కైనా మూలాలు తమ పాలనలోనే ఉన్నా యని రాహుల్ గుర్తించినట్టు లేరు. ఆధార్ ప్రాజెక్టును ప్రారంభించిననాడు నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్ అదొక గుర్తింపు కార్డు మాత్రమేనని చెప్పారు. తీరా దాన్ని తప్పనిసరి చేస్తూ పోయింది ఆనాటి యూపీఏ ప్రభుత్వమే. రైతుల రుణాలు తాము అధికారంలోకొస్తే మాఫీ చేస్తామని చెబుతున్నారుగానీ... సాగుబడి వ్యయానికి ఒక టిన్నర రెట్లు అధికంగా మద్దతు ధర నిర్ణయించాలన్న స్వామినాథన్ కమిషన్ నివేదికను యూపీఏ పాలనలో చిత్తశుద్ధితో అమలు చేసి ఉంటే వేలాదిమంది రైతుల విలువైన ప్రాణాలు దక్కేవి. వ్యవసాయం ఇంత గడ్డు స్థితికి చేరుకునేది కాదు. మరోసారి రుణమాఫీ అవసరమే వచ్చేది కాదు.
పార్టీలో యువ రక్తాన్ని నింపి సంస్థాగతంగా దాన్ని బలోపేతం చేస్తానని రాహుల్ హామీ ఇచ్చారు. పార్టీ కోసం అహర్నిశలూ కృషి చేసే యువతీయువకులకు ఇకపై అగ్ర ప్రాధాన్యమిస్తామని... వారికి వృద్ధతరం నేతలు మార్గదర్శకులుగా ఉంటారని కూడా చెప్పారు. రివాజుకు భిన్నంగా ప్లీనరీ వేదికపై తాను తప్ప ఎవరూ లేకపోవడాన్ని ఎత్తిచూపుతూ దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన యువతను కులాలు, మతాలకు అతీతంగా ఇక్కడకు తీసుకొస్తానని చెప్పారు. తీరా 24 మందితో కూడిన పార్టీ వర్కింగ్ కమిటీకి ఎన్నికలు కాకుండా నామినేట్ చేసే సంస్కృతినే కొనసాగిస్తూ ప్లీనరీ తీర్మానించింది. కేవలం గంభీరమైన ఉపన్యాసా లిచ్చి, ప్రత్యర్థులపై పిడుగులు కురిపించి తిరిగి గత వైభవాన్ని సాధించవచ్చ నుకుంటే రాహుల్ పొరబడినట్టే. మాటలకు తగ్గ చేతలు, విమర్శతోపాటు ఆత్మ విమర్శ ఉన్నప్పుడే పార్టీ పట్ల జనంలో విశ్వాసం పెరుగుతుంది. అధికారం దక్కడం మాట అటుంచి ముందు సంస్థాగతంగా బలోపేతమవుతుంది. ఆ సంగతి రాహుల్ గ్రహించాలి.
Comments
Please login to add a commentAdd a comment