ఢిల్లీలో ఎన్నికల నగారా
అందరూ ఎంతోకాలంనుంచి ఆత్రంగా ఎదురుచూస్తున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తం ఖరారయింది. వచ్చే నెల 7న పోలింగ్ నిర్వహించి, 10న ఫలితాలు వెల్లడిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది. 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి 2013 డిసెంబర్‌లో ఎన్నికలు జరిగాయి. తమ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమన్న విశ్వాసంతో ఉన్న బీజేపీకి కొత్తగా ఆవిర్భవించిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)నుంచి ఊహించని సవాలు ఎదురైంది. ఆ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 31 స్థానాలు గెల్చుకోగా మిత్రపక్షమైన అకాలీదళ్‌కు వచ్చిన ఒక స్థానం కలిస్తే అది 32 దగ్గరే ఆగిపోయింది. ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం 36 అవసరం గనుక ఆ పార్టీ అధికారానికి దూరంగా ఉండిపోయింది.
ఆప్‌కు 28 స్థానాలూ, కాంగ్రెస్‌కు 8 వచ్చాయి. కాంగ్రెస్ ఇవ్వజూపిన మద్దతును స్వీకరించడానికి ఎంతో ఊగిసలాడిన కేజ్రీవాల్ చివరకు ప్రభుత్వం ఏర్పాటుకు ముందుకొచ్చారు. అయితే, ఆయన నిండా రెండు నెలలు కూడా ప్రభుత్వాన్ని నడపలేకపోయారు. 49 రోజులు గడిచాక అవినీతి వ్యతిరేక బిల్లు అసెంబ్లీ ఆమోదం పొందకపోవడాన్ని కారణంగా చూపిస్తూ హఠాత్తుగా పదవికి రాజీనామాచేసి అందర్నీ దిగ్భ్రమపరిచారు. వెళ్తూ వెళ్తూ అసెంబ్లీ రద్దుకు సిఫార్సుచేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ స్వతంత్రంగా వ్యవహరించివుంటే ఆ సిఫార్సును యథాతథంగా ఆమోదించి ఉండేవారు.
ఎందుకంటే ఏ విధంగా లెక్కలేసినా అంతకుమించి గత్యంతరం లేదు. గడిచిన మే నెలలో లోక్‌సభ ఎన్నికలతోపాటే అసెంబ్లీ ఎన్నికలూ వస్తాయని అందరూ ఊహిస్తే కేంద్రంలో ఆనాటి యూపీఏ ప్రభుత్వం మాత్రం అందుకు సిద్ధపడక రాష్ట్రపతి పాలనకే మొగ్గుచూపింది. తదుపరి ఏర్పడిన ఎన్డీయే సర్కారు కూడా దాన్నే కొనసాగించింది. చివరకు విషయం సుప్రీంకోర్టుకెక్కి, కార్యనిర్వాహక వర్గానికి అది కర్తవ్యాన్ని గుర్తుచేశాకగానీ అసెంబ్లీ రద్దు కాలేదు.
వివిధ సర్వేలు బీజేపీ విజయావకాశాలను గట్టిగా చెబుతూనే ఆప్‌కున్న ప్రజాదరణను వెల్లడిస్తున్నాయి. ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్‌నే అధిక సంఖ్యాకులు కోరుకుంటున్నారని చెబుతున్నాయి. అందువల్లనే ప్రధాని నరేంద్ర మోదీ రెండురోజులనాడు బీజేపీ ప్రచారాన్ని ప్రారంభిస్తూ తమ పార్టీ ప్రధాన ప్రత్యర్థి ఎవరో సరిగానే పోల్చుకున్నారు. తన ప్రసంగంలో అధిక భాగాన్ని ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై విమర్శలకే ఆయన కేటాయించారు. ఢిల్లీని వరసగా మూడుసార్లు...అంటే పదిహేనేళ్లపాటు ఏలిన కాంగ్రెస్‌నుకాక కేవలం 49 రోజులు మాత్రమే పాలించిన కేజ్రీవాల్‌పైనే దాడిని కేంద్రీకరించారు.
కేజ్రీవాల్ పేరెత్తకుండానే ఆయన తనను తాను అరాచకుడిగా అభివర్ణించుకోవడాన్ని ఢిల్లీవాసులకు గుర్తుచేసి...అదే నిజమైతే అడవులకు పోయి నక్సల్స్‌లో చేరాలని మోదీ సలహా ఇచ్చారు. ఢిల్లీలో మంచివాళ్లకే తప్ప నక్సలైట్లకు స్థానం లేదని కూడా చెప్పారు. కేజ్రీవాల్‌లో నక్సలిజం ఎంత ఉన్నదో, అరాచకవాదం పాలెంతో పక్కనబెడితే...ఆయన 38 నిమిషాల ప్రసంగంలో కాంగ్రెస్‌ను కేవలం అయిదుసార్లే ప్రస్తావించారని, పేరెత్తి ఉండకపోవచ్చుగానీ ఎక్కువ భాగం ఆప్‌కే కేటాయించారని మీడియా లెక్కలుగట్టి మరీ చెప్పింది.
ఇటీవల జరిగిన నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ జైత్రయాత్రను గుర్తుచేసేందుకు వేదికపై మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, హర్యానా సీఎం ఎం.ఎల్. ఖత్తార్, జార్ఖండ్ సీఎం రఘువర్‌దాస్, జమ్మూ-కశ్మీర్‌కు చెందిన కేంద్రమంత్రి జితేంద్రసింగ్‌ను కూర్చోబెట్టారు. అయితే, తమ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో ప్రకటించుకోలేని అశక్తతలో ఉండటం బీజేపీకున్న బలహీనత. పట్టణ ప్రాంత మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతుల్లో బీజేపీపైనా, మోదీపైనా ఉన్న ఆకర్షణవల్ల... స్వయంగా మోదీయే ఢిల్లీ ఎన్నికల ప్రచారాన్ని పర్యవేక్షిస్తున్నందువల్లా ఈ బలహీనతను సులభంగానే అధిగమించగలమన్న విశ్వాసం ఆ పార్టీకున్నది.
కేంద్రంలో అధికారానికొచ్చి ఏడు నెలలు కావస్తున్నది గనుక సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్దానాలపై బీజేపీ ఈ ఎన్నికల్లో జవాబు చెప్పుకోవాల్సి వస్తుంది. నల్లడబ్బును రప్పించడం ఇంతవరకూ ఎందుకు సాధ్యం కాలేదన్నది అందులో ప్రధానమైనది. రాజధానిలో మహిళల భద్రత ఇంకా ప్రశ్నార్థకంగానే ఉండటం, ఢిల్లీకి రాష్ట్ర ప్రతిపత్తి ఇస్తామన్న వాగ్దానంపై ఇంతవరకూ చేసిందేమిటో చెప్పలేకపోవడం,అధిక ధరలు వంటివి బీజేపీకి ఇబ్బందికరమైనవే. అలాగే మోదీ కేజ్రీవాల్ వ్యవహారశైలిని విమర్శించారు తప్ప కరెంటు చార్జీల తగ్గింపు, నిరుపేదవర్గాలకు ఉచితంగా మంచినీటి సరఫరా వంటి తమ ప్రభుత్వ నిర్ణయాలను తప్పుబట్టలేకపోయారంటున్న ఆప్ వ్యాఖ్యలను కొట్టిపారేయడానికి లేదు.
కేంద్రంలో అధికారంలో ఉండటంవల్ల వచ్చిన వెసులుబాటువల్ల గత కొంతకాలంగా లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా బీజేపీ తన పనులను చక్కబెట్టుకుంటున్నది. రెండేళ్లక్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దేశ రాజధాని నగరంలోని పేదలు ఆప్ వెనకున్నారని గ్రహించి ఇప్పటికే ఢిల్లీలోని చట్టవిరుద్ధమైన 899 కాలనీలను క్రమబద్ధీకరించారు. ఆ ప్రాంతాలకు చకచకా మౌలిక సదుపాయాల కల్పన మొదలైంది. కోడ్ అమల్లోకి రావడానికి ముందే ఢిల్లీ ప్రభుత్వోద్యోగుల పే స్కేళ్లు పెరిగాయి. రిటైర్మెంట్ వయస్సు తగ్గించడానికి ఎన్డీయే సర్కారు యోచిస్తున్నదన్న వదంతిని నమ్మొద్దని స్వయంగా మోదీయే విజ్ఞప్తిచేశారు.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ మరింత అధ్వాన్న స్థితికి చేరుతుందని సర్వేలు చెబుతున్నాయి. తాము ‘అవసరమైతే’ మరోసారి ఆప్‌కు మద్దతిచ్చేందుకు వెనకాడబోమని మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ప్రకటించి ఆ జోస్యాన్నే ధ్రువపరుస్తున్నారు. ఇటీవలి కాలంలో ఢిల్లీలో మైనారిటీలపై దాడులు పెరిగిన నేపథ్యంలో ఈ ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి అన్ని పార్టీలూ సహకరించాల్సిన అవసరం ఉన్నది. అధికారం కోసం జరిగే హోరాహోరీ పోరు సామాన్య పౌరుల పాలిట శాపంగా పరిణమించరాదని అందరూ గుర్తించాలి.