ఇరాన్‌తో 2015లో అమెరికా, మరో అయిదు దేశాలూ కుదుర్చుకున్న అణు ఒప్పందం నుంచి వైదొలగుతున్నట్టు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఏకపక్షంగా ప్రకటించి ఏడాదవుతోంది. సరిగ్గా ఆ సందర్భాన్ని ఎంచుకుని అటు ఇరాన్... ఇటు అమెరికా బుధవారం చేసిన ప్రకటనలు చూస్తే త్వర లోనే సంక్షోభం మరింత ముదిరే జాడలు కనబడుతున్నాయి. తమ దగ్గరున్న శుద్ధి చేసిన యురే నియంనూ, భారజలాన్ని వేరే దేశాలకు అమ్ముకోవడానికి అవకాశమిస్తున్న ఆ ఒప్పందంలోని క్లాజును ప్రస్తుతానికి వినియోగించదల్చుకోలేదని ఇరాన్ ఒక ప్రకటన ద్వారా తెలిపింది. అంతే కాదు... అమెరికా తమపై ఇప్పటికే విధించిన ఆంక్షలనుంచి బయటపడటానికి ఒప్పందంలోని ఇతర భాగస్వామ్య దేశాలు సహకరించకపోతే తాము సైతం ఆ ఒప్పందం నుంచి బయటకు రాక తప్పదని హెచ్చరించింది.
ఇందుకు రెండునెలలు గడువు విధించింది. అటు ట్రంప్‌ను ఒప్పించ లేక, ఇటు ఇరాన్‌ను శాంతింపజేయలేక సతమతమవుతున్న అయిదు దేశాలకూ ఇరాన్ చేసిన ప్రక టన కంగారు పెట్టడం ఖాయం. అటు అమెరికా సైతం ఇరాన్‌పై కొత్త ఆంక్షలు ప్రకటించింది. ఇరాన్ వద్ద ఉన్న యురేనియం, భారజలం నిల్వలను కనిష్ట స్థాయికి తీసుకురావాలన్న సంకల్పంతో ఆ రెండింటినీ విక్రయించుకోమని ఒప్పందం సూచించింది. కానీ ఇప్పుడు ఆ అమ్మకాలు నిలి పేస్తానని ఇరాన్ చెప్పడమంటే... అణ్వస్త్రాల తయారీకి సిద్ధపడతానని పరోక్షంగా హెచ్చరించడమే. ఒప్పందం నుంచి బయటికొస్తానని బెదిరించడంద్వారా ఇరాన్‌ను మరింత దారికి తేవాలని... తన సన్నిహిత మిత్ర దేశం ఇజ్రాయెల్‌కు దాని పీడ లేకుండా చేయాలని కలగన్న ట్రంప్ దాన్ని నెర వేర్చుకోవడంలో విఫలమై చివరకు అమెరికాతోపాటు మొత్తం ప్రపంచ దేశాలను యుద్ధం అంచు ల్లోకి నెట్టే సూచనలు కనబడుతున్నాయి.
నిజానికి ఇరాన్‌తో కుదిరిన 2015 నాటి అణు ఒప్పందం అన్నివిధాలా శ్రేష్టమైనది. అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, రష్యా, చైనా, యూరప్ యూనియన్(ఈయూ)లు కుదుర్చుకున్న ఆ ఒప్పందం అణు బాంబు తయారీ సన్నాహాలు చేసుకుంటున్న ఇరాన్‌ను ఆ దిశగా వెళ్లకుండా నిలువరించింది. అణ్వాయుధం తయారీకి 90 శాతం శుద్ధి చేసిన యురేనియం అవసరం కాగా, కేవలం అణు విద్యుత్ ఉత్పాదనకు వినియోగపడే రీతిలో దాన్ని 3.67 శాతం శుద్ధికి పరిమితం చేయడానికి ఇరాన్‌ను ఒప్పించింది. ఆ ఇంధనం కూడా 300 కిలోలు దాటి ఉంచుకోకూడదన్న నిబంధన పెట్టింది. ఒకప్పుడు ఇరాన్ వద్ద 10,000 కిలోలమేరకు శుద్ధి చేసిన యురేనియం ఉన్న దని గుర్తుంచుకుంటే ఈ నిబంధన ఎంత కఠినమైనదో అర్ధమవుతుంది.
ప్లుటోనియం ఉత్పత్తికి అవకాశంలేని రీతిలో రియాక్టర్‌ను సవరించడానికి, దాన్ని కేవలం పరిశోధన కోసం మాత్రమే విని యోగించడానికి అంగీకరింపజేసింది. అత్యంతాధునాతనమైన సెంట్రిఫ్యూజస్‌ను సమకూర్చుకో గల సాంకేతిక సామర్థ్యం ఉన్నా ఇరాన్ దాని జోలికి పోకుండా ఒప్పందం నిలువరించింది. అయితే ఈ నిబంధనలు ట్రంప్‌కు సరిపోలేదు. బాలిస్టిక్ క్షిపణులు, అణుక్షిపణుల జోలికి వెళ్లబోమని గట్టి హామీ ఇవ్వాలని, దేశంలో ఏమూలనైనా అంతర్జాతీయ అణుశక్తి సంస్థ(ఐఏఈఏ) తనిఖీ చేయడా నికి అంగీకరించాలని, ఇరుగుపొరుగు దేశాలను బెదిరించే ధోరణులకు స్వస్తి చెప్పాలని అమెరికా కోరుతోంది. ఇలా మొత్తంగా 12 నిబంధనలు పెట్టి వీటిని ఒప్పుకుంటేనే ఒప్పందంలో కొనసాగు తానని ట్రంప్ పేచీకి దిగారు.
అమెరికా ప్రతిపాదనను ఇతర సభ్య దేశాలేవీ అంగీకరించలేదు. ప్రస్తుత ఒప్పందం అన్ని విధాలా మెరుగైనదని వారు అభిప్రాయపడ్డారు. దాంతో చేసేదిలేక ఒంటరిగా బయటకు పోయిన అమెరికా ఇరాన్‌ను కష్టాల్లో పడేయటానికి రకరకాల మార్గాలు వెదుకుతోంది. అంతర్జాతీయ ఒప్పందాల్లో విశ్వసనీయత అత్యంత కీలకమైనది. పరస్పరం తలపడుతున్న దేశాలు ఒక అవగాహ నకు రావడమంటే మాటలు కాదు. ఇరు పక్షాలకూ గట్టి నమ్మకం కలిగించగల, వారిని ఒప్పించగల మధ్యవర్తులుంటేనే అది సాధ్యం. దశాబ్దాలపాటు అత్యంత కఠినమైన ఆంక్షలనూ, అంతర్జాతీ యంగా నిరాదరణనూ ఎదుర్కొన్న ఇరాన్‌ను అణు బాట వీడేలా చేయడం ఆ ఒప్పందం ఒక పెద్ద ముందడుగు. కానీ ట్రంప్ అధికారంలోకొచ్చాక దాన్నికాస్తా ధ్వంసం చేయడానికి పూనుకున్నారు. తన మాట చెల్లుబాటు కావడం లేదని ఆగ్రహించి గత నెలలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్‌జీసీ)ని ఆయన ఉగ్రవాద బృందంగా పరిగణిస్తున్నట్టు ప్రకటించారు. దానికి ప్రతిగా పశ్చి మాసియాలో ఉన్న అమెరికా సైనికుల్ని ఉగ్రవాదులుగా పరిగణిస్తామని ఇరాన్ తెలియజేసింది.
ఈ ఘర్షణ ఎటు పోతుందో ఎవరూ చెప్పలేని స్థితి ఏర్పడింది.
అమెరికా ఒత్తిళ్ల పర్యవసానంగా మన దేశం ఇరాన్ నుంచి చమురు కొనుగోలును పూర్తిగా నిలిపేసింది. దానికి ప్రత్యామ్నాయంగా తన దగ్గర షెల్ ఆయిల్ కొనమని అమెరికా కోరుతోంది. కానీ ధర విషయంలోనూ, చెల్లింపుల విష యంలోనూ సరళంగా ఉండటానికి ముందుకు రావడం లేదు. ఇరాన్ ముడి చమురు టన్నుకు రూ. 35,395కు లభిస్తుంటే అమెరికా ముడి చమురు ధర టన్నుకు రూ. 39,843 ఉంది. మనకు భారీగా చమురు సరఫరా చేసే దేశాల్లో ఇరాన్ ఒకటి. ప్రత్యామ్నాయం చూసుకోకుండా ఆపేయడం వల్ల సహజంగానే అది మున్ముందు మన దేశాన్ని సంక్షోభంలోకి నెడుతుంది. చాలా దేశాల స్థితి ఇంత కన్నా భిన్నంగా లేదు. తాజాగా పశ్చిమాసియాలో తమ దళాలపై ఇరాన్ దాడులు చేయొచ్చన్న సాకుతో అమెరికా అత్యంత శక్తివంతమైన బి–52 బాంబర్లను అక్కడికి తరలించింది. ఆరు దశా బ్దాల తర్వాత పశ్చిమాసియాలో అడుగుపెట్టిన ఈ భారీ యుద్ధవిమానాలే మున్ముందు జరగబోయే పరిణామాలను సూచిస్తున్నాయి. ఈ క్లిష్ట సమయంలో దృఢంగా వ్యవహరించి అమెరికాను దారిలో పెట్టాల్సిన బాధ్యత పాశ్చాత్య దేశాలకు ఉంది. ఊగిసలాట ధోరణి పరోక్షంగా ప్రపంచాన్ని ప్రమా దంలోకి నెడుతుందని, అమెరికాకే ఉపయోగపడుతుందని ఆ దేశాలు గ్రహించాలి.
Comments
Please login to add a commentAdd a comment