అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్.. కమలా హారిస్‌పై ఘన విజయం సాధించారు. ఆయన రెండోసారి అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టనున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయంపై ఇరాన్ స్పందించింది. అమెరికా గతంలో పాటించిన తప్పుడు విధానాలను సమీక్షించే ఒక అవకాశంగా డొనాల్డ్ ట్రంప్ గెలుపును చూస్తామని పేర్కొంది.
ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘై మీడియాతో మాట్లాడారు. ‘‘ డొనాల్డ్ ట్రంప్ తన మొదటి అమెరికా అధ్యక్ష పదవీకాలంలో ఇరాన్‌పై గరిష్ట ఒత్తిడి వ్యూహాన్ని అనుసరించారు. గతంలో అమెరికా ప్రభుత్వాల విధానాలు మాకు చాలా చేదు అనుభవాలు మిగిల్చాయి. అయితే.. తాజాగా అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ విజయం.. గత ప్రభుత్వాల తప్పుడు విధానాలను సమీక్షించడానికి ఒక అవకాశంగా భావిస్తున్నాం. ఆ విధానాలను సరిదిద్దే అవకాశం ఇప్పడు రావొచ్చనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం’’ అని తెలిపారు.
మరోవైపు.. డొనాల్డ్ ట్రంప్‌ను బుధవారం అమెరికా అధ్యక్ష ఎన్నికల విజేతగా ప్రకటించేందుకు ముందు ఇరాన్.. అమెరికా ఎన్నికలను అసంబద్ధమైనవని కొట్టిపారేసింది. ‘‘యునైటెడ్ స్టేట్స్ , ఇరాన్ విధానాలు స్థిరంగా ఉన్నాయి.ఎవరు అమెరికాకు అధ్యక్షుడు అవుతారన్నది ముఖ్యం కాదు. ప్రజల జీవనోపాధిలో ఎలాంటి మార్పు రాకుండా ఇప్పటికే ప్రణాళికలు రూపొందించాం’’ అని ప్రభుత్వ ప్రతినిధి ఫతేమెహ్ మొహజెరానీ అన్నారు.
ఇక.. ఇరాన్, అమెరికా 1979 ఇస్లామిక్ విప్లవం నుంచి ప్రత్యర్థులుగా మారాయి. ఇరుదేశాల మధ్య 2017 నుంచి 2021 వరకు ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఉద్రిక్తతలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.ట్రంప్ ఏకపక్షంగా 2015 ఇరాన్ అణు ఒప్పందం నుంచి వైదొలిగారు. అంతేకాకుండా ఇరాన్‌పై కఠినమైన ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. 2020లో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అమెరికా.. బాగ్దాద్ విమానాశ్రయంపై వైమానిక దాడి చేసి ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ జనరల్ ఖాసేమ్ సులేమానిని హతమార్చింది.
చదవండి: అమెరికా ఉపాధ్యక్షుడు ‘వాన్స్ భయ్యా, ఉషా భాభీ’ పెళ్లి ఫోటోలు వైరల్
Comments
Please login to add a commentAdd a comment