Iran nuclear deal
-
పశ్చిమాసియాపై కల్లోల మేఘాలు
ఇరాన్‌తో 2015లో అమెరికా, మరో అయిదు దేశాలూ కుదుర్చుకున్న అణు ఒప్పందం నుంచి వైదొలగుతున్నట్టు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఏకపక్షంగా ప్రకటించి ఏడాదవుతోంది. సరిగ్గా ఆ సందర్భాన్ని ఎంచుకుని అటు ఇరాన్... ఇటు అమెరికా బుధవారం చేసిన ప్రకటనలు చూస్తే త్వర లోనే సంక్షోభం మరింత ముదిరే జాడలు కనబడుతున్నాయి. తమ దగ్గరున్న శుద్ధి చేసిన యురే నియంనూ, భారజలాన్ని వేరే దేశాలకు అమ్ముకోవడానికి అవకాశమిస్తున్న ఆ ఒప్పందంలోని క్లాజును ప్రస్తుతానికి వినియోగించదల్చుకోలేదని ఇరాన్ ఒక ప్రకటన ద్వారా తెలిపింది. అంతే కాదు... అమెరికా తమపై ఇప్పటికే విధించిన ఆంక్షలనుంచి బయటపడటానికి ఒప్పందంలోని ఇతర భాగస్వామ్య దేశాలు సహకరించకపోతే తాము సైతం ఆ ఒప్పందం నుంచి బయటకు రాక తప్పదని హెచ్చరించింది. ఇందుకు రెండునెలలు గడువు విధించింది. అటు ట్రంప్‌ను ఒప్పించ లేక, ఇటు ఇరాన్‌ను శాంతింపజేయలేక సతమతమవుతున్న అయిదు దేశాలకూ ఇరాన్ చేసిన ప్రక టన కంగారు పెట్టడం ఖాయం. అటు అమెరికా సైతం ఇరాన్‌పై కొత్త ఆంక్షలు ప్రకటించింది. ఇరాన్ వద్ద ఉన్న యురేనియం, భారజలం నిల్వలను కనిష్ట స్థాయికి తీసుకురావాలన్న సంకల్పంతో ఆ రెండింటినీ విక్రయించుకోమని ఒప్పందం సూచించింది. కానీ ఇప్పుడు ఆ అమ్మకాలు నిలి పేస్తానని ఇరాన్ చెప్పడమంటే... అణ్వస్త్రాల తయారీకి సిద్ధపడతానని పరోక్షంగా హెచ్చరించడమే. ఒప్పందం నుంచి బయటికొస్తానని బెదిరించడంద్వారా ఇరాన్‌ను మరింత దారికి తేవాలని... తన సన్నిహిత మిత్ర దేశం ఇజ్రాయెల్‌కు దాని పీడ లేకుండా చేయాలని కలగన్న ట్రంప్ దాన్ని నెర వేర్చుకోవడంలో విఫలమై చివరకు అమెరికాతోపాటు మొత్తం ప్రపంచ దేశాలను యుద్ధం అంచు ల్లోకి నెట్టే సూచనలు కనబడుతున్నాయి. నిజానికి ఇరాన్‌తో కుదిరిన 2015 నాటి అణు ఒప్పందం అన్నివిధాలా శ్రేష్టమైనది. అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, రష్యా, చైనా, యూరప్ యూనియన్(ఈయూ)లు కుదుర్చుకున్న ఆ ఒప్పందం అణు బాంబు తయారీ సన్నాహాలు చేసుకుంటున్న ఇరాన్‌ను ఆ దిశగా వెళ్లకుండా నిలువరించింది. అణ్వాయుధం తయారీకి 90 శాతం శుద్ధి చేసిన యురేనియం అవసరం కాగా, కేవలం అణు విద్యుత్ ఉత్పాదనకు వినియోగపడే రీతిలో దాన్ని 3.67 శాతం శుద్ధికి పరిమితం చేయడానికి ఇరాన్‌ను ఒప్పించింది. ఆ ఇంధనం కూడా 300 కిలోలు దాటి ఉంచుకోకూడదన్న నిబంధన పెట్టింది. ఒకప్పుడు ఇరాన్ వద్ద 10,000 కిలోలమేరకు శుద్ధి చేసిన యురేనియం ఉన్న దని గుర్తుంచుకుంటే ఈ నిబంధన ఎంత కఠినమైనదో అర్ధమవుతుంది. ప్లుటోనియం ఉత్పత్తికి అవకాశంలేని రీతిలో రియాక్టర్‌ను సవరించడానికి, దాన్ని కేవలం పరిశోధన కోసం మాత్రమే విని యోగించడానికి అంగీకరింపజేసింది. అత్యంతాధునాతనమైన సెంట్రిఫ్యూజస్‌ను సమకూర్చుకో గల సాంకేతిక సామర్థ్యం ఉన్నా ఇరాన్ దాని జోలికి పోకుండా ఒప్పందం నిలువరించింది. అయితే ఈ నిబంధనలు ట్రంప్‌కు సరిపోలేదు. బాలిస్టిక్ క్షిపణులు, అణుక్షిపణుల జోలికి వెళ్లబోమని గట్టి హామీ ఇవ్వాలని, దేశంలో ఏమూలనైనా అంతర్జాతీయ అణుశక్తి సంస్థ(ఐఏఈఏ) తనిఖీ చేయడా నికి అంగీకరించాలని, ఇరుగుపొరుగు దేశాలను బెదిరించే ధోరణులకు స్వస్తి చెప్పాలని అమెరికా కోరుతోంది. ఇలా మొత్తంగా 12 నిబంధనలు పెట్టి వీటిని ఒప్పుకుంటేనే ఒప్పందంలో కొనసాగు తానని ట్రంప్ పేచీకి దిగారు. అమెరికా ప్రతిపాదనను ఇతర సభ్య దేశాలేవీ అంగీకరించలేదు. ప్రస్తుత ఒప్పందం అన్ని విధాలా మెరుగైనదని వారు అభిప్రాయపడ్డారు. దాంతో చేసేదిలేక ఒంటరిగా బయటకు పోయిన అమెరికా ఇరాన్‌ను కష్టాల్లో పడేయటానికి రకరకాల మార్గాలు వెదుకుతోంది. అంతర్జాతీయ ఒప్పందాల్లో విశ్వసనీయత అత్యంత కీలకమైనది. పరస్పరం తలపడుతున్న దేశాలు ఒక అవగాహ నకు రావడమంటే మాటలు కాదు. ఇరు పక్షాలకూ గట్టి నమ్మకం కలిగించగల, వారిని ఒప్పించగల మధ్యవర్తులుంటేనే అది సాధ్యం. దశాబ్దాలపాటు అత్యంత కఠినమైన ఆంక్షలనూ, అంతర్జాతీ యంగా నిరాదరణనూ ఎదుర్కొన్న ఇరాన్‌ను అణు బాట వీడేలా చేయడం ఆ ఒప్పందం ఒక పెద్ద ముందడుగు. కానీ ట్రంప్ అధికారంలోకొచ్చాక దాన్నికాస్తా ధ్వంసం చేయడానికి పూనుకున్నారు. తన మాట చెల్లుబాటు కావడం లేదని ఆగ్రహించి గత నెలలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్జీసీ)ని ఆయన ఉగ్రవాద బృందంగా పరిగణిస్తున్నట్టు ప్రకటించారు. దానికి ప్రతిగా పశ్చి మాసియాలో ఉన్న అమెరికా సైనికుల్ని ఉగ్రవాదులుగా పరిగణిస్తామని ఇరాన్ తెలియజేసింది. ఈ ఘర్షణ ఎటు పోతుందో ఎవరూ చెప్పలేని స్థితి ఏర్పడింది. అమెరికా ఒత్తిళ్ల పర్యవసానంగా మన దేశం ఇరాన్ నుంచి చమురు కొనుగోలును పూర్తిగా నిలిపేసింది. దానికి ప్రత్యామ్నాయంగా తన దగ్గర షెల్ ఆయిల్ కొనమని అమెరికా కోరుతోంది. కానీ ధర విషయంలోనూ, చెల్లింపుల విష యంలోనూ సరళంగా ఉండటానికి ముందుకు రావడం లేదు. ఇరాన్ ముడి చమురు టన్నుకు రూ. 35,395కు లభిస్తుంటే అమెరికా ముడి చమురు ధర టన్నుకు రూ. 39,843 ఉంది. మనకు భారీగా చమురు సరఫరా చేసే దేశాల్లో ఇరాన్ ఒకటి. ప్రత్యామ్నాయం చూసుకోకుండా ఆపేయడం వల్ల సహజంగానే అది మున్ముందు మన దేశాన్ని సంక్షోభంలోకి నెడుతుంది. చాలా దేశాల స్థితి ఇంత కన్నా భిన్నంగా లేదు. తాజాగా పశ్చిమాసియాలో తమ దళాలపై ఇరాన్ దాడులు చేయొచ్చన్న సాకుతో అమెరికా అత్యంత శక్తివంతమైన బి–52 బాంబర్లను అక్కడికి తరలించింది. ఆరు దశా బ్దాల తర్వాత పశ్చిమాసియాలో అడుగుపెట్టిన ఈ భారీ యుద్ధవిమానాలే మున్ముందు జరగబోయే పరిణామాలను సూచిస్తున్నాయి. ఈ క్లిష్ట సమయంలో దృఢంగా వ్యవహరించి అమెరికాను దారిలో పెట్టాల్సిన బాధ్యత పాశ్చాత్య దేశాలకు ఉంది. ఊగిసలాట ధోరణి పరోక్షంగా ప్రపంచాన్ని ప్రమా దంలోకి నెడుతుందని, అమెరికాకే ఉపయోగపడుతుందని ఆ దేశాలు గ్రహించాలి. -
40 ఏళ్లుగా సహించాం.. ఇక చాలు!
టెహ్రాన్ : అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ దేశాల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీలు వరుస ట్వీట్లతో పరస్పరం హెచ్చరికలు చేసుకున్న విషయం తెలిసిందే. అమెరికాతో పెట్టుకుంటే తీవ్ర పరిణామాలు చవి చూడాల్సి వస్తుందంటూ ట్రంప్ చేసిన హెచ్చరికలపై ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి జావేద్ జరీఫ్ స్పందించారు. బీ కేర్‌ఫుల్... ‘అస్సలు నచ్చడం లేదు.. కొన్ని నెలల క్రితం సంభవించిన అతి పెద్ద పేలుడు శబ్దాన్ని ప్రపంచ మొత్తం విన్నది. ఇరానియన్లు కూడా ఆ శబ్దాలను విన్నారు. నాగరిక ప్రపంచంలో 40 ఏళ్లుగా ఇలాంటి శబ్దాలు వింటూనే ఉన్నాం. ఇక చాలు.. ఎన్నో సామ్రాజ్యాలు కుప్పకూలి పోవడం మేము కళ్లారా చూశాం. అంతేకాదు మేము తలచుకోవడం వల్ల కొన్ని దేశాలు ఉనికి లేకుండా పోయాయి కూడా. కాబట్టి జాగ్రత్తగా ఉండండి’ అంటూ జావేద్ ట్వీట్ చేశారు. కాగా పెద్దపులితో ఆటలు వద్దని, ఇరాన్‌తో యుద్ధమంటే అంతతేలిక కాదని హసన్ రౌహానీ ట్రంప్‌కు వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. 2015లో ఇరాన్ న్యూక్లియర్ ఒప్పందం నుంచి అమెరికా తప్పుకున్న నాటి నుంచి ఇరు దేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతూనే ఉంది. COLOR US UNIMPRESSED: The world heard even harsher bluster a few months ago. And Iranians have heard them —albeit more civilized ones—for 40 yrs. We’ve been around for millennia & seen fall of empires, incl our own, which lasted more than the life of some countries. BE CAUTIOUS! — Javad Zarif (@JZarif) July 23, 2018 -
ఇరాన్ అణు ఒప్పందం నుంచి వైదొలిగిన అమెరికా
వాషింగ్టన్: ఏడు దేశాలు రెండేళ్లపాటు చర్చోపచర్చలు జరిపిన తర్వాత 2015లో సాకారమైన చారిత్రక ఇరాన్ అణు ఒప్పందం నుంచి వైదొలుగుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్ అణ్వాయుధాలు ఉత్పత్తి చేయకుండా నాటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో కుదిరిన ఉమ్మడి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక (జేసీపీవోఏ)ను ‘క్షీణించిన, కుళ్లినది’గా అభివర్ణించే ట్రంప్.. తాను అధికారంలోకి వస్తే ఆ ఒప్పందాన్ని రద్దు చేస్తానని 2016లో ఎన్నికల ప్రచారంలోనే ప్రకటించారు. చెప్పినట్లుగానే జేసీపీవోఏ నుంచి అమెరికా వైదొలుగుతున్నట్లు మంగళవారం ట్రంప్ ప్రకటించారు. తననిర్ణయంతో అమెరికా మిత్రదేశాలతోనూ విభేదాలు తెచ్చుకున్నారు. అమెరికాతో సంబంధం లేకుండా తాము ఈ ఒప్పందానికి కట్టుబడి ఉంటామనీ, ఇరాన్ కూడా అలాగే చేయాలని ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా, చైనా, జర్మనీ ప్రకటించాయి. ఇరాన్ అణు కార్యక్రమాలపై ఆంక్షలు విధించేందుకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశాలతోపాటు జర్మనీ కూడా కలసి ఇరాన్‌తో రెండేళ్లపాటు చర్చలు జరిపిన అనంతరం 2015లో వియన్నాలో జేసీపీవోఏ ఒప్పందం కుదరడం విదితమే. అణు కార్యక్రమాలను నిలిపివేసినందుకుగాను అప్పటివరకు ఇరాన్‌పై ఉన్న అంతర్జాతీయ ఆంక్షలను ఎత్తేశారు. ఐక్యరాజ్యసమితిలో తీర్మానం ద్వారా ఈ ఒప్పందాన్ని అంతర్జాతీయ చట్టంగా కూడా గుర్తించారు. ‘మనం ఇరాన్ అణు బాంబును నియంత్రించలేమనేది నాకు స్పష్టంగా తెలుసు. ఈ ఒప్పందం మూలంలోనే లోపాలు ఉన్నాయి. కాబట్టే దీని నుంచి అమెరికా తప్పుకుంటున్నదని నేను ప్రకటిస్తున్నాను’ అని ట్రంప్ చెప్పారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఇరాన్‌పై మరిన్ని ఆంక్షలు విధించారు. ట్రంప్ నిర్ణయ ప్రభావమెంత? అమెరికాప్రకటించిన ఆంక్షలు ఇరాన్ ఆటోమొబైల్ రంగంపై మూడు నెలల తర్వాత, చమురు రంగంపై ఆరు నెలల తర్వాత అమల్లోకి వస్తాయి. కాబట్టి అంతర్జాతీయ చమురు ధరలు వేగంగా పెరిగే అవకాశాల్లేవు. అమెరికా మిత్ర దేశాలు అనేకం ఇరాన్ నుంచి ముడి చమురు కొంటున్న నేపథ్యంలో అవి అమెరికాను అనుసరిస్తూ కొనుగోళ్లు తగ్గించుకోవాల్సి ఉంటుంది. లేకుంటే ఈ మిత్రదేశాల బ్యాంకులపై అమెరికా ఆరు నెలల తర్వాత ఆంక్షలు విధించే ప్రమాదం ఉంది. అందుకే అమెరికా తన నిర్ణయాన్ని మార్చుకోవాలని ఐరోపా మిత్రదేశాలు కోరుతున్నాయి. ట్రంప్ నిర్ణయం వల్ల మిత్ర దేశాలైన ఇంగ్లండ్, ఫ్రాన్స్, జర్మనీలు అమెరికాకు దూరమయ్యే అవకాశం కూడా లేకపోలేదు. భారత్‌పై తక్షణ ప్రభావం ఉండదు: ఇరాన్‌పై అమెరికా పునరుద్ధరించిన ఆర్థిక ఆంక్షలను ఐరోపా దేశాలు పాటించనంత వరకు భారత ముడిచమురు దిగుమతులపై ప్రభావం ఉండదని భారత అధికారులు వెల్లడించారు. -
అణు ఒప్పందానికి ట్రంప్ తూట్లు!
ఇరాన్‌తో కుదిరిన అణు ఒప్పందంపై అధికారంలోకి వచ్చినప్పటినుంచీ అక్కసు వెళ్లగక్కు తున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చివరకు దాన్నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఇలా చేయడం ద్వారా ఆయన తన దేశ ప్రతిష్టను దిగజార్చడంతోపాటు పశ్చిమాసి యాను అనిశ్చితిలోకి... మన దేశంతోసహా ప్రపంచ దేశాలన్నిటినీ సంక్షోభం అంచుల్లోకి నెట్టారు. రోగికి పథ్యం రుచించనట్టు యూరప్ దేశాల హితవచనాలు, స్వదేశంలోని నిపుణుల వినతులు ట్రంప్ తలకెక్కలేదు. తనకు తోచిందే సరైందనుకునే ఆయన మూర్ఖత్వాన్ని సరి చేయడం వారెవరివల్లా కాలేదు. పర్యవసానంగా ఒక మెరుగైన ఒప్పందం కష్టాల్లో పడింది. ఇది అమెరికా–ఇరాన్‌ల మధ్య కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందం కాదు. ఇరాన్‌తో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, చైనాలు... వీటితోపాటు జర్మనీ, యూరప్ యూనియన్లు ఉమ్మడిగా దీన్ని ఖరారు చేసుకున్నాయి. ఆ రకంగా ఇది బహుళ దేశాల ఒప్పందం. ఇప్పుడు అమెరికా మాత్రమే ఈ ఒప్పందాన్ని కాలదన్నింది. మిగిలిన దేశాలు దానికి కట్టుబడి ఉంటామంటు న్నాయి. కానీ ఇరాన్‌పై అత్యున్నతస్థాయి ఆర్థిక ఆంక్షలు విధిస్తామని, దానితో వ్యాపార లావా దేవీలు జరిపే దేశాలకు తమ మార్కెట్లలో స్థానం ఉండబోదని అమెరికా చెబుతోంది. ఈ బెదిరింపు వాస్తవరూపం దాలిస్తే రష్యా మాటెలా ఉన్నా మిగిలిన దేశాలన్నీ ఇరాన్‌తో ఉండాలో, లేదో తేల్చుకోక తప్పనిస్థితి ఏర్పడుతుంది. బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, చైనాలకు అమెరికా మార్కెట్లతో విడదీయరాని అనుబంధం ఉంది. అక్కడ లక్షల కోట్ల డాలర్ల పెట్టు బడులు న్నాయి. మన దేశానికి ముడి చమురు ఎగుమతి చేస్తున్న దేశాల్లో ఇరాన్‌ది మూడో స్థానం. ఆంక్షలు మొదలైతే ఈ రంగంలో పెను సంక్షోభం తప్పదు. ఇజ్రాయెల్, సౌదీ అరేబియాల ప్రయోజనాలు కాపాడటం తప్ప మరే లక్ష్యమూ లేని ట్రంప్‌కు ఇది పనికిమాలిన ఒప్పందం అనిపించవచ్చు. కానీ దీని వెనక ఎంతో కృషి ఉంది. ఏళ్ల తరబడి తెరవెనక జరిగిన సంప్రదింపుల పర్యవసానంగా చర్చలు సాకారమయ్యాయి. ఆ దశలో కూడా సమస్యలు తలెత్తాయి. ఇరాన్‌పై సడలించాల్సిన ఆంక్షలపై అగ్రరాజ్యాలు మంకు పట్టు పడితే... తన సైనిక స్థావరాలను అంతర్జాతీయ అణుశక్తి సంస్థ(ఐఏఈఏ) తనిఖీ చేయ డానికి ఇరాన్ ఒప్పుకోలేదు. కేవలం మా అణు కార్యక్రమంపైన మాత్రమే చర్చించడమేమిటి, ఇందులో పశ్చిమాసియా దేశాలన్నిటినీ భాగస్వాముల్ని చేయాలని ఇరాన్ డిమాండ్ చేసింది. అలాగైతేనే అణ్వస్త్రరహిత పశ్చిమాసియా సాకారమవుతుందని స్పష్టం చేసింది. అయితే తన సన్నిహిత దేశమైన ఇజ్రాయెల్ వద్ద అప్రకటిత అణ్వస్త్రాలున్నందువల్ల అమెరికాకు ఇది మింగుడు పడలేదు. ఎలాగైతేనేం ఇరాన్‌తో ఈ దేశాలన్నీ అణు ఒప్పందం కుదుర్చుకున్నాయి. అవి ఉత్తపుణ్యానికి ఈ పని చేయలేదు. ఇరాక్ దురాక్రమణతో బొప్పికట్టి, సిరియాలో కూడా చేతులు కాల్చుకుని ఈ అగ్రరాజ్యాలన్నీ అయోమయావస్థలో ఉన్నాయి. పశ్చిమాసియా తమ చేజారుతోందని గ్రహించాయి. అణుబాంబులు చేయడానికి అవసరమైన సాధనాసంపత్తి అంతా ఇరాన్ దగ్గర సిద్ధంగా ఉన్నదని, ఈ స్థితిలో దాన్ని నిలువరించడం కూడా కష్టమని వాటికి అర్ధమైంది. పైగా ఈ ప్రాంతంలో అత్యంత శక్తివంతమైన సైన్యం ఉన్నది ఇరాన్‌కు మాత్రమే. ఇవన్నీ గమనించాకే ఆ దేశాలు ఇరాన్‌తో సంప్రదింపులకు సిద్ధమయ్యాయి. ఇరాన్ సైతం దశాబ్దాల తరబడి అమలైన ఆంక్షలతో అన్నివిధాలా దెబ్బతింది. ప్రాణావసరమైన ఔష ధాలు లభ్యంకాక లక్షలమంది పౌరులు చనిపోయారు. ఉపాధి లేమి, అధిక ధరలు, మంద గించిన ఉత్పత్తి ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశాయి. అత్యంత విలువైన ముడి చమురు అపారంగా లభ్యమవుతున్నా దాన్ని విక్రయించడానికి ఆంక్షలు అవరోధంగా మారాయి. ఇరాన్లో అతివాద, ఛాందసవాద నాయకుల శకం అంతరించి ఉదారవాద దృక్పథం ఉన్న మధ్యేవాద నాయకుడు హసన్ రౌహానీ అధ్యక్షుడయ్యాక సామరస్య ధోరణిలో సమ స్యల్ని పరిష్కరించుకోవాలన్న అభిప్రాయం బలపడింది. కానీ ఇప్పుడు ట్రంప్ నిర్ణయంతో రౌహానీ స్థితి బలహీనపడే ప్రమాదం ఏర్పడింది. ఇరాన్ సర్వోన్నత నాయకుడు అలీ ఖమేనీ ఇప్పటికే ట్రంప్ ప్రకటనపై తీవ్రంగా స్పందించారు. తాను జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్ వగైరాలను కూడా నమ్మదల్చుకోలేదని నిర్మొహమాటంగా చెప్పారు. దేశ ప్రయోజనాలకు ముప్పు ఏర్ప డుతుందనుకుంటే అణ్వాయుధాల తయారీ బాటపడతామని హెచ్చరించారు. ఆంక్షల సడ లింపు పర్యవసానంగా మూడేళ్ల తర్వాత ఇప్పుడిప్పుడే ఇరాన్ కుదుటపడుతోంది. తొలిసారి నిరుడు స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) పెరిగింది. ఉపాధి అవకాశాలు మెరుగవుతున్నాయి. చమురు రంగంలో పాశ్చాత్య దేశాల పెట్టుబడులు క్రమేపీ పెరుగుతున్నాయి. దేశంలో ఏటా 40,000 కార్ల అమ్మకానికి జర్మన్ కార్ల కంపెనీ డైమ్లర్ ఏర్పాట్లు చేసుకుంది. ఈ కారణాలవల్లే ఈ దేశాలన్నీ ట్రంప్‌కు చివరివరకూ నచ్చజెబుతూ వచ్చాయి. అటు ఇరాన్ సైతం ఒప్పందాన్ని తు.చ.. తప్పకుండా అమలు చేసింది. తనకున్న శుద్ధిచేసిన 10,000 కిలోల యురేనియంలో కేవలం 3 శాతం మాత్రమే ఉంచుకుని మిగిలినదంతా ఐఏఈఏకు అప్ప జెప్పింది. కీలకమైన ప్లుటోనియం ప్లాంట్‌ను పూర్తిగా తొలగించింది. ఇవన్నీ ట్రంప్‌కు సరిపోలేదు. ఒప్పందంలో లేని బాలిస్టిక్ క్షిపణుల ధ్వంసం, ఉగ్రవాద సంస్థలకు మద్దతు నిలుపుదల వంటి అంశాలను చేరుస్తూ సరికొత్త ఒప్పందం చేసుకోవాలంటున్నారు. వాటిపై మరో ఒప్పందానికి రావాలని కోరకుండా కుదిరిన ఒప్పందాన్ని రద్దు చేయాలనడం మూర్ఖత్వం తప్ప మరొకటి కాదు. ఒకపక్క తనతో చర్చలకు సిద్ధపడుతూ వేరే దేశంతో కుదిరిన పాత ఒప్పందాన్ని రద్దు చేసు కున్న ట్రంప్‌ను ఉత్తరకొరియా నమ్మగలదా? ఈ అవివేక నిర్ణయాన్ని నిలువరించగలిగింది, ప్రపంచాన్ని సంక్షోభం ముంచెత్తకుండా చూసేది అమెరికా పౌరుల విజ్ఞతే. వారు గట్టిగా ఒత్తిడి తెస్తే తప్ప ట్రంప్ దారికి రారు. ఆ దిశగా వారు కదలాలి. -
ఆరులక్షల కోట్లు ఏం చేయాలి ?
టెహరాన్: ఇంతకాలం అగ్ర దేశాల ఆంక్షల వల్ల తమ ఆర్థిక వ్యవస్థ కునారిల్లిపోతోందంటూ ఆగ్రహావేశాలు వెల్లగక్కిన ఇరాన్‌కు ఇటీవలి అణు ఒప్పందంతో చిత్రమైన విపత్కర పరిస్థితి ఎదుర్కొంటోంది. అణు ఒప్పందం కారణంగా అమెరికా సహా పలు అగ్ర దేశాలు ఆంక్షలు ఎత్తివేస్తున్నట్టు ప్రకటించడంతో దాదాపు ఆరు లక్షల కోట్ల రూపాయలు ఇరాన్ ఆర్థిక వ్యవస్థలోకి వచ్చిపడుతున్నాయి. ఇంతడబ్బును ఎలా ఖర్చు పెట్టాలో తెలియక ఇరాన్ అప్పుడే ఉక్కిరిబిక్కిర అవుతోంది. అధ్యక్షుడు హసన్ రౌహానిఅఫ్తర్ కూడా ఏం చేయాలంటూ జట్టూ గడ్డం పీక్కుంటున్నారట! డబ్బు లేకపోతే కంగారుపడవచ్చుగానీ ఇబ్బడి ముబ్బడిగా డబ్బులొచ్చి పడితే వివిధ పథకాల కింద ఖర్చు పెట్టడం పెద్ద కష్టం కాదని సామాన్య ప్రజలు భావించవచ్చు. అలా భావించడానికి విదేశీ పెట్టుబడుల రూపంలో ఈ డబ్బు రావడం లేదు. ఆంక్షల కారణంగా వివిధ దేశాల్లో ఇంతకాలం స్తంభించి పోయిన నిధులు దాదాపు ఆరు లక్షల కోట్ల రూపాయలు ఇప్పుడు ఆంక్షలు ఎత్తివేయడంతో ఇరాన్‌కు వస్తున్నాయి. అతిజాగ్రత్తగా, వ్యూహాత్మకంగా ఈ డబ్బులను పునర్ పెట్టుబడుల రూపంలోకి మార్చుకోకపోతే దేశంలో ద్రవ్యోల్బణం రావడం ఖాయం. అప్పటికీ పరిస్థితి నియంత్రలోకి రాకపోతే ఆర్థిక మాంద్యం వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకనే ఇప్పటికే రౌహాని, రానున్న పరిస్థితిని చక్చదిద్దేందుకు ఓ మంత్రివర్గ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఇటు ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా, అటు ప్రస్తుత రాజకీయ వ్యవస్థకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా వ్యూహరచన చేయాల్సిన బాధ్యత ఈ కేబినెట్ కమిటీది. అగ్ర దేశాలతో మంగళవారం అణు ఒప్పందం చేసుకోవడం, ఆంక్షలు ఎత్తివేస్తామంటూ ఆ దేశాలు హామి ఇచ్చారనే వార్తలు వెలువడగానే దేశీయంగా స్టాక్ మార్కెట్లు పడిపోవడం ముందున్న ప్రమాదానికి హెచ్చరిక ఘంటలేనని వ్యాపారవేత్తలు సూచిస్తున్నారు. ‘కేవలం అగ్రరాజ్యాల ఆంక్షల కారణంగా మా ఆర్థిక వ్యవస్థకు వస్తున్న సమస్యలు కేవలం 15 నుంచి 30 శాతం వరకు మాత్రమే ఉంటుంది. నిర్వహణాలోపం కారణంగానే 70 శాతం సమస్యలు ఎదుర్కొంటోంది. అందువల్ల అగ్ర దేశాలు ఆంక్షలు ఎత్తివేయడం వల్ల మా ఆర్థిక వ్యవస్థ సమస్యలు తీరవు’ అని టెహరాన్ వాణిజ్య, పారిశ్రామిక మండలి అధ్యక్షుడు యాహ్య అలే-ఎషాగ్ వ్యాఖ్యానించారు. ఆంక్షలు ఎత్తివేయడం వల్ల ఇరాన్ విరబూసిన పూతోటేమి కాబోదని కూడా ఆయన స్థానిక మీడియాతో వ్యాఖ్యానించారు. ఆరు లక్షల కోట్ల రూపాయలంటే ఇరాన్ ఏడాది స్థూలాదాయంలో మూడోవంతు. ప్రస్తుత ఇరాన్ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను పరిగణలోకి తీసుకుంటే ఇంత సొమ్మును మేనేజ్ చేయడమంటే దేశాధ్యక్షుడు రౌహానికి పెద్ద సవాలే. రెండేళ్ల క్రితం 40 శాతం ఉన్న ద్రవ్యోల్బణాన్ని కష్టపడి 16 శాతానికి తీసుకొచ్చారు. జాతీయ స్థూలాదాయం పెరగకుండా, విదేశీ పెట్టుబడులు రాకుండా ఉంటే పరిస్థితి తీవ్రంగానే ఉంటుందని ఆర్థిక నిపుణలు హెచ్చరిస్తున్నారు. డాలరుకు, ఇరాన్ కరెన్సీకి ఇప్పటికే ఎక్కువున్న వ్యత్యాసం మరింత పెరిగి ద్రవ్యోల్బణం పెరుగుతుంద న్నది వ్యాపారవేత్తల భయాందోళన. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెటోలో ఇరాన్ కరెన్సీ విలువ ఒక డాలర్‌కు 32,700 రియల్స్ వుంది. దీని విలువ మరింత పడిపోతే వ్యవసాయరంగం, ఎగుమతుల రంగం తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. విదేశీ వస్తువులపై మోజు చూపే మధ్యతరగతి ప్రజలపై కూడా భారం పడుతుంది. అంతర్జాతీయ మార్కెట్‌తో పోటీపడేందుకు వీలుగా రుణాల వడ్డీలను తగ్గించాల్సిందిగా ఎగుమతుదారులు చేసిన పలు విజ్ఞప్తులను ఇరాన్ సెంట్రల్ బ్యాంక్ ఇప్పటికే కొట్టివేసింది. రుణాలపై ఇరాన్ బ్యాంకులు 20 శాతం వడ్డీని వసూలు చేస్తున్నాయి. కఠినమైన కార్మిక చట్టాలు ఉండడం వల్ల విదేశీ పెట్టుబడులు, ప్రాజెక్టులు కూడా పెద్దగా వచ్చే అవకాశాలు లేవని మార్కెట్ వర్గాలు తెలియజేస్తున్నాయి. 1979 ఇరాన్ విప్లవం కారణంగా ఈ కఠిన చట్టాలు అమల్లోకి వచ్చాయి. ఎట్టి పరిస్థితుల్లో కార్మికులను మూకుమ్మడిగా తీయడంగానీ కంపెనీల్లో లేఆఫ్‌లను ప్రకటించడంగానీ చేయడానికి వీలు లేదు. జీత, భత్యాల విషయంలోనూ నిర్దిష్టమైన ప్రమాణాలు ఉన్నాయి. -
భేషైన ఒప్పందం
వచ్చే ఏడాది అమెరికా అధ్యక్ష పదవినుంచి వైదొలగబోతున్న బరాక్ ఒబామా ప్రపంచానికీ, తన దేశ ప్రజలకూ ఒక విలువైన బహుమతినిచ్చారు. ఇరాన్ అణు ఒప్పందం సాకారం కావడంలో కీలకపాత్ర పోషించారు. దాదాపు రెండు వారాల పాటు వియెన్నాలో జరిగిన చర్చలు ఫలించి కుదిరిన ఈ ఒప్పందం కింద తన అణు కేంద్రాల తనిఖీకి ఇరాన్ అంగీకరిస్తే... మూడున్నర దశాబ్దాల నుంచి ఆ దేశంపై అమలవుతున్న కఠినమైన ఆంక్షలను ఎత్తేయడానికి అగ్రరాజ్యాలు ఒప్పుకున్నాయి. ఈ రెండు వారాల్లోనూ ఎంతో ఉత్కంఠ నెలకొంది. ఇరాన్ తన సైనిక స్థావరాలను అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ) తనిఖీ చేసేందుకు ససేమిరా అంటే... ఇరాన్‌పై సడలించాల్సిన ఆంక్షలపై అగ్రరాజ్యాలు మంకుపట్టు పట్టాయి. ఒక దశలో ఈ చర్చలు విఫలమవుతాయన్న అభిప్రాయం కలిగింది. కానీ రెండు పక్షాలూ తమ తమ వైఖరులను సడలించుకున్నాయి. అమెరికా-ఇరాన్‌ల మధ్య నెలకొన్న వైషమ్యాలే ఈ సమస్యకంతకూ మూలం. దీనికి మూడున్నర దశాబ్దాల చరిత్ర ఉంది. తనకు అత్యంత ఆప్తుడిగా ఉన్న ఇరాన్ పాలకుడు మహ్మద్ రెజా పహ్లావీని 1979లో జరిగిన విప్లవంలో పదవీచ్యుతుణ్ణి చేయడంతో కుంగిపోయి ఉన్న అమెరికాకు వెనువెంటనే మరో దెబ్బ తగిలింది. టెహ్రాన్‌లోని ఆ దేశ రాయబార కార్యాలయంపై విద్యార్థులు దాడిచేసి అనేక మందిని బందీలుగా పట్టుకున్నారు. వారిని విడిపించడానికి జరిగిన చర్చలు, సైనిక చర్య విఫలమయ్యాక 444 రోజుల తర్వాత బందీలకు విముక్తి లభించింది. ఆనాటి నుంచీ ఇరాన్‌పై అమెరికా కత్తిగట్టింది. 1988లో ఇరాన్‌కు చెందిన ప్రయాణికుల విమానాన్ని అమెరికా కూల్చేయడంతో 290మంది సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అది సైనిక విమానమని అమెరికా వాదించింది. ఇరాన్‌పై తాను విధిస్తూ వచ్చిన ఆంక్షలు సరైన ఫలితాలనీయడంలేదని భావించిన అమెరికా దీన్ని 2002లో ప్రపంచ సమస్యగా మార్చింది. అది రహస్యంగా అణ్వాయుధ కార్యక్రమం చేపట్టిందనీ, ఉగ్రవాదానికి ఊతం ఇస్తున్నదని ఆరోపించి ఆ ప్రాతిపదికన భద్రతామండలి ద్వారా ఆంక్షలు విధింపజేసే ఎత్తుగడలకు పూనుకుంది. తన యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని విరమించుకోవడానికి ఇరాన్ నిరాకరించడంతో భద్రతామండలి 2006లో ఆంక్షలు విధించడం ప్రారంభించింది. 2012 నుంచి ఇవి మరింత కఠినమయ్యాయి. ఇవన్నీ ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దారుణంగా కుంగదీశాయి. ప్రధాన ఆదాయ వనరైన చమురు ఎగుమతుల్లో సింహ భాగం నిలిచిపోవడం...అమెరికా బ్యాంకుల్లో ఉన్న వేల కోట్ల డాలర్ల డిపాజిట్లు, బంగారం నిల్వలు స్తంభించిపోవడంతో ఇరాన్‌కు సమస్యలు పెరిగాయి. నిరుద్యోగం తీవ్రంకాగా... నిత్యావసరాల ధరలు చుక్కలనంటాయి. విద్యుత్ కొరతతో సతమతమైంది. ఇన్ని ఆంక్షలమధ్యా ఇరాన్ అణు కార్యక్రమాన్ని కొనసాగించింది నిజానికి ఈ విద్యుత్ సంక్షోభంనుంచి బయటపడేందుకే. తమ దేశం గురించి మాత్రమే కాక... మొత్తం పశ్చిమాసియా దేశాలను భాగస్తుల్ని చేసి అణు కార్యక్రమంపై చర్చించాలని, ఆ చర్చ అంతిమంగా అణ్వస్త్ర నిషేధానికి తోడ్పడాలనీ ఇరాన్ వాదిస్తూ వస్తోంది. ఇజ్రాయెల్ వద్ద ఇప్పటికే అప్రకటిత అణ్వస్త్రాలు ఉన్నందువల్ల అమెరికా దీనికి సిద్ధపడలేకపోయింది. అయితే గత రెండేళ్లుగా పరిస్థితి మారింది. పశ్చిమాసియా క్రమేపీ చేజారుతున్న వైనాన్ని పశ్చిమ దేశాలు పసిగట్టాయి. ఇరాక్‌లో సంపూర్ణ వైఫల్యమూ, సిరియాలో చేతులు కాలడం వగైరా పరిణామాలన్నీ వాటిని పునరాలోచనలో పడేశాయి. మొత్తం అణు కార్యక్రమాన్ని ఇరాన్ ఆపేయాలని పట్టుబడుతూ వచ్చినవారు దాన్ని పరిమి తంగా కొనసాగించుకునేందుకు అంగీకరించింది అందుకే. ఇరాన్ తన సెంట్రిఫ్యూజ్‌ల సంఖ్యను తగ్గించుకోవడం, శుద్ధి చేసిన యురేనియం నిల్వల్లో చాలా భాగాన్ని తొలగించడం, ప్లుటోనియం ఉత్పత్తిని నిలిపేయడంవంటివి చేయాలని మంగళవారం కుదిరిన ఒప్పందం నిర్దేశిస్తున్నది. అలాగే, ఐఏఈఏ జరిపే తనిఖీలకు ఇరాన్ సహకరించాల్సి ఉంటుంది. మరోపక్క ఇరాన్‌పై ఉన్న ఆంక్షలన్నీ దాదాపు తొలగి పోతాయి. వాస్తవానికి ఇరాన్ ఆచరణ చూశాకే ఒక్కొక్కటిగా ఆంక్షల్ని తొలగిస్తామని పశ్చిమ దేశాలు తొలుత చెప్పాయి. అయితే ఇరాన్ ఒప్పుకోలేదు. పరస్పర విశ్వాసం ఉన్నప్పుడే ఏ చర్చలైనా ఫలిస్తాయని స్పష్టంచేసింది. పర్యవసానంగా ఆయుధాలపై ఉండే ఆంక్షలు అయిదేళ్లు, క్షిపణులపై ఉండే ఆంక్షలు ఎనిమిదేళ్లు కొనసాగుతాయని... మిగిలినవన్నీ వెనువెంటనే సడలిస్తామని పశ్చిమ దేశాలు ఒప్పుకోక తప్పలేదు. అయితే, ఈ ఒప్పందానికి అనేక అవరోధాలు పొంచి ఉన్నాయి. ఒబామా కుదుర్చుకున్న ఈ ఒప్పందంపై ఆయన ప్రత్యర్థి పక్షం రిపబ్లికన్ పార్టీ గుర్రుగా ఉంది. దాన్ని కాంగ్రెస్‌లో ఓడిస్తామని ప్రకటించింది. ఇజ్రాయెల్ సైతం దీన్ని చారిత్రక తప్పిదమంటూ బుసలు కొడుతున్నది. అటు ఇరాన్ కూడా సైనిక స్థావరాల తనిఖీకి షరతులతోనే అంగీకరించింది. వారు తనిఖీ చేస్తామని ఇచ్చే ప్రతిపాదనలను సవాల్ చేసే అధికారాన్ని ఉంచుకుంది. ఒకవేళ ఒప్పందాన్ని ఉల్లంఘించే పక్షంలో 65 రోజుల్లో ఆంక్షల పునరుద్ధరణ ఉంటుందన్న షరతును ఇరాన్ అంగీకరించింది. ఇరాన్లో ఛాందసవాదులు సైతం ఈ ఒప్పందంపై కారాలు మిరియాలు నూరుతున్నారు. ప్రస్తుత ఒప్పందానికి దారితీసిన కారణాలేమైనా కావొచ్చుగానీ... ఓపిగ్గా వ్యవహరిస్తే, సంప్రదింపులను కొనసాగిస్తే ఎంతటి జటిలమైన సమస్యకైనా పరిష్కారం లభించకపోదని రుజువైంది. ఈ ఒప్పందం సక్రమంగా అమలైతే పశ్చిమాసియా రూపురేఖలే మారిపోతాయి. అటు అరబ్ దేశాలూ, ఇటు ఇజ్రాయెల్ గుర్రుగా ఉన్నా ఈ ప్రాంతంలో ఇరాన్ ప్రాధాన్యత పెరుగుతుంది. ఐఎస్ ఉగ్రవాదాన్ని అరికట్టడంలో ఇరాన్ తోడ్పాటు అత్యవసరమని అమెరికా భావిస్తున్నది. తాజా పరిణామాలతో ఏర్పడే వైరుధ్యాలను చాకచక్యంగా వినియోగించు కోగలిగితే మన దేశానికి లబ్ధి చేకూరుతుంది. ఇరాన్‌తో భిన్న రంగాల్లో ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలేర్పడతాయి. -
ఇరాన్ అణు ఒప్పందం.. మనకేంటి?
ఇరాన్ ఆరు ప్రపంచ దిగ్గజ దేశాలు- అమెరికా, చైనా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీలతో మంగళవారం చరిత్రాత్మక అణు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. టెహ్రాన్ అణు కార్యక్రమంసహా పలు అంశాలపై ఆంక్షలు సడలించే అవకాశాలకు ఈ ఒప్పందం వెసులుబాటు కల్పిస్తోంది. ఈ ఒప్పందం పట్ల భారత్ హర్షం వ్యక్తం చేసింది. అసలు ఈ ఒప్పందం వల్ల భారత్‌కు వచ్చే లాభనష్టాలు ఏమిటన్న అంశంపై దృష్టి సారిస్తే... ఒప్పందం కుదిరిందన్న వార్త వెలువడిన వెంటనే అంతర్జాతీయ చమురు ధరలు డాలర్‌కుపైగా పడిపోయాయి. క్రూడ్ భారీ దిగుమతుల దేశంగా భారత్‌కు ఈ వార్త ఎంత సానుకూలమో వేరే చెప్పనక్కర్లేదు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు హెచ్‌పీసీఎల్, ఇండియన్ ఆయిల్, బీపీసీఎల్ వంటి కంపెనీలకు లాభించే అంశం ఇది. అయితే ఓఎన్జీసీ, కెయిర్న్ ఇండియా వంటి చమురు అన్వేషణ కంపెనీలకు ప్రతికూలమే.జామ్‌నగర్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనరీని నిర్వహిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు ఈ ఒప్పందం ‘తటస్థ’ ఫలితాన్ని ఇస్తుంది. ►భారత్ అతిపెద్ద ఆఫ్‌షోర్ డ్రిల్లింగ్ సర్వీసెస్ ప్రొవైడర్ అబాన్ ఆఫ్‌షోర్ తన మొత్తం ఆదాయంలో 35% ఇరాన్ నుంచి పొందుతోంది. ఇది కంపెనీకి లాభించే అంశం. ఇరాన్లో ఆంక్షల సడలింపు కంపెనీ వర్కింగ్ క్యాపిటల్ పరిస్థితిని మెరుగుపరుస్తుంది. ►ఇరాన్ ఫజార్డ్ బీ గ్యాస్ క్షేత్రాల అభివృద్ధి ఇన్ఫ్రా ప్రాజెక్టులను భారత్ దక్కించుకోవాలని చూస్తోంది. తాజా ఒప్పందం నేపథ్యంలో యూరోపియన్ దేశాలు ఈ ప్రాజెక్టును తన్నుకుపోతే పరిస్థితి ఏమిటని చమురు మంత్రిత్వశాఖ ఆందోళన చెందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ► ఆంక్షల సడలింపు జరిగి, ఇతర దేశాలతో ఇరాన్ సరళతరంగా వ్యాపారం చేయగలిగితే- తక్కువ ధరకు ఇరాన్ నుంచి భారత రిఫైనరీలుకు చమురు సరఫరా జరక్కపోవచ్చు. పైగా ఇప్పటివరకూ ఆంక్షల వల్ల చెల్లించే పరిస్థితి లేని దాదాపు 6.5 బిలియన్ డాలర్లను (దాదాపు రూ.40.000 కోట్లు) హార్డ్ కరెన్సీలో తక్షణం చెల్లించాల్సిన పరిస్థితి భారత్ రిఫైనరీలకు ఉత్పన్నమవుతుంది. ► వాణిజ్య మంత్రిత్వశాఖ అధికారుల కథనం ప్రకారం, ఆంక్షల సడలింపు భారత్ ఫార్మా, ఐటీ, కమోడిటీ రంగాలకు కలిసివచ్చే అంశం. ఇరాన్లో ప్రత్యక్ష కాంట్రాక్టులకు ఆయా రంగాల కంపెనీలకు వీలవుతుంది. ► బాస్మతి బియ్యం, సోయామీల్, చక్కెర, బార్లీ, మాంసం వంటి వాటిని ఇరాన్ దేశం మన నుంచి భారీగా కొనుగోలు చేస్తోంది. ఆంక్షల వల్ల ఈ కమోడిటీల కొనుగోలుకు ఇరాన్ 20% ప్రీమియం చెల్లిస్తోంది. ఆంక్షలు తొలగితే ఈ ప్రీమియంలను భారత కంపెనీలు కోల్పోతాయి. ► ఇరాన్‌కు ఎగుమతులకు సంబంధించి ఆ మార్కెట్లో ఇక భారత్ ఎగుమతిదారులు గట్టి పోటీని ఎదుర్కొనే అవకాశం ఉంది. దుస్తుల నుంచి కార్ల వరకూ వివిధ వినియోగ ప్రొడక్టుల అమ్మకాలపై భారత్ కంపెనీలు పోటీని ఎదుర్కోవాలి. ఇరాన్ గ్యాస్ క్షేత్రాల అభివృద్ధిపై దృష్టి అమెరికా సహా ఆరు సంపన్న దేశాలతో ఇరాన్ చరిత్రాత్మక అణు ఒప్పందాన్ని కుదుర్చుకోవడంతో.. ఆ దేశంలో గ్యాస్ క్షేత్రాల అభివృద్ధికి భారత్ సన్నద్ధమవుతోంది. ప్రభుత్వ రంగంలోని ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్(ఓవీఎల్) ఇక్కడ 2008లో కనుగొన్న భారీ గ్యాస్ క్షేత్రం ఫర్జాద్-బికి సంబంధించి అభివృద్ధి హక్కుల కోసం ఇరాన్‌కు విజ్ఞప్తి చేయనుంది. ఇరాన్‌పై ఆంక్షల కారణంగా ఓఎన్జీసీ విదేశ్ దాదాపు 7 బిలియన్ డాలర్ల పెట్టుబడి ప్రణాళిక అమలుకు నోచుకోలేదు. ఇక్కడ 12.8 లక్షల కోట్ల ఘనపుటడుగుల(టీసీఎఫ్) గ్యాస్ నిల్వలు ఉన్నట్లు అంచనా. ఇరాన్‌పై ఆంక్షలు తొలగుతున్న నేపథ్యంలో ఈ గ్యాస్ క్షేత్రం అభివృద్ధి హక్కుల కోసం ఇరాన్‌తో సంప్రదింపులు జరపనున్నట్లు ఓవీఎల్ ఎండీ నరేంద్ర కె. వర్మ చెప్పారు. కాగా, ఇరాన్‌పై ఆంక్షలు తొలగనుండటంతో అక్కడి నుంచి భారత్ ముడి చమురును కూడా ఇక పెద్దమొత్తంలో దిగుమతి చేసుకునేందుకు వీలవుతుందని భారత చమురు రిఫైనరీలు ఆశిస్తున్నాయి. మరోపక్క, అణు ఒప్పందం నేపథ్యంలో ఇరాన్‌కు చెల్లించాల్సిన 6.5 బిలియన్ డాలర్ల ముడి చమురు(క్రూడ్) దిగుమతి బిల్లు బకాయిలను భారతీయ రిఫైనరీలు చెల్లించాల్సి ఉంటుందని చమురు శాఖ వర్గాలు పేర్కొన్నాయి.