వచ్చే ఏడాది అమెరికా అధ్యక్ష పదవినుంచి వైదొలగబోతున్న బరాక్ ఒబామా ప్రపంచానికీ, తన దేశ ప్రజలకూ ఒక విలువైన బహుమతినిచ్చారు. ఇరాన్ అణు ఒప్పందం సాకారం కావడంలో కీలకపాత్ర పోషించారు. దాదాపు రెండు వారాల పాటు వియెన్నాలో జరిగిన చర్చలు ఫలించి కుదిరిన ఈ ఒప్పందం కింద తన అణు కేంద్రాల తనిఖీకి ఇరాన్ అంగీకరిస్తే... మూడున్నర దశాబ్దాల నుంచి ఆ దేశంపై అమలవుతున్న కఠినమైన ఆంక్షలను ఎత్తేయడానికి అగ్రరాజ్యాలు ఒప్పుకున్నాయి. ఈ రెండు వారాల్లోనూ ఎంతో ఉత్కంఠ నెలకొంది. ఇరాన్ తన సైనిక స్థావరాలను అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ) తనిఖీ చేసేందుకు ససేమిరా అంటే... ఇరాన్‌పై సడలించాల్సిన ఆంక్షలపై అగ్రరాజ్యాలు మంకుపట్టు పట్టాయి. ఒక దశలో ఈ చర్చలు విఫలమవుతాయన్న అభిప్రాయం కలిగింది. కానీ రెండు పక్షాలూ తమ తమ వైఖరులను సడలించుకున్నాయి.
అమెరికా-ఇరాన్‌ల మధ్య నెలకొన్న వైషమ్యాలే ఈ సమస్యకంతకూ మూలం. దీనికి మూడున్నర దశాబ్దాల చరిత్ర ఉంది. తనకు అత్యంత ఆప్తుడిగా ఉన్న ఇరాన్ పాలకుడు మహ్మద్ రెజా పహ్లావీని 1979లో జరిగిన విప్లవంలో పదవీచ్యుతుణ్ణి చేయడంతో కుంగిపోయి ఉన్న అమెరికాకు వెనువెంటనే మరో దెబ్బ తగిలింది. టెహ్రాన్‌లోని ఆ దేశ రాయబార కార్యాలయంపై విద్యార్థులు దాడిచేసి అనేక మందిని బందీలుగా పట్టుకున్నారు. వారిని విడిపించడానికి జరిగిన చర్చలు, సైనిక చర్య విఫలమయ్యాక 444 రోజుల తర్వాత బందీలకు విముక్తి లభించింది. ఆనాటి నుంచీ ఇరాన్‌పై అమెరికా కత్తిగట్టింది. 1988లో ఇరాన్‌కు చెందిన ప్రయాణికుల విమానాన్ని అమెరికా కూల్చేయడంతో 290మంది సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అది సైనిక విమానమని అమెరికా వాదించింది. ఇరాన్‌పై తాను విధిస్తూ వచ్చిన ఆంక్షలు సరైన ఫలితాలనీయడంలేదని భావించిన అమెరికా దీన్ని 2002లో ప్రపంచ సమస్యగా మార్చింది.
అది రహస్యంగా అణ్వాయుధ కార్యక్రమం చేపట్టిందనీ, ఉగ్రవాదానికి ఊతం ఇస్తున్నదని ఆరోపించి ఆ ప్రాతిపదికన భద్రతామండలి ద్వారా ఆంక్షలు విధింపజేసే ఎత్తుగడలకు పూనుకుంది. తన యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని విరమించుకోవడానికి ఇరాన్ నిరాకరించడంతో భద్రతామండలి 2006లో ఆంక్షలు విధించడం ప్రారంభించింది. 2012 నుంచి ఇవి మరింత కఠినమయ్యాయి. ఇవన్నీ ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దారుణంగా కుంగదీశాయి. ప్రధాన ఆదాయ వనరైన చమురు ఎగుమతుల్లో సింహ భాగం నిలిచిపోవడం...అమెరికా బ్యాంకుల్లో ఉన్న వేల కోట్ల డాలర్ల డిపాజిట్లు, బంగారం నిల్వలు స్తంభించిపోవడంతో ఇరాన్‌కు సమస్యలు పెరిగాయి. నిరుద్యోగం తీవ్రంకాగా... నిత్యావసరాల ధరలు చుక్కలనంటాయి. విద్యుత్ కొరతతో సతమతమైంది. ఇన్ని ఆంక్షలమధ్యా ఇరాన్ అణు కార్యక్రమాన్ని కొనసాగించింది నిజానికి ఈ విద్యుత్ సంక్షోభంనుంచి బయటపడేందుకే. తమ దేశం గురించి మాత్రమే కాక... మొత్తం పశ్చిమాసియా దేశాలను భాగస్తుల్ని చేసి అణు కార్యక్రమంపై చర్చించాలని, ఆ చర్చ అంతిమంగా అణ్వస్త్ర నిషేధానికి తోడ్పడాలనీ ఇరాన్ వాదిస్తూ వస్తోంది. ఇజ్రాయెల్ వద్ద ఇప్పటికే అప్రకటిత అణ్వస్త్రాలు ఉన్నందువల్ల అమెరికా దీనికి సిద్ధపడలేకపోయింది.
అయితే గత రెండేళ్లుగా పరిస్థితి మారింది. పశ్చిమాసియా క్రమేపీ చేజారుతున్న వైనాన్ని పశ్చిమ దేశాలు పసిగట్టాయి. ఇరాక్‌లో సంపూర్ణ వైఫల్యమూ, సిరియాలో చేతులు కాలడం వగైరా పరిణామాలన్నీ వాటిని పునరాలోచనలో పడేశాయి. మొత్తం అణు కార్యక్రమాన్ని ఇరాన్ ఆపేయాలని పట్టుబడుతూ వచ్చినవారు దాన్ని పరిమి తంగా కొనసాగించుకునేందుకు అంగీకరించింది అందుకే. ఇరాన్ తన సెంట్రిఫ్యూజ్‌ల సంఖ్యను తగ్గించుకోవడం, శుద్ధి చేసిన యురేనియం నిల్వల్లో చాలా భాగాన్ని తొలగించడం, ప్లుటోనియం ఉత్పత్తిని నిలిపేయడంవంటివి చేయాలని మంగళవారం కుదిరిన ఒప్పందం నిర్దేశిస్తున్నది. అలాగే, ఐఏఈఏ జరిపే తనిఖీలకు ఇరాన్ సహకరించాల్సి ఉంటుంది. మరోపక్క ఇరాన్‌పై ఉన్న ఆంక్షలన్నీ దాదాపు తొలగి పోతాయి. వాస్తవానికి ఇరాన్ ఆచరణ చూశాకే ఒక్కొక్కటిగా ఆంక్షల్ని తొలగిస్తామని పశ్చిమ దేశాలు తొలుత చెప్పాయి.
అయితే ఇరాన్ ఒప్పుకోలేదు. పరస్పర విశ్వాసం ఉన్నప్పుడే ఏ చర్చలైనా ఫలిస్తాయని స్పష్టంచేసింది. పర్యవసానంగా ఆయుధాలపై ఉండే ఆంక్షలు అయిదేళ్లు, క్షిపణులపై ఉండే ఆంక్షలు ఎనిమిదేళ్లు కొనసాగుతాయని... మిగిలినవన్నీ వెనువెంటనే సడలిస్తామని పశ్చిమ దేశాలు ఒప్పుకోక తప్పలేదు. అయితే, ఈ ఒప్పందానికి అనేక అవరోధాలు పొంచి ఉన్నాయి. ఒబామా కుదుర్చుకున్న ఈ ఒప్పందంపై ఆయన ప్రత్యర్థి పక్షం రిపబ్లికన్ పార్టీ గుర్రుగా ఉంది. దాన్ని కాంగ్రెస్‌లో ఓడిస్తామని ప్రకటించింది. ఇజ్రాయెల్ సైతం దీన్ని చారిత్రక తప్పిదమంటూ బుసలు కొడుతున్నది. అటు ఇరాన్ కూడా సైనిక స్థావరాల తనిఖీకి షరతులతోనే అంగీకరించింది. వారు తనిఖీ చేస్తామని ఇచ్చే ప్రతిపాదనలను సవాల్ చేసే అధికారాన్ని ఉంచుకుంది. ఒకవేళ ఒప్పందాన్ని ఉల్లంఘించే పక్షంలో 65 రోజుల్లో ఆంక్షల పునరుద్ధరణ ఉంటుందన్న షరతును ఇరాన్ అంగీకరించింది.
ఇరాన్‌లో ఛాందసవాదులు సైతం ఈ ఒప్పందంపై కారాలు మిరియాలు నూరుతున్నారు. ప్రస్తుత ఒప్పందానికి దారితీసిన కారణాలేమైనా కావొచ్చుగానీ... ఓపిగ్గా వ్యవహరిస్తే, సంప్రదింపులను కొనసాగిస్తే ఎంతటి జటిలమైన సమస్యకైనా పరిష్కారం లభించకపోదని రుజువైంది. ఈ ఒప్పందం సక్రమంగా అమలైతే పశ్చిమాసియా రూపురేఖలే మారిపోతాయి. అటు అరబ్ దేశాలూ, ఇటు ఇజ్రాయెల్ గుర్రుగా ఉన్నా ఈ ప్రాంతంలో ఇరాన్ ప్రాధాన్యత పెరుగుతుంది. ఐఎస్ ఉగ్రవాదాన్ని అరికట్టడంలో ఇరాన్ తోడ్పాటు అత్యవసరమని అమెరికా భావిస్తున్నది. తాజా పరిణామాలతో ఏర్పడే వైరుధ్యాలను చాకచక్యంగా వినియోగించు కోగలిగితే మన దేశానికి లబ్ధి చేకూరుతుంది. ఇరాన్‌తో భిన్న రంగాల్లో ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలేర్పడతాయి.
భేషైన ఒప్పందం
Published Thu, Jul 16 2015 1:35 AM | Last Updated on Sun, Sep 3 2017 5:33 AM
Advertisement