ఇరాన్ అణు ఒప్పందం.. మనకేంటి? | Nuclear deal with Iran? | Sakshi
Sakshi News home page

ఇరాన్ అణు ఒప్పందం.. మనకేంటి?

Published Wed, Jul 15 2015 12:41 AM | Last Updated on Sun, Sep 3 2017 5:29 AM

ఇరాన్ అణు ఒప్పందం.. మనకేంటి?

ఇరాన్ అణు ఒప్పందం.. మనకేంటి?

ఇరాన్ ఆరు ప్రపంచ దిగ్గజ దేశాలు- అమెరికా, చైనా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీలతో మంగళవారం చరిత్రాత్మక అణు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. టెహ్రాన్ అణు కార్యక్రమంసహా పలు అంశాలపై ఆంక్షలు సడలించే అవకాశాలకు ఈ ఒప్పందం వెసులుబాటు కల్పిస్తోంది.  ఈ ఒప్పందం పట్ల భారత్ హర్షం వ్యక్తం చేసింది. అసలు ఈ ఒప్పందం వల్ల భారత్‌కు వచ్చే లాభనష్టాలు ఏమిటన్న అంశంపై దృష్టి సారిస్తే...

     ఒప్పందం కుదిరిందన్న వార్త వెలువడిన వెంటనే అంతర్జాతీయ చమురు ధరలు డాలర్‌కుపైగా పడిపోయాయి. క్రూడ్ భారీ దిగుమతుల దేశంగా భారత్‌కు ఈ వార్త ఎంత సానుకూలమో వేరే చెప్పనక్కర్లేదు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు హెచ్‌పీసీఎల్, ఇండియన్ ఆయిల్, బీపీసీఎల్ వంటి కంపెనీలకు లాభించే అంశం ఇది.  అయితే ఓఎన్‌జీసీ, కెయిర్న్ ఇండియా వంటి చమురు అన్వేషణ కంపెనీలకు ప్రతికూలమే.జామ్‌నగర్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనరీని నిర్వహిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు ఈ ఒప్పందం ‘తటస్థ’ ఫలితాన్ని ఇస్తుంది.

►భారత్ అతిపెద్ద ఆఫ్‌షోర్ డ్రిల్లింగ్ సర్వీసెస్ ప్రొవైడర్ అబాన్ ఆఫ్‌షోర్ తన మొత్తం ఆదాయంలో 35% ఇరాన్ నుంచి పొందుతోంది. ఇది కంపెనీకి లాభించే అంశం. ఇరాన్‌లో ఆంక్షల సడలింపు కంపెనీ వర్కింగ్ క్యాపిటల్ పరిస్థితిని మెరుగుపరుస్తుంది.
►ఇరాన్ ఫజార్డ్ బీ గ్యాస్ క్షేత్రాల అభివృద్ధి ఇన్‌ఫ్రా ప్రాజెక్టులను భారత్ దక్కించుకోవాలని చూస్తోంది. తాజా ఒప్పందం నేపథ్యంలో యూరోపియన్ దేశాలు ఈ ప్రాజెక్టును తన్నుకుపోతే పరిస్థితి ఏమిటని చమురు మంత్రిత్వశాఖ ఆందోళన చెందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
► ఆంక్షల సడలింపు జరిగి, ఇతర దేశాలతో ఇరాన్ సరళతరంగా వ్యాపారం చేయగలిగితే- తక్కువ ధరకు ఇరాన్ నుంచి భారత రిఫైనరీలుకు చమురు సరఫరా జరక్కపోవచ్చు. పైగా ఇప్పటివరకూ ఆంక్షల వల్ల చెల్లించే పరిస్థితి లేని దాదాపు 6.5 బిలియన్ డాలర్లను (దాదాపు రూ.40.000 కోట్లు) హార్డ్ కరెన్సీలో తక్షణం చెల్లించాల్సిన పరిస్థితి భారత్ రిఫైనరీలకు ఉత్పన్నమవుతుంది.
► వాణిజ్య మంత్రిత్వశాఖ అధికారుల కథనం ప్రకారం, ఆంక్షల సడలింపు భారత్ ఫార్మా, ఐటీ, కమోడిటీ  రంగాలకు కలిసివచ్చే అంశం. ఇరాన్‌లో ప్రత్యక్ష కాంట్రాక్టులకు ఆయా రంగాల కంపెనీలకు వీలవుతుంది.
► బాస్మతి బియ్యం, సోయామీల్, చక్కెర, బార్లీ, మాంసం వంటి వాటిని ఇరాన్ దేశం మన నుంచి  భారీగా కొనుగోలు చేస్తోంది.  ఆంక్షల వల్ల ఈ కమోడిటీల కొనుగోలుకు  ఇరాన్ 20% ప్రీమియం చెల్లిస్తోంది. ఆంక్షలు తొలగితే ఈ ప్రీమియంలను భారత కంపెనీలు కోల్పోతాయి.
► ఇరాన్‌కు ఎగుమతులకు సంబంధించి ఆ మార్కెట్‌లో ఇక భారత్ ఎగుమతిదారులు గట్టి పోటీని ఎదుర్కొనే అవకాశం ఉంది. దుస్తుల నుంచి కార్ల వరకూ వివిధ వినియోగ ప్రొడక్టుల అమ్మకాలపై భారత్ కంపెనీలు పోటీని ఎదుర్కోవాలి.  
 
 ఇరాన్ గ్యాస్ క్షేత్రాల అభివృద్ధిపై దృష్టి

 అమెరికా సహా ఆరు సంపన్న దేశాలతో ఇరాన్ చరిత్రాత్మక అణు ఒప్పందాన్ని కుదుర్చుకోవడంతో.. ఆ దేశంలో గ్యాస్ క్షేత్రాల అభివృద్ధికి భారత్ సన్నద్ధమవుతోంది. ప్రభుత్వ రంగంలోని ఓఎన్‌జీసీ విదేశ్ లిమిటెడ్(ఓవీఎల్) ఇక్కడ 2008లో కనుగొన్న భారీ గ్యాస్ క్షేత్రం ఫర్జాద్-బికి సంబంధించి అభివృద్ధి హక్కుల కోసం ఇరాన్‌కు విజ్ఞప్తి చేయనుంది. ఇరాన్‌పై ఆంక్షల కారణంగా ఓఎన్‌జీసీ విదేశ్ దాదాపు 7 బిలియన్ డాలర్ల పెట్టుబడి ప్రణాళిక అమలుకు నోచుకోలేదు.

ఇక్కడ 12.8 లక్షల కోట్ల ఘనపుటడుగుల(టీసీఎఫ్) గ్యాస్ నిల్వలు ఉన్నట్లు అంచనా. ఇరాన్‌పై ఆంక్షలు తొలగుతున్న నేపథ్యంలో ఈ గ్యాస్ క్షేత్రం అభివృద్ధి హక్కుల కోసం ఇరాన్‌తో సంప్రదింపులు జరపనున్నట్లు ఓవీఎల్ ఎండీ నరేంద్ర కె. వర్మ చెప్పారు. కాగా, ఇరాన్‌పై ఆంక్షలు తొలగనుండటంతో అక్కడి నుంచి భారత్ ముడి చమురును కూడా ఇక పెద్దమొత్తంలో దిగుమతి చేసుకునేందుకు వీలవుతుందని భారత చమురు రిఫైనరీలు ఆశిస్తున్నాయి. మరోపక్క, అణు ఒప్పందం నేపథ్యంలో ఇరాన్‌కు చెల్లించాల్సిన 6.5 బిలియన్ డాలర్ల ముడి చమురు(క్రూడ్) దిగుమతి బిల్లు బకాయిలను భారతీయ రిఫైనరీలు చెల్లించాల్సి ఉంటుందని చమురు శాఖ వర్గాలు పేర్కొన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement