ఆరులక్షల కోట్లు ఏం చేయాలి ? | Iranians’ View of the Nuclear Deal | Sakshi
Sakshi News home page

ఆరులక్షల కోట్లు ఏం చేయాలి ?

Published Thu, Jul 16 2015 2:35 PM | Last Updated on Sun, Sep 3 2017 5:37 AM

ఆరులక్షల కోట్లు ఏం చేయాలి ?

ఆరులక్షల కోట్లు ఏం చేయాలి ?

టెహరాన్: ఇంతకాలం అగ్ర దేశాల ఆంక్షల వల్ల తమ ఆర్థిక వ్యవస్థ కునారిల్లిపోతోందంటూ ఆగ్రహావేశాలు వెల్లగక్కిన ఇరాన్‌కు ఇటీవలి అణు ఒప్పందంతో చిత్రమైన విపత్కర పరిస్థితి ఎదుర్కొంటోంది. అణు ఒప్పందం కారణంగా అమెరికా సహా పలు అగ్ర దేశాలు ఆంక్షలు ఎత్తివేస్తున్నట్టు ప్రకటించడంతో దాదాపు ఆరు లక్షల కోట్ల రూపాయలు ఇరాన్ ఆర్థిక వ్యవస్థలోకి వచ్చిపడుతున్నాయి. ఇంతడబ్బును ఎలా ఖర్చు పెట్టాలో తెలియక ఇరాన్ అప్పుడే ఉక్కిరిబిక్కిర అవుతోంది. అధ్యక్షుడు హసన్ రౌహానిఅఫ్తర్ కూడా ఏం చేయాలంటూ జట్టూ గడ్డం పీక్కుంటున్నారట!

డబ్బు లేకపోతే కంగారుపడవచ్చుగానీ ఇబ్బడి ముబ్బడిగా డబ్బులొచ్చి పడితే వివిధ పథకాల కింద ఖర్చు పెట్టడం పెద్ద కష్టం కాదని సామాన్య ప్రజలు భావించవచ్చు. అలా భావించడానికి విదేశీ పెట్టుబడుల రూపంలో ఈ డబ్బు రావడం లేదు. ఆంక్షల కారణంగా వివిధ దేశాల్లో ఇంతకాలం  స్తంభించి పోయిన నిధులు దాదాపు ఆరు లక్షల కోట్ల రూపాయలు ఇప్పుడు ఆంక్షలు ఎత్తివేయడంతో ఇరాన్‌కు వస్తున్నాయి.

అతిజాగ్రత్తగా, వ్యూహాత్మకంగా ఈ డబ్బులను పునర్ పెట్టుబడుల రూపంలోకి మార్చుకోకపోతే దేశంలో ద్రవ్యోల్బణం రావడం ఖాయం. అప్పటికీ పరిస్థితి నియంత్రలోకి రాకపోతే ఆర్థిక మాంద్యం వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకనే ఇప్పటికే రౌహాని, రానున్న పరిస్థితిని చక్చదిద్దేందుకు ఓ మంత్రివర్గ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఇటు ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా, అటు ప్రస్తుత రాజకీయ వ్యవస్థకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా వ్యూహరచన చేయాల్సిన బాధ్యత ఈ కేబినెట్ కమిటీది.

అగ్ర దేశాలతో మంగళవారం అణు ఒప్పందం చేసుకోవడం, ఆంక్షలు ఎత్తివేస్తామంటూ ఆ దేశాలు హామి ఇచ్చారనే వార్తలు వెలువడగానే దేశీయంగా స్టాక్ మార్కెట్లు పడిపోవడం ముందున్న ప్రమాదానికి హెచ్చరిక ఘంటలేనని వ్యాపారవేత్తలు సూచిస్తున్నారు. ‘కేవలం అగ్రరాజ్యాల ఆంక్షల కారణంగా మా ఆర్థిక వ్యవస్థకు వస్తున్న సమస్యలు కేవలం 15 నుంచి 30 శాతం వరకు మాత్రమే ఉంటుంది. నిర్వహణాలోపం కారణంగానే 70 శాతం సమస్యలు ఎదుర్కొంటోంది. అందువల్ల అగ్ర దేశాలు ఆంక్షలు ఎత్తివేయడం వల్ల మా ఆర్థిక వ్యవస్థ సమస్యలు తీరవు’ అని టెహరాన్ వాణిజ్య, పారిశ్రామిక మండలి అధ్యక్షుడు యాహ్య అలే-ఎషాగ్ వ్యాఖ్యానించారు. ఆంక్షలు ఎత్తివేయడం వల్ల ఇరాన్ విరబూసిన పూతోటేమి కాబోదని కూడా ఆయన స్థానిక మీడియాతో వ్యాఖ్యానించారు.

ఆరు లక్షల కోట్ల రూపాయలంటే ఇరాన్ ఏడాది స్థూలాదాయంలో మూడోవంతు. ప్రస్తుత ఇరాన్ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను పరిగణలోకి తీసుకుంటే ఇంత సొమ్మును మేనేజ్ చేయడమంటే దేశాధ్యక్షుడు రౌహానికి పెద్ద సవాలే. రెండేళ్ల క్రితం 40 శాతం ఉన్న ద్రవ్యోల్బణాన్ని కష్టపడి 16 శాతానికి తీసుకొచ్చారు. జాతీయ స్థూలాదాయం పెరగకుండా, విదేశీ పెట్టుబడులు రాకుండా ఉంటే పరిస్థితి తీవ్రంగానే ఉంటుందని ఆర్థిక నిపుణలు హెచ్చరిస్తున్నారు.

డాలరుకు, ఇరాన్ కరెన్సీకి ఇప్పటికే ఎక్కువున్న వ్యత్యాసం మరింత పెరిగి ద్రవ్యోల్బణం పెరుగుతుంద న్నది వ్యాపారవేత్తల భయాందోళన. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెటోలో ఇరాన్ కరెన్సీ విలువ ఒక డాలర్‌కు 32,700 రియల్స్ వుంది. దీని విలువ మరింత పడిపోతే వ్యవసాయరంగం, ఎగుమతుల రంగం తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. విదేశీ వస్తువులపై మోజు చూపే మధ్యతరగతి ప్రజలపై కూడా భారం పడుతుంది. అంతర్జాతీయ మార్కెట్‌తో పోటీపడేందుకు వీలుగా రుణాల వడ్డీలను తగ్గించాల్సిందిగా ఎగుమతుదారులు చేసిన పలు విజ్ఞప్తులను ఇరాన్ సెంట్రల్ బ్యాంక్ ఇప్పటికే కొట్టివేసింది. రుణాలపై ఇరాన్ బ్యాంకులు 20 శాతం వడ్డీని వసూలు చేస్తున్నాయి.

కఠినమైన కార్మిక చట్టాలు ఉండడం వల్ల విదేశీ పెట్టుబడులు, ప్రాజెక్టులు కూడా పెద్దగా వచ్చే అవకాశాలు లేవని మార్కెట్ వర్గాలు తెలియజేస్తున్నాయి. 1979 ఇరాన్ విప్లవం కారణంగా ఈ కఠిన చట్టాలు అమల్లోకి వచ్చాయి. ఎట్టి పరిస్థితుల్లో కార్మికులను మూకుమ్మడిగా తీయడంగానీ కంపెనీల్లో లేఆఫ్‌లను ప్రకటించడంగానీ చేయడానికి వీలు లేదు. జీత, భత్యాల విషయంలోనూ నిర్దిష్టమైన ప్రమాణాలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement