ఇప్పుడు నెలకొన్న పరిస్థితులు అసాధారణమైనవి. ప్రభుత్వాలు అన్ని రంగాల్లో పెను సవాళ్లు ఎదుర్కొనవలసి వస్తోంది. ప్రజారోగ్య, సామాజిక, ఆర్థిక రంగాల సమస్యలతోపాటు పాఠశాల విద్యను మళ్లీ పట్టాలెక్కించడం కూడా సమస్యే. కరోనా వైరస్ మహమ్మారి సృష్టించిన సంక్షోభం నుంచి తెరిపినపడటానికి చేసే ప్రయత్నాలను పరిహసిస్తూ కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ వైరస్ నియంత్రణలోకొచ్చాక తిరిగి ప్రారంభం కావాల్సిన కార్యకలాపాల్లో చదువులు అన్నిటి కన్నా ముఖ్యమైనవి. దాన్ని దృష్టిలో పెట్టుకునే పాఠశాలలు తిరిగి తెరవడంపైనా... ఈ విషయంలో తీసుకోవాల్సిన ముందుజాగ్రత్తలపైనా సలహాలు, సూచనలు ఇవ్వాలని ఈ నెల 15న కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది.
ఎవరు ఏ తేదీకి బడులు తెరవడానికి సంసిద్ధంగా ఉన్నారో చెప్పాలని సూచించింది. 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ విషయంలో ఎటూ చెప్పలేకపోయాయం టేనే వర్తమానంలో వైరస్ తీవ్రత ఎంత వుందో అర్థమవుతుంది. ఒక్క అస్సాం మాత్రం ఈ నెలా ఖరున పాఠశాలలు తిరిగి తెరిస్తే బాగుంటుందని చెప్పగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మణిపూర్, నాగాలాండ్, రాజస్తాన్, అరుణచల్ ప్రదేశ్, ఒడిశా, లదాఖ్‌లు సెప్టెంబర్ నెలలో ప్రారంభించడం ఉత్తమమని అభిప్రాయపడ్డాయి. ఢిల్లీ, హరియాణ, బిహార్, చండీగఢ్ ఆగస్టులో పాఠశాలలు తెరిస్తే బాగుంటుందని సూచించాయి. తెలంగాణ, ఉత్తరాఖండ్, పశ్చిమబెంగాల్ తదితర 21 ప్రభుత్వాలు నిర్దిష్టంగా చెప్పలేకపోయాయి.
పాఠశాలలన్నీ నాలుగు నెలలుగా నిరవధికంగా మూతబడి వుండటం వల్ల దేశవ్యాప్తంగా 25 కోట్లమంది పిల్లలు చదువులకు దూరమయ్యారు. కొన్ని రాష్ట్రాలు ఏదో ఒక మేర దూరవిద్య విధానాన్ని అమలు చేయడం మొదలుపెట్టాయి. కానీ దాని ద్వారా లబ్ధి పొందుతున్న పిల్లల శాతం తక్కువే. ఇంటర్నెట్ సదుపాయం అంతంతమాత్రంగా వుండటం, అలాంటి సదుపాయం వున్నా ఖరీదైన ఉపకరణాలను కొనుక్కునే స్తోమత చాలామంది పిల్లలకు లేకపోవడం పర్యవసానంగా ఆన్‌లైన్ చదువులు నామమాత్రంగానే సాగుతున్నాయి. ఒక తరం చదువులకు దూరమైతే పిల్లలకు మాత్రమే కాదు... సమాజానికి కూడా ఎంతో నష్టం వాటిల్లుతుంది. దాన్నుంచి కోలుకోవడం కష్టమవుతుంది. అలాగని వైరస్ మహమ్మారి శాంతించకుండా చదువులు మొదలుపెడితే పర్యవసానాలు తీవ్రంగా వుండే ప్రమాదముంటుంది. ఇప్పుడున్న స్థితిలో పిల్లలు ముప్పు బారిన పడకుండా చూడటం అతి ముఖ్యం.
రాష్ట్ర ప్రభుత్వాల సిలబస్‌లు చాలావరకూ బోధనకు పరిమితమై ఉంటాయి. తరగతి గదిలోని పిల్లలకు టీచర్ వచ్చి బోధించడం, పాఠ్యాంశాలపై అవగాహన కలి గించడం, వారి సందేహాలు తీర్చడం వగైరాలు అందులోవుంటాయి. ఐబీ, ఐజీసీఎస్‌ఈ వంటివి ఇందుకు భిన్నం. అందులో పిల్లలు ఒకరితో ఒకరు సంభాషించుకోవడం, చర్చించుకోవడం ఒక భాగం. విద్యార్థులు బృందాలుగా ఏర్పడి తమకిచ్చిన సమస్యల్ని పరిష్కరించడానికి లేదా ప్రాజెక్టుల్ని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. టీచర్ల సాయం తీసుకుంటారు. ఇక ఆటపాటలు సరేసరి. ఇప్పు డున్న పరిస్థితుల్లో ఇవన్నీ సాధ్యమవుతాయా? విద్యార్థుల మధ్య ఆరేసి అడుగుల దూరం వుండేలా చూడటం, వారు చెట్టపట్టాలు వేసుకోకుండా చూడటం తప్పనిసరి. పిల్లలు భౌతికదూరం పాటిం చేలా చూడటం, ఇతరత్రా జాగ్రత్తలు తీసుకోవడం ఎలా? వర్తమాన పరిస్థితులకు అనుగుణంగా విశా లమైన తరగతి గదుల నిర్మాణం ఎలా? తరగతి గదికి వచ్చాక కాదు... బస్సులోనో, మరో వాహనం లోనో బడికి వస్తున్నప్పుడూ, తిరిగి ఇళ్లకు వెళ్తున్నప్పుడు వారితో పాటింపజేయాల్సినవేమిటి? అనారోగ్యం బారిన పడిన పిల్లలు బడికి రాకుండా తల్లిదండ్రులు ఏదోమేరకు జాగ్రత్తలు తీసుకుంటా రనుకున్నా, ఆ పిల్లలు బడికి వచ్చాక సమస్య బయటపడిన పక్షంలో ఎలాంటి జాగ్రత్తలు తీసు కోవాలి? వారిని మళ్లీ సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించడం, ఆ పిల్లలకు సకాలంలో వైద్యం అందేలా చూడటం ముఖ్యం గనుక అందుకు అదనపు ఏర్పాట్లు చేయాల్సి వస్తుంది.
ఈ ఏర్పాట్ల కోసం ఎన్నో వ్యయప్రయాసలు తప్పవు. అవసరమైన మానవ వనరులు అందుబాటులోకి తీసుకు రావాల్సివుంటుంది. ఇప్పుడు దాదాపు అన్ని రాష్ట్రాల్లో పిల్లలకు మధ్యాహ్న భోజన సదుపాయం వుంటోంది. ఆ సదుపాయాన్ని కొనసాగించడంలో పాటించాల్సిన జాగ్రత్తలేమిటో చూసుకోవాలి. అలాగే కొత్తగా కేసులు బయటపడినచోట పాఠశాలలు మూతబడక తప్పదు. అప్పుడు ఇతర పాఠ శాల విద్యార్థులతోపాటు వారు కూడా చదువుల్లో ముందుండటానికి ఏం చేయాలో ఆలోచించాలి.
ఈ కష్టకాలంలో పిల్లల్లో సహజంగానే భావోద్వేగాలు అధికంగా ఉంటాయి. తమ ఇంట్లోనో, తమ పొరుగునో సమస్యల్లో చిక్కుకున్నవారి గురించి విని భయాందోళనలతో వుంటారు. దానికి తోడు మునుపటిలా కదలికలుండవు గనుక ఒక రకమైన అసౌకర్యానికి గురవుతారు. తోటి పిల్లల్లో ఎవరికైనా అనారోగ్యం వస్తే ఇవన్నీ మరింతగా పెరుగుతాయి. కనుక సిలబస్ పూర్తి చేయాలన్న తొందరలో టీచర్లు ఒత్తిళ్లు తీసుకురాకూడదు. అసలు బోధనావిధానమే సంపూర్ణంగా మార్చు కోవాల్సి ఉంటుంది. బడులు తెరవడం అంటే వీటన్నిటి విషయంలో సర్వసన్నద్ధంగా వుండటం. చాలా రాష్ట్రాల్లో దశాబ్దాలుగా ప్రభుత్వాలు బడుల్ని నిరాదరిస్తూ వస్తున్నాయి. మెజారిటీ పాఠశాలల్లో మిగిలిన సదుపాయాల మాట అటుంచి సురక్షితమైన తాగునీరు లభ్యత కూడా లేదు.
ఈ కరోనా కష్టకాలంలో కూడా అవే పరిస్థితులు కొనసాగితే విద్యార్థులను ముప్పు బారిన పడేసినట్టే. ఇప్పుడే ర్పడిన ఈ అసాధారణ పరిస్థితులకు అనుగుణంగా పాత విధానాలన్నీ సవరించుకోవడం, ప్రభావ వంతంగా బోధించి పిల్లలు విద్యాపరంగా వెనకబడకుండా చూడటం, అవసరమైన సదుపాయాలు అందుబాటులో వుంచడం పాఠశాలల ముందున్న పెను సవాలు. ఆ సవాలును ఎదుర్కొనగలిగే సత్తా ఉన్నప్పుడే పిల్లల్ని రేపటి పౌరులుగా తీర్చిదిద్దడం సాధ్యం.
Comments
Please login to add a commentAdd a comment