
రాజస్తాన్‌లో నాలుగురోజులనాడు రాజుకున్న రాజకీయ సంక్షోభంలో మరో ఘట్టం ఆవిష్కృతమైంది. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలదోయడానికి కుట్ర జరిగిందని, అందులో కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ ప్రధాన పాత్ర పోషించారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ రెండు ఆడియో టేపులు విడుదల చేసింది. ఈ విషయంలో స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్(ఎస్‌ఓజీ) పోలీస్ విభాగం ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంతోపాటు ప్రస్తుతం హర్యానాలోని గుర్‌గావ్‌లో సచిన్ పైలట్ శిబిరంలో వున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే భన్వర్‌లాల్ శర్మను ప్రశ్నించడానికి శుక్రవారం అధికారులను పంపింది. అక్కడ రెండు రాష్ట్రాల పోలీసుల మధ్యా కాసేపు కొనసాగిన తమాషా దేశమంతా గమనించింది.
సరిగ్గా రాజస్తాన్ సంక్షోభం మొదలైన వెంటనే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆదాయం పన్ను విభాగం అధికారులు ఐటీ దాడులు నిర్వహిస్తే... ఇప్పుడు రాజస్తాన్ పోలీస్ విభాగం కూడా ఆ మాదిరి ‘కర్తవ్యాన్నే’ నిర్వర్తించడానికి హరియాణా తరలివెళ్లింది. పైలట్ వర్గీ యులు కొలువుదీరిన అయిదు నక్షత్రాల హోటల్‌కి వెళ్లబోయిన నలుగురు ఎస్‌ఓజీ అధికారులను అడ్డగించడానికి 200మంది హరియాణా పోలీసులు అక్కడ పహారా కాశారు. ఈ పరిణామాలన్నీ చూశాక సాధారణ పౌరులకు ప్రజాస్వామ్య వ్యవస్థల పనితీరుపై ఏవగింపు కలిగితే ఆశ్చర్యం లేదు. ఆడియో టేపులపై దర్యాప్తును ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తే భన్వర్‌లాల్ శర్మ, సంజయ్ లతోపాటు కేంద్రమంత్రి షెఖావత్‌ను కూడా అరెస్టు చేయాలన్నది కాంగ్రెస్ నేత రణదీప్ సుర్జేవాలా డిమాండు. అలాగని ఎస్‌ఓజీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో ఎవరి పేర్లూ లేవు. ‘కొందరు వ్యక్తుల’ ఫోన్ సంభాషణలుగానే అందులో ప్రస్తావించారు.
సంక్షోభం ముదిరి, ఆడియో టేపులు బయటి కొచ్చి ఇంత వివాదం రేగుతున్నా సచిన్ పైలట్ ఇంకా కాంగ్రెస్ నేతగానే వున్నారు. కాంగ్రెస్‌ను విడనాడలేదని ఆయన చెబుతున్నారు. ఇంతవరకూ పార్టీ ఆయన్నుగానీ, ఆయన అనుచరులను గానీ బహిష్కరించలేదు. కనుకనే మీ అంతర్గత కలహాలను చక్కదిద్దుకోలేక మాపై బురదజల్లుతారేమని బీజేపీ ప్రశ్నిస్తోంది. చూసేవారికి ఇది సహేతుకమన్న అభిప్రాయం కలుగుతుంది.
ఈ వివాదానికంతకూ మూలకారణం ఎక్కడుందో, ఏ పరిణామాలు దానికి దారితీశాయో అందరికీ తెలుసు. కాంగ్రెస్ తన ఇంటిని సకాలంలో చక్కదిద్దుకుంటే సమస్య ఇంతవరకూ వచ్చేది కాదన్నది వాస్తవం. ఆ వివాదాన్ని బీజేపీ చాకచక్యంగా ఉపయోగించుకుంటున్నదన్న అభిప్రాయం ఏర్పడటానికి కారణం పైలట్ వర్గం వెళ్లి ఆ రాష్ట్రంలో తలదాచుకోవడమే. ఇందులో తమకేమీ సంబంధం లేకపోతే హరియాణా ప్రభుత్వం అయిదు నక్షత్రాల హోటల్ ముందు అంత హడావుడి చేసేది కాదని అందరికీ తెలుసు. రాజస్తాన్‌లో విపక్షంగా వుంటున్న బీజేపీ ప్రభుత్వ పాలనలోని వైఫల్యాలపై ప్రశ్నిస్తే, వాటిపై ఉద్యమిస్తే అది ఆ పార్టీకి మేలు చేస్తుంది. పాలక పక్షంలోని అంతః కలహాలను సాకుగా తీసుకుని ఏం చేయడానికి ప్రయత్నించినా దాని ప్రతిష్టను మసకబారుస్తుంది.
ఇప్పుడు కాంగ్రెస్ వెల్లడించిన రెండు ఆడియో టేపులు అసలా, నకిలీయా అన్నది ఫోరెన్సిక్ నిపు ణులు ఎటూ తేలుస్తారు. సంక్షోభాలు తలెత్తినప్పుడు, బలాబలాల సమస్య ఎదురైనప్పుడు రాజ కీయాల్లో డబ్బు ప్రమేయం లేకుండా ఎవరికి వారు స్వచ్ఛందంగా గోడదూకుళ్లకు సిద్ధపడతారని ఇప్పుడెవరూ నమ్మే పరిస్థితి లేదు. రాజకీయ బేరసారాలకు సంబంధించిన టేపులు బయటపడటం కొత్తేమీ కాదు. జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) ఎంపీలు పార్టీ ఫిరాయించినప్పటినుంచి ఇలా సాక్ష్యాధారాలు అడపా దడపా బయటికొస్తూనే వున్నాయి. కానీ ఇంతవరకూ ఆ కేసుతోసహా ఏ కేసులోనూ నిందితులకు శిక్ష పడలేదు. ఎక్కడివరకో అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు 2015లో కీలకపాత్ర పోషించిన ‘ఓటుకు కోట్లు’ కేసుకు ఏ గతి పట్టిందో అందరికీ తెలుసు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వద్దకు లక్షల రూపాయల కరెన్సీ కట్టలు పట్టుకొచ్చిన రేవంత్ రెడ్డి అప్పట్లో బాబుకు అత్యంత సన్నిహితుడు.
ఫోన్‌లో చంద్రబాబు ఏమేం మాట్లాడారో చెప్పే సంభాషణల టేపుంది. రేవంత్ రెడ్డి స్వయంగా పట్టుకొచ్చిన నోట్లకట్టలు, ఆ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు వీడియోలో రికార్డయ్యాయి. అయినా ఆ కేసు ఇంకా ఎటూ తేలలేదు. ఇప్పుడు రాజస్తాన్ టేపులకు కూడా అదే గతి పట్టొచ్చు. ఈ తీరు మన చట్టబద్ధ పాలనను నవ్వులపాలు చేస్తుంది. కేసుల్లో ప్రముఖ నేతల ప్రమేయం వుంటే చట్టాలు కళ్లూ చెవులు మూసుకుంటాయన్న అభిప్రాయం స్థిరపడిపోతుంది.
రాజస్తాన్ సంక్షోభానికి ఎవరినో నిందించడానికి బదులు కాంగ్రెస్ ఆత్మ పరిశీలన చేసు కోవాల్సివుంది. ఆ పార్టీని చాకచక్యంగా నడపడంలో, పార్టీ శ్రేణులకు స్ఫూర్తినిచ్చి వారిని ముందుకు ఉరికించడంలో విఫలమైన అధినాయకత్వం కారణంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ పార్టీలో అంతర్గత కలహాలు ముదిరాయి. అధికారం వున్నచోట సహజంగానే అవి మరింత ఎక్కువగా వున్నాయి. వీటిని సకాలంలో గమనించి సరిచేయడంలో విఫలమైనందుకే రాజస్తాన్‌లో సచిన్ పైలట్ వర్గం తిరుగుబాటును ఎంచుకుంది. నాలుగు నెలలక్రితం మధ్యప్రదేశ్‌లో బీజేపీ పావులు కదిపిన పర్యవసానంగా అధికారాన్ని చేజార్చుకున్న కాంగ్రెస్, ఇప్పుడు రాజస్తాన్‌లో దాన్ని పునరావృతం కానీయరాదన్న పట్టుదలతో పనిచేస్తున్నట్టు కనబడుతోంది.
ఆ రాష్ట్రంలో ముఠా కలహాల నివారణకు సకాలంలో మేల్కొనని అధినాయకత్వం ఇప్పుడు మాత్రం అధికారాన్ని నిలుపుకోవడంపై సర్వ శక్తులూ ఒడ్డుతోంది. అన్ని రాష్ట్రాల్లాగే రాజస్తాన్‌లో కూడా కరోనా తీవ్రత ఎక్కువే వుంది. దాన్ని ఎదుర్కొనడానికి సర్వశక్తులూ ఒడ్డి పోరాడాల్సిన సమయంలో రాష్ట్రంలో రాజకీయ రగడ రేగడం ఆశ్చర్యకరం. ఒకరిపై ఒకరు పైచేయి సాధించడానికి కాంగ్రెస్, బీజేపీలు చేస్తున్న ప్రయత్నాలవల్ల వ్యవస్థల పరువు ప్రతిష్టలు దెబ్బతింటున్నాయి. ఇప్పుడు అందరికీ ఆందోళన కలిగిస్తున్నది ఇదే.