రసవత్తరంగా రాజస్తాన్‌ డ్రామా | Audio tapes of talks to topple Ashok Gehlot govt add to Rajasthan turmoil | Sakshi
Sakshi News home page

రసవత్తరంగా రాజస్తాన్‌ డ్రామా

Published Sat, Jul 18 2020 4:12 AM | Last Updated on Sat, Jul 18 2020 7:33 AM

Audio tapes of ‘talks to topple Ashok Gehlot govt add to Rajasthan turmoil - Sakshi

జైపూర్‌: రాజస్తాన్‌లో రాజకీయ డ్రామా రోజుకో మలుపుతో ఆసక్తికరంగా సాగుతోంది. గహ్లోత్‌ సర్కారుకు ముప్పు తొలగిన నేపథ్యంలో.. కాంగ్రెస్‌ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. తాజాగా, ప్రభుత్వాన్ని కూల్చే కుట్రకు సంబంధించినవిగా పేర్కొంటూ రెండు ఆడియో టేప్‌లను సాక్ష్యాలుగా చూపింది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన ఆ టేప్‌ల ఆధారంగా ఎమ్మెల్యేలను ప్రలోభపర్చి, ప్రభుత్వాన్ని కూల్చే కుట్రకు పాల్పడ్డారని ఆరోపిస్తూ బీజేపీ నేత, కేంద్రమంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్, తిరుగుబాటు వర్గ ఎమ్మెల్యే భన్వర్‌లాల్‌  శర్మ, వ్యాపారవేత్త సంజయ్‌ జైన్‌లపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. జైన్‌ను బీజేపీ నేతగా పేర్కొంది.

షెకావత్, భన్వర్‌లాల్, సంజయ్‌ జైన్‌లను తక్షణమే అరెస్ట్‌ చేయాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రణ్‌దీప్‌ సూర్జేవాలా డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ విప్‌ మహేశ్‌ జోషి చేసిన ఫిర్యాదు మేరకు.. స్పెషల్‌ ఆపరేషన్స్‌ గ్రూప్‌(ఎస్‌ఓజీ) వారిపై భారతీయ శిక్షాస్మృతి(ఐపీసీ)లోని దేశద్రోహం, కుట్రకు సంబంధించిన 124–ఏ, 120–బీ సెక్షన్ల కింద రెండు కేసులను నమోదు చేసింది. అయితే, ఎఫ్‌ఐఆర్‌లో కేంద్ర మంత్రి అనే ప్రస్తావన లేకుండా గజేంద్ర సింగ్‌ అని మాత్రమే పేర్కొంది. ప్రభుత్వాన్ని కూల్చే కుట్రకు పాల్పడ్డారన్న ఆరోపణలపై కేంద్ర మంత్రి షెకావత్‌ స్పందించారు. ఆ ఆడియో టేప్‌ల్లో వినిపించిన స్వరం తనది కాదని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఏ విచారణకైనా సిద్ధమని ప్రకటించారు.

మరోవైపు, తనతో పాటు తన వర్గం ఎమ్మెల్యేలు 18 మందిపై స్పీకర్‌ జారీ చేసిన అనర్హత నోటీసుల విషయంలో తిరుగుబాటు వర్గం నేత సచిన్‌ పైలట్‌కు కాస్త ఊరట లభించింది. ఆ నోటీసులను సవాలు చేస్తూ పైలట్, ఆయన వర్గం ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆ కేసు విచారణను శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని డివిజన్‌ బెంచ్‌ విచారించింది. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు ఆ అనర్హత నోటీసులపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని స్పీకర్‌ హైకోర్టుకు విన్నవించారు. మరోవైపు, తిరుగుబాటు ఎమ్మెల్యేలు భన్వర్‌లాల్‌ శర్మ, విశ్వేంద్ర సింగ్‌లను పార్టీ నుంచి కాంగ్రెస్‌ సస్పెండ్‌ చేసింది. వారికి షోకాజ్‌ నోటీసులను జారీ చేసింది.  

ఈ ఆడియో టేప్‌లే సాక్ష్యం
అశోక్‌ గహ్లోత్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నించిందనేందుకు కీలక ఆధారాలు లభించాయని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రణ్‌దీప్‌ సూర్జేవాలా ప్రకటించారు. కేంద్రమంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్, కాంగ్రెస్‌ తిరుగుబాటు ఎమ్మెల్యే భన్వర్‌లాల్‌ శర్మ, బీజేపీ నేత సంజయ్‌సింగ్‌లకు సంబంధించిన రెండు ఆడియో టేప్‌లను సాక్ష్యాలుగా చూపారు. ఆ టేప్‌ల్లోని సంభాషణ పూర్తి వివరాలను మీడియాకు చదివి వినిపించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కుట్రకు పాల్పడిన ఈ ముగ్గురిని అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.  ‘బీజేపీకి ఎమ్మెల్యేల జాబితా ఇవ్వాలి’ అని ఆ టేప్‌ల్లో పేర్కొనడంపై తిరుగుబాటు నేత సచిన్‌ పైలట్‌ వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.   

గహ్లోత్‌కు వసుంధర సాయం!
గహ్లోత్‌ ప్రభుత్వం కూలిపోకుండా బీజేపీ నాయకురాలు, మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే సాయం చేశారా? గహ్లోత్‌ను వీడి వెళ్లవద్దని ఎమ్మెల్యేలను ఆమె కోరారా?.. ఈ ప్రశ్నలకు అనూహ్యంగా అవుననే సమాధానమిస్తోంది బీజేపీ మిత్రపక్షం ఒకటి. సీఎం అశోక్‌ గహ్లోత్, వసుంధర రాజేల మధ్య అంతర్గత అవగాహన ఉందని రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్‌ పార్టీ చీఫ్, లోక్‌సభ సభ్యుడు హనుమాన్‌ బెణివాల్‌ ఆరోపించారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు స్వయంగా రాజేనే ఫోన్‌ చేసి గహ్లోత్‌కు మద్దతివ్వాలని కోరుతున్నారని బెణివాల్‌ పేర్కొన్నారు.

హైకోర్టులో పైలట్‌కు ఊరట
తిరుగుబాటు నేత సచిన్‌ పైలట్, ఆయన వర్గ ఎమ్మెల్యేలు 18 మందికి హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఎమ్మెల్యేలుగా వారి అనర్హతపై మంగళవారం సాయంత్రం వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోబోమని స్పీకర్‌ సీపీ జోషి శుక్రవారం హైకోర్టుకు తెలిపారు. పార్టీ విప్‌ను ధిక్కరించి, సీఎల్పీ భేటీకి గైర్హాజరు కావడంతో పాటు ప్రభుత్వాన్ని కూల్చే కుట్రకు పాల్పడిన ఆరోపణలపై శుక్రవారం లోగా వివరణ ఇవ్వాలని పైలట్‌ సహా 19 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్‌ జోషి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

ఆ నోటీసులను సవాలు చేస్తూ పైలట్‌ వర్గం హైకోర్టును ఆశ్రయించింది. ఆ కేసు విచారణను శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఇంద్రజిత్‌ మొహంతి, జస్టిస్‌ ప్రకాశ్‌ గుప్తాల ధర్మాసనం విచారించింది. ౖò అనర్హతకు సంబంధించి షోకాజ్‌ నోటీసులను జారీ చేసే అధికారం స్పీకర్‌కు ఉంటుందని, ఈ విషయంలో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోకూడదని సింఘ్వీ వాదించారు. అనర్హత నోటీసులపై మంగళవారం సాయంత్రం వరకు ఏ చర్య తీసుకోబోమని స్పీకర్‌ జోషి ధర్మాసనానికి తెలిపారు. అనంతరం కేసు విచారణ సోమవారం ఉదయానికి వాయిదా పడింది.

హరియాణాలో హై డ్రామా
ఆడియో టేప్‌ల వ్యవహారానికి సంబంధించి కాంగ్రెస్‌ చేసిన ఫిర్యాదు నేపథ్యంలో.. బహిష్కృత ఎమ్మెల్యే భన్వర్‌లాల్‌ శర్మను ప్రశ్నించడంతో పాటు, ఆయన  స్వర నమూనాలను సేకరించేందుకు హరియాణాలోని గురుగ్రామ్‌లోని మానెసర్‌లో ఉన్న ఒక హోటల్‌కు రాజస్తాన్‌  పోలీసులు శుక్రవారం సాయంత్రం వెళ్లారు. అయితే, వారిని లోపలికి వెళ్లకుండా, హరియాణా పోలీసులు  గంటపాటు అడ్డుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement