
‘ఉదారవాద పాశ్చాత్య ప్రపంచ ఆఖరి సంరక్షకురాలి’గా అందరి ప్రశంసలూ అందుకుంటున్న ఏంజెలా మెర్కెల్ ఆదివారం జరగబోయే జర్మనీ ఎన్నికల్లో ఆరు కోట్లమంది ఓటర్ల తీర్పు కోరబోతున్నారు. వరసగా నాలుగోసారి కూడా చాన్సలర్ పీఠం ఆమెదేనని వివిధ సర్వేలు ఇప్పటికే ప్రకటించడంతో ఒక్క జర్మనీ మాత్రమే కాదు, యావత్తు యూరప్ ఖండమే ఊపిరి పీల్చుకుంటోంది. ఆమె నేతృత్వంలోని క్రిస్టియన్ డెమొక్రటిక్ యూనియన్(సీడీయూ)కు 37 శాతం ఓట్లు లభిస్తాయని, మెర్కెల్ ప్రధాన ప్రత్యర్థి మార్టిన్ షుల్జ్‌కు చెందిన సోషల్ డెమొక్రాట్స్(ఎస్‌పీడీ)కి 20 శాతం ఓట్లు మించవని ఆ సర్వేలంటున్నాయి. ఈ రెండు పక్షాలూ 2013 నుంచి దేశాన్నేలుతున్న సంకీర్ణ కూటమిలో భాగస్వామ్య పక్షాలు కావడం విశేషం.
2005లో తొలిసారి అధికార పగ్గాలు స్వీకరించినప్పటినుంచి తిరుగులేని నాయకురాలిగా గుర్తింపు పొందుతూ వస్తున్న మెర్కెల్... రెండేళ్లక్రితం సిరియా, అఫ్ఘానిస్తాన్, ఇరా క్‌ల నుంచి వెల్లువెత్తిన వలసల తర్వాత బలహీనపడిన జాడలు కనబడ్డాయి. చెప్పా లంటే వలసలొక్కటే కాదు... జర్మనీతోపాటు వివిధ యూరప్ దేశాల్లో ఇటీవల పెరి గిన ఉగ్రవాద దాడులు కూడా ఆమె ఉదారవాద వ్యవహారశైలిని తప్పుబట్టేందుకు కారణమయ్యాయి. ఇతర దేశాలతో పోలిస్తే జర్మనీలో జరిగిన ఉగ్రవాద దాడుల సంఖ్య లేదా వాటిల్లో ప్రాణనష్టం చాలా స్వల్పం. అయినా సరే జర్మనీ ప్రజానీకాన్ని అవి ఆలోచనలో పడేశాయి. వీటికితోడు ఫ్రాన్స్‌లో ఆమధ్య బలంగా వీచిన తీవ్ర మితవాద, జాతీయవాద భావాలు కూడా జర్మనీని ప్రభావితం చేశాయి.
ఫ్రాన్స్ లోని బెర్లిన్‌లో ఉగ్రవాద దాడి జరిగినప్పుడు యూరప్‌కొచ్చిపడుతున్న వలసలకూ, ఈ దాడులకూ మధ్య సంబంధం ఉన్నదని స్వయంగా మెర్కెల్ చేసిన వ్యాఖ్య చివ రికి ఆమెనే చుట్టుకుంది. ఒకపక్క జర్మనీకి వలస వచ్చిన 10 లక్షలమంది పౌరులకు సాదర స్వాగతం పలికిన మెర్కెలే ఈ మాదిరి విశ్లేషణ చేయడం తీవ్ర మితవాద పక్షమైన ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ(ఏఎఫ్‌డీ) పార్టీకి అందివచ్చింది. యూరప్ యూని యన్(ఈయూ) నుంచి బయటకు రావాలన్న మితవాదులదే బ్రిటన్‌లో పైచేయి కావడం, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోట్రంప్ విజయం సాధించడంలాంటి ధోరణులు జర్మనీలోని తీవ్ర మితవాద పక్షాలకు మరింత ఊతమిచ్చాయి.
అయితే ఈ క్రమాన్నంతటినీ మెర్కెల్ జాగ్రత్తగా గమనిస్తూ తన ఆలోచనల్ని సవరించుకున్నారు. వలసలపై తన విధానాన్ని మార్చుకుని టర్కీతో వలస వ్యతిరేక ఒప్పందం కుదుర్చుకున్నారు. కఠినమైన వలస చట్టాలను తీసుకొచ్చారు. కీలకమైన విభాగాల్లో పనిచేసే మహిళా సిబ్బంది బుర్ఖాలు ధరించడాన్ని నిషేధిస్తూ పార్లమెంటులో చట్టం తెచ్చారు. చట్టవిరుద్ధమైన శరణార్ధుల్ని తిప్పి పంపే ప్రక్రి యను ప్రారంభించారు. నేర చరిత్ర ఉన్న 50మంది అఫ్ఘాన్ దేశస్తులను ప్రత్యేక విమానంలో కాబూల్‌కు తిప్పి పంపారు. భద్రతా విభాగాలకు ప్రాధాన్యం పెంచారు.
నిఘా సంస్థల అధికారాలను పెంచారు. రెండేళ్లక్రితం పారిస్ ఉగ్రవాద దాడి జరిగాక తమ దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన ఫ్రాన్స్ అప్పటి అధ్య క్షుడు హొలాండ్ స్థాయిలో తీవ్ర చర్యలు తీసుకోలేదుగానీ మెర్కెల్ విధించిన పరిమితులు కూడా తక్కువేం కాదు. తీవ్ర మితవాద పక్షాల ప్రచారానికి బెదిరి మెర్కెల్ అటువైపు అడుగులేస్తున్నారని వామపక్షాలు విమర్శించినా ఆమె ఎప్పటికప్పుడు సవరణలు చేసుకుంటూనే వచ్చారు. తాను గెలిస్తే స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత తీసుకొస్తానని ఎస్‌డీపీ నాయకుడు మార్టిన్ షుల్జ్ ప్రకటించిన మర్నాడే మెర్కెల్ సైతం అందుకు తానూ అనుకూలమేనంటూ ప్రకటన చేశారు.
జర్మనీకి ఉగ్రవాద బెడద ఒక్కటే కాదు... మరికొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. వార్షిక వృద్ధి రేటు సంతృప్తికరంగానే ఉన్నా సంపద స్వల్ప సంఖ్యలో ఉన్న సంపన్నుల వద్దే కేంద్రీకరణ అవుతున్నదన్న అభియోగం ఉంది. ధనిక–పేద అంతరాలు బాగా పెరిగాయి. దేశంలో ప్రజాస్వామిక వాతావరణం కుంచిం చుకుపోతున్నదన్న అభిప్రాయం ఉంది. అయితే నిరుద్యోగం కనిష్ట శాతానికి పడి పోవడం, ఉపాధి అవకాశాల్లోగానీ, మాంద్యాన్ని నియంత్రించడంలోగానీ యూరప్ లోని ఇతర దేశాలతో పోలిస్తే జర్మనీ మెరుగైన స్థితిలో ఉండటం మెర్కెల్‌కు బలమైన అనుకూలాంశాలయ్యాయి. 2005లో తొలిసారి ఆమె చాన్సలర్ అయి నప్పుడు సంకీర్ణ కూటమిలోని క్రిస్టియన్ సోషల్ యూనియన్(సీఎస్‌యూ)తో కలిసి సాధించిన ఓట్ల శాతం 35.2 అయితే 2009 ఎన్నికల్లో అది 40.9 శాతానికి చేరింది.
2013లో 45.3 శాతం సాధించి సోషల్ డెమొక్రటిక్ పార్టీతో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరిచారు. సమస్యలు చుట్టుముట్టినప్పుడు వాటినుంచి ఒడుపుగా బయటపడటమెలాగో మెర్కెల్‌కు తెలిసినంతగా ఆమె ప్రత్యర్థులకు తెలియదు. అయితే ఈ ఎన్నికలను మెర్కెల్ తేలిగ్గా తీసుకోలేదు. ప్రతి ఘట్టంలోనూ అప్రమత్తంగా ఉంటూ, లోటుపాట్లను సరిదిద్దుకున్నారు. అమెరికా ఎన్నికలను రష్యా హ్యాకర్లు ప్రభావితం చేసిన తీరును, ఓటర్ల మనోభావాలను మలిచిన తీరును నిపుణులతో చర్చించి అలాంటి పరిస్థితులు జర్మనీలో పునరావృతంకాకుండా తీసు కోవాల్సిన వ్యూహాలను రచించారు. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో నకిలీ వార్తలను చలామణి చేసే గ్రూపులను ఎప్పటికప్పుడు గమనించి ప్రతిదాడి చేసేం దుకు పార్టీ తరఫున ప్రత్యేక బృందాలు నియమించారు.
అదే సమయంలో ప్రజల్ని పక్కదోవ పట్టించే చట్టవిరుద్ధమైన అంశాలను ఫిర్యాదు వచ్చిన వెంటనే తొల గించని ఫేస్‌బుక్ వంటి సంస్థలకు భారీ జరిమానా వేసే విధంగా చట్టం తీసు కొచ్చారు. జర్మనీ ఓటర్లు ఎటూ ఒక పార్టీకే గుత్తగా అధికారం ఇవ్వరు. అయితే ఇప్పుడు మిత్రపక్షంగా ఉన్న ఎస్‌డీపీతోనే ఎన్నికల అనంతరం మెర్కెల్ కలిసి నడు స్తారా లేక కొత్త మిత్రుల్ని వెదుక్కుంటారా అన్నది ఆసక్తికరం. జర్మనీకి మాత్రమే కాదు... మొత్తం యూరప్‌కే నేతగా ఎదిగిన మెర్కెల్ ఈసారి విజేతయ్యాక జర్మన్‌గా కాక యూరపియన్‌గా ఆలోచించి నడుచుకోవాల్సి ఉంటుంది.