దిక్కులేనివారికి నీడనిచ్చి ఆదుకుంటున్నాయని భావించే శరణాలయాలు వారి పాలిట నరక కూపా లుగా మారాయని వెలువడుతున్న కథనాలు హృదయవిదారకంగా ఉంటున్నాయి. అమ్మానాన్నలు లేనివారు, దుర్భర దారిద్య్రంతో సతమతమవుతున్నవారు, ఒంటరిగా ఉంటే సంఘవిద్రోహ శక్తుల నుంచి ముప్పు ఉంటుందని భయపడేవారు...ఇలా అనేకమంది అభాగ్యులు ఆశ్రయం దక్కుతుందని శరణాలయాలకు వెళ్లి అక్కడున్న తోడేళ్ల బారిన పడుతున్నారని, కాళరాత్రులు చవిచూస్తున్నారని ఆ కథనాలు వెల్లడిస్తున్నాయి. గత నెలలో వెలుగులోకొచ్చిన ముజఫర్‌పూర్ శరణాలయం దుర్మార్గాలపై దర్యాప్తు ఇంకా ఒక కొలిక్కి రాకుండానే ఉత్తరప్రదేశ్‌లోని దేవరియా శరణాలయంలోనూ అలాంటి పరిస్థితులే ఉన్నాయని బయటికొచ్చింది.
ఈ దుర్మార్గాల తీరు గమనిస్తే అసలు దేశంలో ప్రభు త్వాలున్నాయా, అవి పనిచేస్తున్నాయా అన్న సందేహం కలుగుతుంది. ముంబైలోని టాటా ఇనిస్టి ట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్(టిస్) సంస్థ మొన్న ఫిబ్రవరిలో బిహార్ శరణాలయాలపై ఇచ్చిన సమగ్ర నివేదిక మహిళలు, బాలికలు, బాలురు అక్కడ అనునిత్యం ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు, వారిపై అడ్డూ ఆపూ లేకుండా సాగుతున్న అఘాయిత్యాల సంగతి బయటపెట్టింది. నిజానికి ఈ మాదిరి ఆడిట్ చేయమని టిస్‌ను కోరింది బిహార్ ప్రభుత్వమే. అందుకు ఆ ప్రభుత్వాన్ని అభి నందించాల్సిందే. కానీ అనంతర చర్యల్లో మాత్రం అక్కడి ప్రభుత్వ యంత్రాంగం చేష్టలుడిగి ఉండి పోయింది. ముజఫర్‌పూర్ శరణాలయంలో 7 నుంచి 18 ఏళ్ల వయసులోపు బాలికలపై అత్యాచారాలు జరిగాయని మార్చిలో జరిగిన దర్యాప్తు నిర్ధారించగా మే నెలలో ప్రధాన నిందితుడు బ్రజేష్ ఠాకూర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఆయనగారిని పోలీసులు మరో నెల్లాళ్లకుగానీ అరెస్టు చేయలేకపోయారు.
అసలు శరణాలయంలో ఉండాల్సిన 11మంది మహిళలు, నలుగురు పిల్లలు ఏమయ్యారని ఆరా తీయడానికే రెండు నెలలు పట్టింది. టిస్ నివేదిక ఈ ఒక్క శరణాలయం గురించి మాత్రమే మాట్లా డలేదు. ఆ రాష్ట్రంలోని 110 శరణాలయాల్లో కేవలం 7 మాత్రమే సంతృప్తికరంగా పనిచేస్తున్నాయని, మిగిలినవన్నీ అధ్వాన్నంగా అఘోరిస్తున్నాయని తెలిపింది. ముజఫర్‌పూర్‌లో బాలికలపై మాదక ద్రవ్యాలు ప్రయోగించటం, వారు అపస్మారక స్థితిలోకెళ్లాక అత్యాచారాలకు పాల్పడటం రివాజు అని అందులోనివారు చెబుతున్నారు. ఒక బాలిక ఈ అఘాయిత్యానికి కన్నుమూస్తే సంస్థ ఆవరణలోనే ఖననం చేశారట. ఈ స్వచ్ఛంద సంస్థలన్నిటికీ ఏటా క్రమం తప్పకుండా ప్రభుత్వ నిధులు ప్రవ హిస్తున్నాయి.
వాటికి నిర్వహణా సామర్ధ్యం ఉందో లేదో... మంజూరవుతున్న నిధుల్ని ఎలా ఖర్చు చేస్తున్నాయో... ఆ శరణాలయాల్లోని అభాగ్యుల స్థితిగతులెలా ఉన్నాయో తెలుసుకోవడం తమ బాధ్యతని ఆ ప్రాంత ఎమ్మెల్యే, మంత్రులు, అధికారులు అనుకోలేదు. సాక్షాత్తూ సాంఘిక సంక్షేమ మంత్రి మంజువర్మ భర్తే ముజఫర్‌పూర్ దురాగతాలకు బాధ్యుడని భావిస్తున్న ఠాకూర్‌తో తరచు మంతనాలు సాగించేవాడని వెల్లడైంది. ఈ కథ బయటకు రావడంతో ఆమె పదవి నుంచి తప్పు కున్నారు. కానీ ఆమె భర్తకూ, ఠాకూర్‌కూ మధ్య ఉన్న లావాదేవీలు బయటపడాల్సి ఉంది.
దేవరియా ఉదంతాన్ని ఓ పదేళ్ల చిన్నారి బయటపెట్టేవరకూ అక్కడి ప్రభుత్వ యంత్రాంగం నిద్రలో జోగుతోంది. ఆదివారం నిశిరాతిరి వేళ శరణాలయం నిర్వాహకురాలి కన్నుగప్పి తప్పించు కున్న బాలిక ఒంటరిగా పోలీస్‌స్టేషన్‌కొచ్చి అక్కడి ఘోరాలను పూసగుచ్చినట్టు చెప్పింది. ఆ బాలిక రాత్రి వేళ బయటికొచ్చే సాహసం చేయలేకపోయినా... దారిలో మరో రాక్షసుడి కంటబడినా ఇదంతా ఎప్పటికీ బయటికొచ్చేది కాదు. శరణాలయంలోని పిల్లలతో బండచాకిరీ చేయించడం, యుక్త వయ సొచ్చినవారిని సాయంత్రమయ్యేసరికి కార్లలో ఎటో తరలించడం అక్కడ నిత్యకృత్యమని, సాయం కాలం వెళ్లిన యువతులు పొద్దునే వచ్చి ఏడుస్తుంటారని తెలిపింది. తనకూ, తనతోపాటున్నవారికీ శరణాలయంలో నిత్యం ఎదురవుతున్న అన్యాయాలు పోలీస్‌స్టేషన్‌కెళ్లి చెబితే విరగడవుతాయని ఆ చిన్నారికి ఎందుకనిపించిందోగానీ ఆ చర్య నాగరిక సమాజంలో మర్యాదస్తుల ముసుగేసుకున్న స్వచ్ఛంద సంస్థ నిర్వాకాన్ని బజారుకీడ్చింది.
రాత్రికి రాత్రే శరణాలయానికెళ్లిన పోలీసులకు రిజిస్టర్ ప్రకారం ఉండాల్సిన 42మంది బాలికలు, యువతుల్లో 24మంది మాత్రమే లెక్క తేలారు. మిగిలిన 18మంది గురించి అడిగితే నిర్వాహకులు నీళ్లు నమిలారు. అందులో ఒక యువతి మాత్రం ఆ మరు నాడు వృద్ధుల శరణాలయంలో పోలీసులకు తారసపడింది. మారుమూల గ్రామాల్లో చీమ చిటుక్కు మంటే వేగుల నుంచి కబురందే ప్రభుత్వాలకు దేవరియా శరణాలయంలో ఏం జరుగుతున్నదో పదేళ్ల పసిపాప వచ్చి చెప్పేవరకూ తెలియలేదు! నడిరోడ్డుపై ఉన్మాద మూకలు గోరక్షణ పేరుతోనో, మరే ఇతర సాకుతోనో అమాయకులను కొట్టి చంపుతున్నా కదలికలేని ప్రభుత్వాలు నిర్భాగ్యులు కొలువు దీరే శరణాలయాలను పట్టించుకోవాలనుకోవటం అత్యాశే కావొచ్చు.
అత్యాచార ఉదంతాలు బయటికొచ్చినప్పుడల్లా ప్రభుత్వాలు ఎక్కడలేని చురుకుదనమూ ప్రద ర్శిస్తాయి. జమ్మూ–కశ్మీర్‌లోని కథువాలో ఎనిమిదేళ్ల బాలికపై దుండగులు అఘాయిత్యానికి పాల్పడి, ఆమె ఉసురు తీశాక దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి. ఆ తర్వాత పన్నెండేళ్లలోపు బాలికలపై అత్యాచారాలకు పాల్పడిన నేరగాళ్లకు ఉరిశిక్ష విధించాలని ప్రతిపాదిస్తూ కేంద్రం బిల్లు తెచ్చింది. శరణాలయాల్లో తనిఖీలు చేయాలంటూ రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. ఒక్క శరణాలయాలు మాత్రమే కాదు... ప్రభుత్వం నుంచి వెళ్లే ప్రతి పైసా ఏమవుతున్నదో, రకరకాల పేర్లు చెప్పుకుని ప్రభుత్వ నిధులు తీసుకుంటున్న సంస్థల తీరుతెన్నులెలా ఉంటున్నాయో నిరంతరాయంగా తనిఖీలు జరగాలి. ఆ తనిఖీలపై పటిష్టమైన పర్యవేక్షణ ఉండాలి. అది ప్రభుత్వాల బాధ్యత. ఎవరో చెబితే తప్ప ఏమీ తెలుసుకోలేని అశక్తతలో ప్రభుత్వాలు ఉన్నంతకాలం ఇలాంటి నేరాలూ, ఘోరాలు కొన సాగుతూనే ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment