చాన్నాళ్లకు కేంద్ర బడ్జెట్ పల్లెబాట పట్టింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంత ఓటర్ల ఆగ్రహాన్ని పసిగట్టడం వల్లకావొచ్చు... మరి కొన్ని నెలల్లో ప్రారంభం కాబోతున్న అసెంబ్లీ ఎన్నికల పరంపరను దృష్టిలో పెట్టుకుని కావొచ్చు... లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు జరిపే ఉద్దేశంతో కావొచ్చు–ఈ బడ్జెట్ పల్లెసీమలపైనా, వ్యవసాయంపైనా ప్రధానంగా దృష్టి పెట్టింది. అలాగే కీలకమైన ఆరోగ్య బీమా ప్రతిపాదన చేసింది. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ గురువారం పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెడుతూ వ్యవసాయ దిగుబడులకైన వ్యయంపై 50 శాతం అదనంగా లెక్కేసి ఇకపై కనీస మద్దతు ధరను నిర్ణయిస్తామని ప్రకటిం చారు. ఇప్పటికే రబీ దిగుబడులకు అమల్లో ఉన్న ఈ విధానం ఇకపై ఖరీఫ్‌కు కూడా వర్తింపజేస్తామన్నారు.
అలాగే రూ. 2,000 కోట్లతో అగ్రి మార్కెట్ మౌలిక సదుపాయాల నిధి ఏర్పాటు, పంట రుణాలను రూ. 10 లక్షల కోట్ల నుంచి రూ. 11 లక్షల కోట్లకు పెంచడం, కౌలు రైతులకు రుణ సదుపాయం వంటివి కూడా ఇందులో ఉన్నాయి. స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో వ్యవసాయం వాటా 14 శాతం. ఇప్పటికీ గ్రామసీమల్లో అత్యధికులకు ఉపాధి కల్పిస్తున్నది సాగురంగమే. ఆ రంగంపై దృష్టి సారించడం హర్షించదగిందే. అయితే పంటకయ్యే వ్యయాన్ని ఏ ప్రాతిపదికన లెక్కేస్తారన్నది కీలకం. అందులో ఎరువులకయ్యేదే చాలా ఎక్కువ. విత్తనాలు, పురుగుమందులు, నీటిపారుదల వ్యయం, కూలీల వేతనాలు, కౌలు వంటి ఇతర ఖర్చులుంటాయి. చాలా ప్రాంతాల్లో రైతులు భూగర్భ జలాలపై ఆధారపడాల్సి వస్తుంది.
సరైన విద్యుత్ సదుపాయం లేనిచోట మోటార్లకు డీజిల్ వినియోగం తప్పనిసరి. ఈ వ్యయాన్నంతటినీ పరిగణించి దిగుబడి ఖర్చును లెక్కేసినప్పుడే రైతుకు ప్రయోజనం ఉంటుంది. కనీస మద్దతు ధరకు ప్రభుత్వానికి పంటను అమ్మే రైతులు కేవలం 6 శాతం మాత్రమే. మిగిలినవారంతా దళారులకు తెగనమ్ముకోవాల్సి వస్తోంది. ఈ దళారీ వ్యవస్థను సమర్థవంతంగా అరికట్టినప్పుడే రైతులకు మేలు జరుగుతుంది. సాగు రంగ సంక్షోభంవల్ల ఏటా వేలాదిమంది రైతులు ప్రాణాలు తీసుకుంటున్నారు.
పది కోట్ల పేద కుటుంబాల ఆరోగ్యావసరాలను తీర్చగలదంటున్న జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకాన్ని (ఎన్‌హెచ్‌పీఎస్) కూడా ఈ బడ్జెట్‌లో ప్రకటించారు. వాస్తవానికి ఇది పాత పథకమే. పాత పథకం కింద కుటుంబానికి లక్ష రూపాయల వరకూ ఆరోగ్య బీమా కల్పిస్తే, ఆ పరిమితిని ఇప్పుడు రూ. 5 లక్షలకు పెంచారు. అయితే ఈ పథకం విధివిధానాలెలా ఉంటాయో చూడాల్సి ఉంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రూపకల్పన చేసి సమర్థవంతంగా అమలు చేసిన ఆరోగ్యశ్రీ పథకం నిరుపేద వర్గాలకు అత్యున్నత వైద్య సేవలను చేరువ చేసింది. తర్వాత కాలంలో ఆ పథకాన్ని వేరే రాష్ట్రాలు కూడా అనుసరించాయి. కేంద్ర పథకం ఆ స్థాయిలో ఉంటేనే పేద కుటుంబాలకు మేలు కలుగుతుంది.
ఈసారి బడ్జెట్‌లో ఆరోగ్యరంగానికి కేటాయించింది రూ. 52,800 కోట్లు. ఇది గత బడ్జెట్‌కన్నా రూ. 5,448 కోట్లు... అంటే 11.5 శాతం మాత్రమే ఎక్కువ. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య ఉపకేంద్రాలను పటిష్టం చేసి, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, చిన్న చిన్న వ్యాధులకిచ్చే ఔషధాలు అక్కడ లభ్యమయ్యేలా చూడాలన్న ఆలోచన మెచ్చదగ్గదే అయినా దీనికి కేటాయించిన మొత్తం రూ. 1,200 కోట్లు చాలా స్వల్పం. క్షయ వ్యాధిగ్రస్తులకు పోషకాహారం నిమిత్తం రూ. 600 కోట్లు కేటా యింపు మంచి నిర్ణయం. ఈ పథకంకింద చికిత్స చేయించుకుంటున్న సమ యంలో రోగికి నెలకు రూ. 500 ఇస్తారు. ఇది సక్రమంగా అమలయ్యేలా చూస్తే ఆ రోగులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. నిరుడు ప్రకటించిన జాతీయ ఆరోగ్య విధానం 2025నాటికి జీడీపీలో 2.5 శాతం వ్యయం చేయడం గురించి మాట్లా డింది. అంతేకాదు... పేదరికం విస్తరించడానికి గల ప్రధాన కారణాల్లో ఆరోగ్యానికి పెట్టే అపరిమిత ఖర్చు కూడా ఒకటని గుర్తించింది. మన దేశంలో 61 శాతం మరణాలకు కేన్సర్, మధుమేహం, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులే కారణం. ఇవి వ్యక్తులు, కుటుంబాలను మాత్రమే కాదు.. ఉత్పాదకతను కూడా దెబ్బతీస్తు న్నాయి. తాజా బడ్జెట్‌లో ప్రకటించిన ఎన్‌హెచ్‌పీఎస్‌కూ, ఇప్పటికే అమలవుతున్న కుటుంబసంక్షేమ పథకాల అమలుకూ, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల(ఎస్‌డీజీ)ను సాధించడానికీ ప్రస్తుత కేటాయింపులు ఏమాత్రం సరిపోవు.
బడ్జెట్ రాబోతుందనగానే కోట్లాదిమంది వేతన జీవులందరూ ఎదురుచూసేది ఆదాయం పన్ను మినహాయింపుల గురించే. కానీ అరుణ్ జైట్లీ వారి విషయంలో చాలా నిర్దయగా వ్యవహరించారని చెప్పాలి. చాన్నాళ్ల తర్వాత స్టాండర్డ్ డిడక్షన్ విధానం ప్రవేశపెట్టి దాన్ని రూ. 40,000గా నిర్ణయించినా ఇప్పుడున్న రవాణా, వైద్య చికిత్స వ్యయాలకిచ్చే రూ. 34,200 మినహాయింపును రద్దు చేశారు. పైగా ఆదాయంపన్నుపై చెల్లించే సెస్సు 3 శాతాన్ని 4 శాతానికి పెంచారు. ఏతావాతా ఉద్యోగులకు లభించేది అతి స్వల్పం. రూ. 250 కోట్ల టర్నోవర్ కంటే తక్కువ ఉన్న పరిశ్రమలకు 25 శాతం ఆదాయంపన్ను రాయితీ ఇవ్వడం హర్షదాయకం. అయితే షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ అమ్మితే వచ్చే లాభాలపై 10 శాతం పన్ను విధింపు ప్రతిపాదన మదుపుదార్లను నిరుత్సాహపరుస్తుంది.
అంతి మంగా అది కార్పొరేట్‌లపై ప్రభావాన్ని చూపుతుంది. ఉత్పాదకత పెంపుపై దృష్టి సారించి ద్రవ్యలోటు తగ్గించడానికి బదులు మన ప్రభుత్వాలు పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా దాన్ని సాధించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ బడ్జెట్‌లోనూ అది కనబడు తుంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాలకూ ఈ బడ్జెట్‌లో దక్కింది శూన్యం. ఆంధ్ర ప్రదేశ్‌కు వరసగా నాలుగోసారి విశాఖ రైల్వే జోన్ విషయంలో వాగ్దానభంగం జరిగింది. పోలవరం, కడప స్టీల్‌ప్లాంట్, దుగరాజపట్నం పోర్టు వగైరాల ప్రస్తావనే లేదు. అమరావతి ఊసే లేదు. ఇటు తెలంగాణ పరిస్థితి కూడా అందుకు భిన్నంగా లేదు. కాళేశ్వరం, మిషన్ భగీరథ, ఎయిమ్స్‌లకు చోటు దక్కలేదు. సారాంశంలో ఇది ఎవరినీ పూర్తిగా సంతృప్తిపరచలేని బడ్జెట్‌గా మిగిలిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment