ట్రంప్ ‘అఫ్ఘాన్’ భేరి
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మొత్తంగా దక్షిణాసియాపై, ప్రత్యేకించి అఫ్ఘానిస్తాన్‌పై అమెరికా కొత్త విధానాన్ని ప్రకటించారు. ఇది ఒబామా హయాం నుంచి అనుసరిస్తూ వస్తున్న విధానానికి మాత్రమే కాదు... ట్రంప్ తన ఎన్నికల ప్రచారసభల్లో హోరెత్తించిన వ్యాఖ్యలకు కూడా విరుద్ధమైనది. తాజా విధానం ప్రకారం అఫ్ఘానిస్తాన్‌లో ఇప్పటికే ఉన్న 8,500మంది అమెరికా సైనికులకు అద నంగా మరో 4,000మందిని పంపుతారు. అఫ్ఘాన్‌లోని అమెరికా సైనికులను దశల వారీగా తగ్గిస్తామని 2009లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామా చెప్పారు.
అందుకు సంబంధించి వేర్వేరు గడువులు ప్రకటిస్తూ పోయినా అరకొరగానే అది అమలైంది. ఇప్పటికీ అక్కడ 8,500మంది అమెరికా సైనికులున్నారు. అయితే వారంతా దాదాపుగా కీలకమైన గ్రీన్ జోన్‌కు కట్టుదిట్టమైన భద్రత కల్పించే పనికి, అఫ్ఘాన్ సైనికులకు శిక్షణనిచ్చేందుకు పరిమితమయ్యారు. అమెరికా నిఘా ద్రోన్‌లు, ఆయుధాలున్న ద్రోన్‌లు మాత్రమే ఇప్పుడక్కడ సంచరిస్తున్నాయి. రోజు వారీ ఆపరేషన్ల బాధ్యతను అఫ్ఘాన్ సైనికులకే వదిలిపెట్టారు. అఫ్ఘాన్‌కు సైన్యాన్ని పంపి వందల కోట్ల డాలర్లను వృథా చేస్తున్నారని తన అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ ఆరోపించేవారు.
ఈ యుద్ధం ఘోర తప్పిదమనేవారు. అధ్యక్షుడయ్యాక సైనికులందరినీ వెనక్కు పిలిపిస్తాననేవారు. అయినా ఈ విషయంలో ఇంతవరకూ మౌనంగానే ఉండిపోయారు. ఇన్ని నెలల తర్వాత హఠాత్తుగా ఆయన తన వైఖరిని మార్చుకున్నారు. ఉన్నట్టుండి అఫ్ఘాన్ నుంచి బయటికొస్తే ఆ దేశం మళ్లీ ఉగ్ర వాదుల చేతుల్లోకి పోతుందని ఒప్పించడంలో ట్రంప్ సలహాదారులు విజయం సాధించారని తాజా నిర్ణయం వల్ల అర్ధమవుతుంది.
అమెరికా దళాలు అఫ్ఘాన్ గడ్డపై ప్రవేశించి పదహారేళ్లు కావస్తోంది. దేశంలో అధ్యక్ష ఎన్నికలు నిర్వహించడం, పార్లమెంటుతోపాటు వివిధ సంస్థలు సజావుగా పనిచేయడం వంటివి తాము సాధించిన విజయంగా అమెరికా చెప్పుకుంటున్నా ఆచరణలో ఏం జరుగుతున్నదో ప్రపంచానికంతకూ తెలుసు. దేశం తాలిబన్ల చెప్పుచేతల్లోకి పోలేదన్న పేరేగానీ చాలా భూభాగంలో ఇప్పటికీ వారి ఆదేశాలే అమలవుతున్నాయి. కాబూల్ వంటిచోట్ల అడపా దడపా ఉగ్రదాడులు కొనసాగు తూనే ఉన్నాయి. అదనంగా సైనిక దళాలను పంపడం వల్ల ఇదంతా తలకిందులవు తుందని, అఫ్ఘాన్‌లో ఇకపై విజయ పరంపర తథ్యమని ఎవరూ అనుకోవడం లేదు. అఫ్ఘాన్ నుంచి అమెరికా ఇప్పట్లో బయటకు రాబోదని, ట్రంప్ అనంతరం వచ్చే అధ్యక్షులు సైతం దాని భారం మోయక తప్పదని ఆయన ప్రకటన చెబుతోంది. ఈ యుద్ధం గెలుస్తామని ఇప్పుడు ట్రంప్ నిశ్చయంగా చెబుతున్నారు.
అంతకుమించి ఇప్పుడు అనుసరిస్తున్న వ్యూహానికి మించి ఏం చేయబోతున్నారనేది చెప్పలేదు. ఈ తాజా ప్రకటనతో ఆయన ఇకపై కాబూల్‌లోనో, కాందహార్‌లోనో లేక మరొక చోటనో జరిగే ఘటనలకు ఒబామాను నిందించలేరు. అంతేకాదు... అమెరికాలో 2001 ఉగ్రవాదులు సృష్టించిన విధ్వంసం తర్వాత ‘ఉగ్రవాదంపై యుద్ధం’ పేరిట అమెరికా ప్రపంచవ్యాప్తంగా సాగిస్తున్న చర్యలన్నీ సబబేనని ఆయన ఒప్పుకోక తప్పదు. ఇంతవరకూ మాజీ అధ్యక్షులపై చేస్తూ వస్తున్న విమర్శలను ఇక విరమిం చుకోవాల్సి వస్తుంది.
అఫ్ఘాన్‌లో మన దేశం పాత్ర పెరగాలని, ఆ దేశం సాయం తమకు అవసరమని ట్రంప్ ఈ సందర్భంగా చెప్పారు. ఇంతక్రితం ఒబామా సైతం ఇలాంటి మాటలు చెప్పినా అది ఆచరణలోకి రాకుండా పాకిస్తాన్ చూడగలిగింది. అఫ్ఘాన్‌లో ఉగ్ర దాడులకు పాల్పడే తాలిబన్లకు, అల్ కాయిదాకు పాక్ ఐఎస్‌ఐ, సైన్యం అండ దండలున్నాయని ట్రంప్ అనడంతోపాటు భారత్ సాయం కోరడం పాక్ సైని కాధికారులను ఎంతవరకూ కలవరపరిచిందో చెప్పలేం. ఎందుకంటే గతంలో విదేశాంగమంత్రిగా ఉన్న హిల్లరీ క్లింటన్ కూడా ఇలాగే అనేవారు. తీరా సైనిక సాయం అందించే సమయానికల్లా ఏదో ఒక సాకు చెప్పి కొనసాగిస్తూ వచ్చే
వారు. పాకిస్తాన్‌పై ఎలాంటి ఆర్ధిక ఆంక్షలు విధించినా అది దివాలా దశకు చేరుకుంటుందని, ఆ పరిస్థితి ఉగ్రవాదానికి ఊతమిస్తుందని వారి భయం. నేరుగా పాక్ భూభాగం లోని ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు జరిపితే దాని పరి ణామాలెలా ఉంటాయోనన్న బెంగ సరేసరి. ఎందుకంటే ఆ గడ్డపై అణ్వస్త్రా లున్నాయి. ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు మొదలుపెడితే అది మరో అఫ్ఘాన్‌లా, మరో ఇరాక్‌లా అరాచకంగా, అస్థిరంగా మారదన్న గ్యారెంటీ లేదు. ఇలాంటి అంచనాలను దాటుకుని నిర్ణయాత్మకంగా వ్యవహరించడం ట్రంప్‌కు సాధ్యమవుతుందని ఎవరూ భావించలేరు. సీనియర్ బుష్‌తో మొదలుపెట్టి ఒబామా వరకూ ఈ బూచిని చూపే పాక్ సైనికాధికారులు అమెరికా తమ జోలికి రాకుండా చూసుకోగలిగారు. ఇప్పుడు సైతం అందుకు భిన్నంగా ఏమీ జరగక పోవచ్చు.
నిజానికి ట్రంప్ అఫ్ఘాన్‌పై ప్రకటించిన విధానానికి దారి తీసిన కారణం విచిత్రమైనది. అఫ్ఘాన్ మహిళలు మినీ స్కర్ట్‌లు ధరించిన నాలుగు దశాబ్దాలనాటి ఫొటోలను అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మెక్‌మాస్టర్ ట్రంప్‌కు చూపించి 70వ దశకం వరకూ అక్కడ పాశ్చాత్య ప్రభావం బలంగా ఉండేదని, గట్టిగా ప్రయత్నిస్తే అది మళ్లీ సాధ్యమేనని చెప్పాక ఆయన ఈ కొత్త విధానానికి సరేనన్నారని మీడియా కథనాలు చెబుతున్నాయి. ఇలాంటి కారణాలు ఆ దేశానికి అదనంగా సైన్యాన్ని పంపడానికి స్ఫూర్తినిచ్చాయంటే ఆశ్చర్యం కలుగుతుంది.
పైగా దేనిపైనా నిలకడగా మాట్లాడటం, నిర్ణయం తీసుకోవడం అలవాటులేని ట్రంప్ ఇప్పుడు ప్రకటించిన విధాన నిర్ణయానికి ఎంతకాలం కట్టుబడి ఉంటారో చెప్పలేం. అఫ్ఘాన్‌లో శాంతి స్థాపనే ధ్యేయం అనుకుంటే అందుకు భారత్ మాత్రమే కాదు... ఇరాన్, పాక్, చైనా, రష్యా, ఉజ్బెకిస్తాన్ తదితర దేశాల ప్రమేయం కూడా తప్పనిసరి. అలా కానట్టయితే ఎప్పటిలా అఫ్ఘానిస్తాన్‌లో వైఫల్యాలు తప్పవు. అన్ని అంశాలనూ, పర్యవసానాలనూ సమగ్రంగా పరిశీలించి, అమెరికా తాజా విధాన ప్రకటన విషయంలో మన దేశం ఆచి తూచి వ్యవహరించడమే ఉత్తమం.