బయటివారికి ఎప్పుడూ పెద్ద పజిల్‌లా, ఎంతో అనాసక్తిగా కనబడే అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ఈసారి చాలా ఆసక్తిగా...ఇంకా చెప్పాలంటే వినోద భరితంగా మారింది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తూ, ఆ క్రమంలో దేన్నయినా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడిన డోనాల్డ్ ట్రంప్ ఇందుకు చాలా వరకూ కారకుడు. అటు డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోరాడుతున్న బెర్నీ సాండర్స్ అసమానతలు, సంక్షేమం, కార్పొరేట్ అవినీతి లాంటి అంశాలను ప్రస్తావించడం అందరిలోనూ ఆసక్తిని పెంచింది. ఈ ప్రక్రియలో కీలకమైన మలుపు అనదగ్గ ‘సూపర్ ట్యూస్‌డే’ ఓటింగ్‌లో బెర్నీ సాండర్స్‌కు అందనంత దూరంలో హిల్లరీ క్లింటన్ దూసుకెళ్లి డెమొక్రటిక్ పార్టీని ఇప్పటికైతే ‘ఇబ్బందుల’నుంచి బయటపడేశారు. కానీ రిపబ్లికన్ పార్టీకి అంత ‘అదృష్టం’ లేదు. డోనాల్డ్ ట్రంప్ తన విజయపరంపరను కొనసాగించి ఆ పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. చివరాఖరికి తానే పార్టీ అభ్యర్థిని అవుతానని ఘంటాపథంగా ప్రకటించడంతో పాటు అమెరికాను ‘మళ్లీ గొప్ప దేశంగా చేస్తాన’ని ట్రంప్ హామీ ఇస్తున్నారు.
11 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే అటు హిల్లరీకి, ఇటు ట్రంప్‌కు కూడా ఏడేసిచోట్ల తిరుగులేని విజయాలు లభ్యమయ్యాయి. సౌత్ కరొలినాలో 90 శాతంమంది ఆఫ్రికన్ అమెరికన్ పౌరులు డెమొక్రటిక్ అభ్యర్థిత్వానికి సాండర్స్‌ను కాదని హిల్లరీని ఎన్నుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. రిపబ్లికన్ పార్టీలో ట్రంప్‌కు గట్టి ప్రత్యర్థులనుకున్న మార్కో రుబియో, టెడ్ క్రజ్, జాన్ కేసక్‌లు ‘సూపర్ ట్యూస్‌డే’లో వెల్లడైన ఫలితాలతో దిగ్భ్రమచెందారు. రెండు పార్టీల్లోనూ ప్రత్యర్థులు రాగల కాలంలో భారీ స్థాయిలో నెగ్గగలిగితే తప్ప హిల్లరీ, ట్రంప్‌లే అధ్యక్ష ఎన్నికల బరిలో మిగిలే అవకాశం ఉంది.
అమెరికా గడ్డపై ఊహించడం కూడా సాధ్యంకాని రెండు పరిణామాలు ఈ ఎన్నికల ప్రక్రియలో చోటుచేసుకున్నాయి. మెకార్తిజం రాజ్యమేలినచోట అధ్యక్ష ఎన్నికల్లో బెర్నీ సాండర్స్ సోషలిస్టు పరిభాష మాట్లాడటమే కాదు...హిల్లరీతో కూడా ఆ మాదిరి మాటలు మాట్లాడించగలిగారు. అటు డోనాల్డ్ ట్రంప్ అన్ని మర్యాదలనూ గాలికొదిలి ముస్లింలపైనా, వలసవచ్చినవారిపైనా విరుచుకు పడ్డారు. ఈ రెండు ధోరణులకూ ఇంతవరకూ అమెరికాలో చోటు లేదనడం అసత్య మవుతుంది. కానీ రెండు ప్రధాన పార్టీల్లో అధ్యక్ష పదవికి పోటీపడే అభ్యర్థులు అలాంటి ధోరణులను ప్రతిబింబించడమే వింతగా అనిపించే విషయం. ఈ రెండు ధోరణులూ పరస్పర విరుద్ధమైనవే అయినా వీటి మూలాలు ఒకటే.
అవి- అమెరికన్ సమాజంలో నానాటికీ పెరుగుతున్న అసమానతలు, వాటి పర్యవ సానంగా పౌరుల్లో ఏర్పడుతున్న అసహనం. అవే ఇలాంటి ధోరణులకు జీవం పోస్తున్నాయి. అగ్రరాజ్యంగా, ప్రపంచంపై పెత్తనం చలాయించే దేశంగా ఉన్నా సాధారణ పౌరులు అక్కడ భరోసాగా జీవించే పరిస్థితులు లేవు. ఉగ్రవాద భయం, ఏదైనా ధూర్త దేశం ఏ అణు క్షిపణో ప్రయోగిస్తుందన్న సందేహం లాంటివి అలా ఉంచితే... అవకాశాలు తగ్గుముఖం పడుతూ, నానాటికీ పెరుగుతున్న ఆదాయ వ్యత్యాసాలు భవిష్యత్తుపై వారిలో గుబులు పుట్టిస్తున్నాయి. ఇందుకు కారణాలను డోనాల్డ్ ట్రంప్ ముస్లింలలో, వలసల వరదలో వెదుకుతున్నారు. ఇలాంటి వాటిని సరిచేస్తే మళ్లీ అమెరికా కంటినిండా నిద్ర పోవచ్చునని, పౌరులంతా ప్రశాంతంగా బతకవచ్చునని హామీ ఇస్తున్నారు. అందుకు అవసరమైన పనులు తాను చేస్తానం టున్నారు. విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. ముస్లింలను దేశంనుంచి తరిమే స్తాననడం ఆయనకే చెల్లింది.
అందువల్లే రిపబ్లికన్ ఓటర్లు ఆయనలో ‘సమర్థుడైన నేత’ను చూస్తున్నారు. తమ దేశం మధ్య అమెరికాలో సాగించిన విధ్వంసం, ఇప్పటికీ వేర్వేరు దేశాల్లో సృష్టిస్తున్న సంక్షోభాల పర్యవసానంగానే వలసల సమస్య పుట్టుకొచ్చిందన్న సంగతిని ట్రంప్ దాస్తున్నారు. పైగా అలాంటి సంక్షోభాలను మరిన్ని తెచ్చిపెట్టే విధానాలను ఏకరువు పెడుతున్నారు. సాధారణ మర్యాదల్ని పక్కనబెట్టి ఎంత తోస్తే అంతా మాట్లాడటం, ఎవరినైనా హేళన చేయడంవంటి లక్షణాలవల్ల ఆయన ప్రసంగాలు వింతగా అనిపిస్తుండవచ్చు. జనాన్ని ఆకట్టు కోవచ్చు. కానీ ఆయనలో విదూషకుడికంటే విధ్వంసకుడే దాగున్నాడన్నది విశ్లేషకుల అంచనా.
బెర్నీ సాండర్స్ తీరు వేరు. దేశంలో సంపద కేంద్రీకరణను ప్రస్తావిస్తున్నారు. గుప్పెడుమంది వేల కోట్ల ఆస్తుల్ని చేజిక్కించుకుని దేశాన్ని శాసిస్తున్న తీరును ప్రశ్నిస్తున్నారు. దీన్నే కొనసాగిస్తే ఇప్పుడున్న పరిస్థితులు ఇంకెంత దుర్భరంగా మారుతాయో వివరిస్తున్నారు. అమెరికా సంపన్న దేశమే అయినా సాధారణ పౌరులకు అవకాశాలు క్రమేపీ కనుమరుగవుతుండటాన్నీ, మంచి వేతనాలు లేకపోవడాన్ని గుర్తుచేస్తున్నారు. సాండర్స్ చేసిన వాగ్దానాల్లో ఉచిత వైద్యం, ఉచిత ఉన్నత విద్య, బతకడానికి వీలైన కనీస వేతనం ముఖ్యమైనవి. బడా సంపన్నులపై అధిక పన్నుల్ని విధించడం ద్వారా వీటిని సాధించడం తేలికని లెక్కలు కట్టి చెబుతున్నారు. ఇవన్నీ సాధ్యంకావాలంటే రాజకీయాలపై కార్పొరేట్ ఆధిపత్యాన్ని తగ్గించాలని, వారిచ్చే రాజకీయ విరాళాలపై గట్టి నిఘా ఉండాలని అంటున్నారు. ఈ విషయంలో తన చిత్తశుద్ధిని చాటుకోవడం కోసం ఆయన కార్పొరేట్ సంస్థల విరాళాలను తిరస్కరించారు. సాధారణ పౌరులనుంచి ఆయనకు 3.30 కోట్ల డాలర్ల మేర విరాళాలు వచ్చాయంటే బెర్నీ సాండర్స్ ఏమేరకు ప్రభావం చూపగలిగారో అర్ధమవుతుంది. ‘సూపర్ ట్యూస్‌డే’లో హిల్లరీ ముందు ఆయన వెలవెలబోయినా సాండర్స్ లేవనెత్తిన అంశాల ప్రభావం ఆమెపై గట్టిగానే పడింది. ఉన్నత చదువు లకెళ్లే విద్యార్థులకు స్వల్ప వడ్డీ రుణాల గురించి, ఇతర సంక్షేమ పథకాల గురించి హిల్లరీ మాట్లాడక తప్పలేదు.
‘సూపర్ ట్యూస్‌డే’ ఫలితాలతో అంతా ముగిసిపోయినట్టు భావించడానికి లేదు. ఇందులో బాగా వెనకబడిన డెమొక్రటిక్ అభ్యర్థి బెర్నీ సాండర్స్ చేతిలో నాలుగు రాష్ట్రాల విజయాలున్నాయి. అవి హిల్లరీని కలవరపరిచేవే. అటు రిపబ్లికన్ పార్టీలో టెడ్ క్రజ్ టెక్సాస్‌లో సాధించిన భారీ గెలుపు... ఓక్లహామా, అలస్కాల్లో కైవసం చేసుకున్న విజయాలు ట్రంప్‌కు పూర్తి భరోసా కల్పించలేకపోతున్నాయి. ఇరు పక్షాల్లో చివరికి ఎవరు అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని చేజిక్కించుకున్నా ఈ ఎన్నికలు ఎజెండాలోకి తెచ్చిన అంశాలు రాగలకాలంలో సైతం సజీవంగా నిలుస్తాయి.
అమెరికా ఎన్నికల సందడి
Published Fri, Mar 4 2016 12:31 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement
Advertisement