రైతు మొర అరణ్యరోదనేనా?! | Farmers feel nervous of lossing agricultural products NDA govt | Sakshi
Sakshi News home page

రైతు మొర అరణ్యరోదనేనా?!

Published Fri, Jun 19 2015 1:43 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

Farmers feel nervous of lossing agricultural products NDA govt

రైతన్నకు ఆఖరి ఆశ కూడా అడుగంటింది. అధికారానికొచ్చి ఆర్నెల్లయ్యాక నిరుడు డిసెంబర్‌లో వ్యవసాయ ఉత్పత్తులకు ఎన్డీయే ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)లు చూసి నీరసించిన రైతులు కొత్త సర్కారు కదా... కూడదీసుకోవడానికి సమయం పడుతుందని సరిపెట్టుకున్నారు. ఓపిగ్గా ఉంటే అంతా మంచే జరుగుతుందనుకున్నారు. అలాంటివారంతా బుధవారంనాడు కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనతో దిగ్భ్రమచెందారు. ఈ సీజన్లో కామన్ గ్రేడ్ వరి ధాన్యం క్వింటాలు ధర రూ. 1,410 గా నిర్ణయించినట్టు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ తెలిపింది. ఇది నిరుడు ప్రకటించిన రూ. 1,360 కన్నా రూ. 50 ఎక్కువ. అంటే కిలోకు అదనంగా కేవలం 50 పైసలన్నమాట! గ్రేడ్- ఏ రకం ధాన్యం ధర కూడా రూ. 1,400 నుంచి రూ. 1,450కి పెరిగింది. ఇది కూడా కిలోకు 50 పైసలే. మొత్తానికి నిరుడున్న ధరలతో పోలిస్తే పెంపుదల 3.2 శాతం మాత్రమే! యూపీఏ సర్కారు తొలి దశలో ధాన్యం ఎంఎస్‌పీ రూ. 550 నుంచి రూ. 1,000 అయింది. ఈ పెంపుదల 83 శాతం. రెండో దశకొచ్చేసరికి ఆ సర్కారు కూడా మందకొడిగానే అడుగులేసింది. మలి అయిదు సంవత్సరాల్లో ధాన్యం ఎంఎస్‌పీ రూ. 1,000 నుంచి రూ. 1,310కి మాత్రమే చేరుకుంది. ఇది 31 శాతం. ఎన్డీయే సర్కారు వచ్చాక ఎంఎస్‌పీని ప్రకటించడం ఇది రెండోసారి కాగా మొత్తం పెంపుదల 7.5 శాతం మాత్రమే!
 
 ఎన్డీయే సర్కారుపై రైతులు ఆశ పెట్టుకోవడానికి కారణం ఉంది. ఆ పార్టీ ఎన్నికల ప్రణాళిక రైతుల కష్టాల గురించి ఏకరువు పెట్టింది. వారి కన్నీళ్లు తుడవడానికి సిద్ధమని చెప్పింది. వ్యవసాయ ఉత్పత్తులకయ్యే సగటు వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుని దానిపై 50 శాతం అదనంగా లెక్కేసి కనీస మద్దతు ధరలు నిర్ణయించాలన్న స్వామినాథన్ కమిటీ సిఫార్సును అమలు చేస్తామన్నది. తీరా అధికారంలోకొచ్చాక దాన్ని కాస్తా అటకెక్కించింది. అలాగని మోదీ ప్రభుత్వానికి రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు తెలియవనుకోవడానికి లేదు. ప్రకృతి వైపరీత్యాల్లో రైతులు పంట నష్టపోయిన సందర్భాల్లో ఇంతక్రితం 50 శాతం పంట నష్టపోతే తప్ప పరిహారం లభించేదికాదు. మూడోవంతు పంట నష్టపోయినా పరిహారం లభించేలా దాన్ని మార్చింది ఎన్డీయే సర్కారే. మరి ఎంఎస్‌పీ విషయానికొచ్చేసరికి ఎందుకు ముఖం చాటేస్తున్నట్టు? ప్రభుత్వం చెబుతున్న కారణాలు వింతగా ఉన్నాయి. ఎంఎస్‌పీ పెంచితే ఆ మేరకు మార్కెట్‌లో తిండిగింజల ధరలు కూడా పెరుగుతాయని, ఇది ద్రవ్యోల్బణానికి దారితీస్తుందని అంటున్నారు. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వడానికొచ్చేసరికి రకరకాల సాకులు చెబుతున్న పాలకులు సాగు వ్యయాన్ని నియంత్రించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడంలో మాత్రం తీవ్రంగా విఫలమవుతున్నారు.  
 
 దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. సాగు వ్యయానికి  అవసరమైన పెట్టుబడి బ్యాంకులనుంచి లభించడానికి సవాలక్ష నిబంధనలు అవరోధమవుతున్నాయి. బ్యాంకులిచ్చే రుణాల్లో 18 శాతం రైతాంగానికి ఇవ్వాలన్న రిజర్వ్‌బ్యాంక్ మార్గదర్శకాలను పాటించేవారుండరు. ఫలితంగా రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులనే ప్రధానంగా ఆశ్రయించవలసి వస్తున్నది. అందువల్లే రైతాంగం అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. తక్కువ భూమి ఉన్నవారికి బ్యాంకులనుంచి, ఇతర వ్యవస్థాగత సంస్థలనుంచి రుణాల లభ్యత 15 శాతం మాత్రమే ఉంటుండగా...మిగిలిన 85 శాతం రుణాలు ప్రైవేటు వ్యక్తులనుంచి పొందవలసివస్తున్నది.
 
 పాతిక ఎకరాలు పైబడి ఉన్న ఆసాములకు మాత్రం బ్యాంకులు సులభంగా రుణాలిస్తున్నాయి. పరిస్థితి ఇలా ఉన్నది కనుకనే సామాన్య రైతులకు పంట పండించాక కనీసం వడ్డీ కూడా గిట్టుబాటు కావడం లేదు. ఒక రైతు కుటుంబానికి ఏడాదికి రూ. 25,000-రూ. 40,000 మించి రాబడి ఉండటం లేదని జాతీయ నమూనా సర్వే సంస్థ(ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) నిరుడు ఇచ్చిన నివేదికలో వెల్లడించింది. అంటే నెలసరి ఆదాయం కనీసం రూ. 4,000 కూడా లేదన్నమాట! పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నాయి గనుకే రైతులు ఆత్మహత్యలే శరణ్యమనుకుంటున్నారు. గత  రెండు దశాబ్దాల్లో 3 లక్షల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారంటే ఈ సంక్షోభం ఏ స్థితికి చేరిందో అర్ధమవుతుంది. ఇందుకు భిన్నంగా నెదర్లాండ్స్ వంటి చిన్న దేశంలో కూడా రైతులకొచ్చే ఆదాయం మిగిలిన రంగాల్లోని వారికంటే ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఒక రైతు కుటుంబానికొచ్చే ఆదాయం జాతీయ సగటుతో పోలిస్తే 265 శాతం ఎక్కువ. చిత్రమేమంటే కేంద్రంలో అధికారంలోకొచ్చిన ఏ ప్రభుత్వమూ వ్యవసాయ సంక్షోభ నివారణకు చిత్తశుద్ధితో కృషి చేయలేదు. గత మూడు, నాలుగు దశాబ్దాల్లో దేశంలో వ్యవసాయ రంగంపై 53 నిపుణుల కమిటీలు ఏర్పడ్డాయి. అవన్నీ ఎప్పటికప్పుడు నివేదికలిచ్చాయి. కానీ, ఆచరణలో రైతన్నలకు కలిగిన మేలు శూన్యం.  తాజాగా ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్ ఏర్పాటయ్యాక వ్యవసాయంపై టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటుచేసింది. రాష్ట్రాలు కూడా ఈ తరహా టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పరిచి రైతులకొస్తున్న ఇబ్బందులేమిటో తెలుసుకోవాలని సూచించింది.
 
 వ్యవసాయ సంక్షోభాన్ని నివారించడమంటే సాగుకయ్యే వ్యయాన్ని తగ్గించగలగడం...పంటలకు గిట్టుబాటు ధరలు లభ్యమయ్యేలా చూడటం. రైతులకు సకాలంలో రుణాలు లభ్యమయ్యేలా చూడటం. ఆ విషయాలన్నిటా పాలకులు విఫలమవుతున్నారు. పెపైచ్చు ఎంఎస్‌పీని ప్రకటించడంలో పిసినారితనాన్ని చాటుకుంటున్నారు. వాస్తవానికి మన ప్రభుత్వం ప్రకటించే ఎంఎస్‌పీ ప్రపంచంలోని ఏ దేశంతో పోల్చినా దిగనాసిగానే ఉంటున్నాయి. ఈ స్థితి మారాలి. అన్నదాతకు జరిగే అన్యాయాన్ని తమదిగా భావించి ప్రతి ఒక్కరూ నిలదీయకపోతే జాతి భవిష్యత్తే ప్రమాదంలో పడుతుంది. ఆహార భద్రత ప్రశ్నార్థకమవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement