సంపాదకీయం: కేంద్ర నేరపరిశోధక సంస్థ (సీబీఐ)కి ఏ మోతాదులో స్వయంప్రతిపత్తి ఇవ్వవచ్చునో చర్చోపచర్చలు జరుగుతుంటే... ఆ విషయమై సర్వోన్నత న్యాయస్థానంలో కేంద్రానికీ, సీబీఐకి మధ్య వాదోపవాదాలు సాగుతుంటే... అసలు దాని ఉనికినే ప్రశ్నార్ధకం చేస్తూ గౌహతి హైకోర్టు గురువారం తీర్పునిచ్చింది. దాన్ని ఏర్పాటుచేస్తూ 1963లో కేంద్ర హోంశాఖ చేసిన తీర్మానానికి రాజ్యాంగబద్ధత లేదని, అది చెల్లుబాటుకాదని స్పష్టంచేసింది. దీనిపై రెండ్రోజుల్లో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని కేంద్రమంత్రులు చెబుతున్నారు. అంతకన్నా వారు చేయగలిగేదీ ఏమీలేదు. సీబీఐ రాజ్యాంగబద్ధతపై చాలాకాలంనుంచి చర్చ జరుగుతోంది. ఆ అంశం ప్రాతిపదికగా న్యాయస్థానాల్లో ఎవరైనా సవాల్ చేస్తే సంస్థకు నూకలు చెల్లినట్టేనని న్యాయ నిపుణులు చెబుతూనే ఉన్నారు. సీబీఐని తన స్వప్రయోజనాలకు గత దశాబ్దకాలంగా ఎడాపెడా వాడుకుంటున్న యూపీఏ ప్రభుత్వంగానీ, అంతకుముందున్న ప్రభుత్వాలుగానీ ఈ అంశంపై ఏనాడూ శ్రద్ధపెట్టలేదు. న్యాయనిపుణులు చెబుతున్న మాటల్లో ఎంతవరకూ వాస్తవమున్నదో, ఒకవేళ ఆ పరిస్థితి తలెత్తితే ఏమవుతుందోనన్న సందేహం వారికి రాలేదు.
అంతకు ముందు ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా తమకు బాధ్యత ఉన్నదని ఏ ప్రభుత్వమూ అనుకోలేదు. అసలు ఇందులో రాజ్యాంగబద్ధతకు మించి నైతిక విలువలు ఇమిడి ఉన్నాయి. చట్టబద్ధ పాలనను అందించాల్సిన ప్రభుత్వం తనకు తోచిన రీతిలో ఏమైనా చేయవచ్చునా అనేది కీలక ప్రశ్న. ఒక్క సీబీఐ అనే కాదు...చాలా విషయాల్లో ప్రభుత్వాలు రాజ్యాంగం ప్రకారం నడుచుకుందామని అనుకోవడంలేదు. ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరిలోనూ గుబులు రేకెత్తిస్తున్న ఆధార్ కార్డు వ్యవహారంలోనూ ప్రభుత్వం తీరు ఇలాగే ఉన్నది. దాదాపు రూ.72,000 కోట్లు ఖర్చయ్యే ఆ పథకానికి ఇంతవరకూ పార్లమెంటు ఆమోదమే లేదు.
సీబీఐ ఏర్పాటు వెనకున్న చరిత్ర గమనిస్తే గౌహతి హైకోర్టు ఇచ్చిన తీర్పులోని సహేతుకత తెలుస్తుంది. అత్యున్నత శ్రేణి దర్యాప్తు సంస్థగా అందరూ అనుకునే సీబీఐకి చట్టం దృష్టిలో ఆ పేరే లేదు. న్యాయస్థానాల లావాదేవీల్లో అది ఢిల్లీ ప్రత్యేక పోలీసు వ్యవస్థ మాత్రమే. దాన్ని న్యాయస్థానాలు అలాగే వ్యవహరిస్తాయి. వలసపాలకులు 1941లో ప్రత్యేక పోలీసు వ్యవస్థ (ఎస్‌పీఈ) పేరిట నెలకొల్పిన సంస్థను 1946లో ఢిల్లీ ప్రత్యేక పోలీసు వ్యవస్థ (డీఎస్‌పీఈ)లో విలీనం చేశారు. స్వాతంత్య్రం వచ్చిన పదహారేళ్ల తర్వాత అంటే... 1963లో డీఎస్‌పీఈ సంస్థకు సీబీఐగా నామకరణం చేసి దానికి మాదకద్రవ్యాల స్మగ్లింగ్, బ్యాంకు మోసాలు వగైరా నేరాల దర్యాప్తు బాధ్యతను అదనంగా చేర్చారు. ఇదంతా కేవలం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తీర్మానంతోనే పూర్తయింది. ఆ సమయంలోనే సీబీఐ ఏర్పాటు, దాని అధికారాలు, బాధ్యతలు, పరిధి, పరిమితులు వగైరా అంశాలతో అవసరమైన చట్టాన్ని రూపొందించివుంటే సమస్య ఉత్పన్నమయ్యేది కాదు. కానీ, అప్పటి ప్రభుత్వం ఆ పనిచేయలేదు. ఆ మార్గాన్ని ఎందుకు విడనాడిందో, తాత్కాలిక ఏర్పాటుకే ఎందుకు మొగ్గుచూపిందో అంచనా వేయడం సులభమే. అప్పటికే రాష్ట్రాలు తమ అధికారాల విషయంలో కేంద్రంతో పేచీ పడుతున్నాయి. ఆ దశలో సీబీఐకి చట్టబద్ధత కల్పించే అంశాన్ని తెరపైకి తెస్తే అందులోని లోతుపాతులపై పెద్దయెత్తున చర్చ జరిగే అవకాశం ఉంటుంది. శాంతిభద్రతల వ్యవహారం తమ పరిధిలోనిది గనుక సీబీఐకిచ్చే అధికారాలు దాన్ని అతిక్రమించినట్టు కనిపిస్తే రాష్ట్రాలు ఊరుకోవు. అంతేకాదు... ఆ సంస్థకు ప్రత్యేక చట్టంలాంటిది ఉంటే దానిపై అప్పటి వరకూ సాగిస్తున్న అజ్మాయిషీ కోల్పోవలసి వస్తుందన్న సంశయం కూడా ఉండొచ్చు. వీటన్నిటినీ తప్పించుకోవాలంటే చేయదల్చుకున్న పనిని గప్‌చిప్‌గా చేస్తే మంచిదని అప్పటి ప్రభుత్వం భావించింది. పుట్టుకలో ఉన్న ఈ బలహీనతే ఇన్ని దశాబ్దాల్లోనూ సీబీఐ పనితీరుపై ప్రతిఫలిస్తూ వస్తోంది.
దీన్ని పసిగట్టడంవల్లే వేర్వేరు సందర్భాల్లో వివిధ సంఘాలు సీబీఐకి సంబంధించి ప్రత్యేక చట్టాన్ని రూపొందించమని కేంద్రాన్ని కోరుతూనే ఉన్నాయి. పార్లమెంటరీ స్థాయీ సంఘాలు 2005 తర్వాత కనీసం మూడు సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం తీరును తప్పుబట్టాయి. సీబీఐ పనితీరు పారదర్శకంగా, సమర్ధవంతంగా ఉండేందుకు వీలుగా దానికి ప్రత్యేక చట్టం రూపొందించాలని తాము పలుమార్లు చేసిన సూచనను పట్టించుకోలేదని, దీనిపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఈ సంఘాలు ప్రతిసారీ చెప్పాయి. 2007లో పాలనా సంస్కరణల సంఘం కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించింది. ఒక కొత్తచట్టం అవసరమని సూచించింది. అయినా ఆ దిశగా చర్యలు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకురాలేదు. ప్రస్తుత కేంద్ర మంత్రి మనీష్ తివారీ పార్లమెంటు సభ్యుడిగా 2010లో సీబీఐకి చట్టప్రతిపత్తి కల్పించడంపై ప్రైవేటు సభ్యుడి బిల్లును ప్రతిపాదించారు.
సీబీఐ చట్టబద్ధమైన సంస్థ కాదు గనుక ఎప్పుడైనా సమస్యలు ఏర్పడవచ్చని అప్పట్లో ఆయన చెప్పారు. కానీ, కేంద్రం దాన్ని అంగీకరించలేదు. చివరకు ఆ బిల్లును ఆయన ఉపసంహరించుకు న్నారు. ఇప్పుడు అదనపు సొలిసిటర్ జనరల్ మల్హోత్రా వివిధ తీర్పుల ద్వారా సర్వోన్నత న్యాయ స్థానం సీబీఐ చట్టబద్ధతను గతంలో గుర్తించిందని అంటున్నారు. అయితే, ఆ కేసులు మౌలికంగా లేవనెత్తిన అంశాలు వేరు. వాటిల్లో సీబీఐ చట్ట బద్ధతను నేరుగా ప్రశ్నించలేదు. అందువల్ల సుప్రీంకోర్టు ఆ అంశంలోని లోతు పాతుల్లోకి పోలేదు. మొత్తానికి ఇన్ని దశాబ్దాల నుంచి ప్రభుత్వాలు అనుసరించిన సాచివేత ధోరణివల్ల సీబీఐకి ఇప్పుడు ప్రాణాంతక సమస్య వచ్చిపడింది. గౌహతి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం వెలువరిస్తుందన్న అంశాన్ని పక్కనబెడితే సీబీఐలాంటి సంస్థకు చట్టబద్ధత ఇవ్వవలసిన అవసరాన్ని, అలా చేయడంలో తనకున్న నైతిక బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తెలుసుకోవాలి. ఆ సంస్థను దుర్వినియోగం చేయడంలో ఉన్న ఉత్సాహమూ, శ్రద్ధా కర్తవ్య నిర్వహణలో లేకపోవడంవల్లే ఈ పరిస్థితి తలెత్తిందని గుర్తించాలి.
సీబీఐకి ప్రాణాంతక సమస్య!
Published Sat, Nov 9 2013 3:16 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
Advertisement
Advertisement