పత్తాలేకుండా పలాయనం చిత్తగించాయనుకుంటున్న రోగాలు కొన్నాళ్లాగి రెట్టింపు శక్తితో దాడి చేస్తుంటే... ప్రాణాంతకమైన వ్యాధులనుకున్నవి తగ్గుముఖం పడుతున్నాయి.
పత్తాలేకుండా పలాయనం చిత్తగించాయనుకుంటున్న రోగాలు కొన్నాళ్లాగి రెట్టింపు శక్తితో దాడి చేస్తుంటే... ప్రాణాంతకమైన వ్యాధులనుకున్నవి తగ్గుముఖం పడుతున్నాయి. ఈ రెండు ధోరణులూ ఏకకాలంలో కనబడుతున్నాయని ఈ మధ్య వెలువడిన కథనాలు చెబుతున్నాయి. నిరంతర అప్రమత్తత, సత్వరం స్పందించే గుణమూ ఉన్నప్పుడు ఎలాంటి వ్యాధిపైన అయినా పోరాటం చేయడం, రూపు మాపడం సులభమే. అదే సమయంలో నిర్లక్ష్యం ఏర్పడితే, తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమైతే పరిస్థితి విషమించడం ఖాయం. ఒకప్పుడు ప్రపంచాన్ని గడగడ వణికించిన ఎయిడ్స్ వ్యాధి మన దేశంలో తగ్గుముఖం పడుతున్నదని వెలువడిన వార్తలు ఉపశమనం కలిగిస్తాయి. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని యూఎన్ ఎయిడ్స్ ఇటీవల విడుదల చేసిన నివేదిక భారత్‌లో హెచ్‌ఐవీ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిందని ప్రకటించింది.
2001-13 మధ్య ఈ తగ్గుదల 57 శాతంగా ఉన్నదని తేల్చింది. ఇదేకాలంలో ప్రపంచవ్యాప్తంగా హెచ్‌ఐవీ వ్యాప్తి రేటు 25 శాతం తగ్గింది. మనదేశం గొప్పతనం ఏమంటే 2001-09 మధ్య హెచ్‌ఐవీ కేసుల తగ్గుదల 50 శాతంగా ఉంటే అదిప్పుడు 57 శాతానికి చేరుకున్నది. కానీ, ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి వ్యాప్తి రేటు యథాతథంగా ఉంది. దేశంలో ఎయిడ్స్ వ్యాధి జాడ మొదటిసారి 1981లో కనబడింది. ఆ కేసుతో మొదలై అది అలా అలా పెరుగుతూ పోయింది. దీని వేగాన్ని నియంత్రించగలగడం బహుముఖాలుగా చేసిన పోరాటం ఫలితం. దేశంలో ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమాల కోసం కేంద్ర ప్రభుత్వం ఏటా రూ.1,785 కోట్లు ఖర్చు చేస్తోంది. వ్యాధిగ్రస్తుల వివరాల సేకరణ, వారికి సకాలంలో వైద్యసాయం అందించడం, వారి భాగస్వాములకు వ్యాధి సోకకుండా ఔషధాలను అందించడం వల్ల హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్తుల సంఖ్య తగ్గిందని యూఎన్ ఎయిడ్స్ నివేదిక ప్రశంసించింది.
అయితే, ఈ ప్రశంసల మాటెలా ఉన్నా వ్యాధి నియంత్రణకు మరింతగా అప్రమత్తం కావాల్సిన అవసరం ఉన్నదని కొన్ని ఉదంతాలు చెబుతున్నాయి. ఉదాహరణకు మన ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమానికి రూ.1165 కోట్ల మేర అంతర్జాతీయ సాయం అందుబాటులోకి వచ్చినప్పుడు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఏణ్ణర్ధంపాటు ఉలుకూ పలుకూ లేకుండా కూర్చుంది.
ఫలితంగా 10 లక్షల మంది హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్తులకు అవసరమైన ఔషధాలు, టెస్టింగ్ కిట్లు అయిదు నెలలపాటు అందుబాటులోకి రాకుండాపోయాయి. సర్కారీ బ్లడ్ బ్యాంకుల్లో హెచ్‌ఐవీ, హెపటైటిస్-బీ, హెపటైటిస్-సీ కిట్లు లేకపోవడం వల్ల హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్తులకు, ఇతరులకు సురక్షితమైన రక్తాన్ని అందించడం సాధ్యం కావడం లేదు. ప్రపంచవ్యాప్తంగా 74 లక్షల మంది హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్తులుంటే అందులో మూడో వంతు మంది మన దేశంలోనే ఉన్నారు. తీసుకుంటున్న చర్యలు సమర్ధవంతంగానే ఉంటున్నా ఇలాంటి లోపాలు మొత్తం కార్యక్రమాన్నే దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది. ఆరోగ్యమంత్రిత్వశాఖ నిర్ణయం తీసుకోవడంలో చేసిన జాప్యం వల్ల లక్షల మంది ఔషధాలకు దూరంకావడంపై సాయానికి ముందుకొచ్చిన సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. హెచ్‌ఐవీ కేసుల తగ్గుదలను 57 శాతానికి తీసుకురావడం గొప్ప విషయమేగానీ మన ఇరుగుపొరుగుతో పోలిస్తే మనం వెనకబడి ఉన్నట్టే లెక్క. మయన్మార్ 72, నేపాల్ 87, థాయ్‌లాండ్ 63 శాతం చొప్పున తగ్గించి ఆసియాలో మనను మించిపోయి ఉన్నాయి. వాటితో పోల్చుకుంటే మనం సాధించవలసింది ఎంతో ఉండగా తాజాగా బయటపడిన లోపాల వంటివి హెచ్‌ఐవీ వంటి మహమ్మారితో చేసే పోరాటంలో తీవ్ర ప్రభావం చూపుతాయి.
ఈ మధ్యే వె లువడిన మరో నివేదిక వ్యాధులపై జరిపే పోరాటంలో ఎంత అప్రమత్తత అవసరమో గుర్తుచేస్తున్నది. అంటువ్యాధులు సోకినవారు ఉపయోగించే ఔషధాలు వ్యాధికారక సూక్ష్మక్రిముల నిర్మూలనలో విఫలమవుతున్నాయని ఆ నివేదిక చెబుతోంది. వ్యాధిగ్రస్తులు ఉపయోగించడానికి కొత్త ఔషధాలను కనిపెట్టకపోతే పరిస్థితి విషమించడం ఖాయమని హెచ్చరిస్తోంది. వాస్తవానికి 1987 తర్వాత బ్యాక్టీరియాపై పోరాడటానికి అవసరమైన కొత్త తరహా ఔషధాలను కనుగొనలేదు. పాత ఔషధాలను అవసరం లేకుండా లేదా అవసరానికి మించి ఉపయోగించిన పాపమే మనల్ని ఈ స్థితికి చేర్చిందని నిపుణులు చెబుతున్నారు. ఔషధాలకు లొంగని వ్యాధులు వర్ధమాన దేశాల్లో లక్షల మంది ప్రజలను బలిగొంటున్నాయి. మన దేశంలో ఏటా 50 లక్షల మంది డయేరియా, న్యూమోనియా, టైఫాయిడ్, డెంగ్యూ వంటి అంటువ్యాధుల బారినపడుతున్నారు. ముఖ్యంగా క్షయ వ్యాధి నివారణలో మనం తీవ్రంగా విఫలమవుతున్నామన్న సమాచారం ఆందోళన కలిగిస్తున్నది. ఈ వ్యాధి నివారణపై అవసరమైనంతగా దృష్టి పెట్టకపోవడం వల్ల వ్యాప్తి శాతం నానాటికీ ఎక్కువవుతున్నదని నివేదిక అంటోంది. దేశ జనాభాలో అధిక శాతం మంది శరీరాల్లో క్షయ కారక క్రిములు నిద్రాణ స్థితిలో ఉంటాయని, వ్యాధి నిరోధక శక్తి తగ్గిన వెంటనే ఇవి విజృంభిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
వ్యాధి సోకినట్టు తెలిశాక కూడా పూర్తిగా తగ్గేవరకూ వాడేవారు 35 శాతం మించడం లేదు. ఫలితంగా క్షయ కారక క్రిములు ఏ ఔషధానికీ లొంగని స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ వ్యాధి తీవ్రతను ప్రపంచ ఆరోగ్య సంస్థ 1993లోనే గుర్తించింది. అందుకు సంబంధించి అత్యయిక స్థితిగా ప్రకటించింది. కానీ, హెచ్‌ఐవీ విషయంలో పోరాడుతున్నంత తీవ్రంగా క్షయ వ్యాధిపై పోరాటం సాగటం లేదు. పేదరికంలో మగ్గుతున్న లక్షల మంది వ్యాధి ఉన్నదని తెలిసినా స్తోమతలేక ఔషధాలను వినియోగించడం లేదు. మన శక్తినంతా కేంద్రీకరించి పోరాడితే ఏ వ్యాధినైనా ఏ స్థాయిలో నియంత్రించవచ్చునో హెచ్‌ఐవీ అనుభవం చెబుతుంటే... నిర్లక్ష్యం ఎలా ప్రాణాంతకమవుతుందో ఇతర అంటువ్యాధులు హెచ్చరిస్తున్నాయి. అప్రమత్తులం కావలసిన బాధ్యత మనదేనని చాటి చెబుతున్నాయి.