సంపాదకీయం
మనుషుల్లో కలిమిలేముల భేదమున్నట్టే దేశాలమధ్య కూడా స్థాయీ భేదం ఉంటుంది. తనకొక నీతి, పరులకొక రీతి అమలు చేసే అమెరికా... ఈ స్థాయీ భేదాలను పద్ధతిగా పాటిస్తూ వస్తోంది. తాజాగా న్యూయార్క్‌లో భారత దౌత్యవేత్తగా పనిచేస్తున్న దేవయాని ఖోబ్రగడేను అరెస్టు చేసిన తీరు దీన్నే మరోసారి రుజువుచేసింది. ఇద్దరు పిల్లల తల్లి అయిన ఆ యువ అధికారిణిని అరెస్టుచేసి సంకెళ్లువేసి తీసుకెళ్లిన ఘటన అమెరికా మొరటుతనాన్ని బయట పెట్టింది. ఏడాది కాలంపైగా న్యూయార్క్‌లోని భారత కాన్సుల్ జనరల్ కార్యాలయంలో పనిచేస్తున్న దేవయాని ఐఎఫ్‌ఎస్ అధికారిణి.
తన వద్ద సహాయకురాలిగా పనిచేస్తున్న యువతికి సంబంధించిన వీసా దరఖాస్తులో ఆమె అబద్ధం చెప్పారని, అలాగే ఆ యువతికి చట్ట ప్రకారం ఇవ్వాల్సిన వేతనంకంటే చాలా తక్కువ చెల్లించారని దేవయానిపై ఆరోపణలు. అయితే, దేవయాని తరఫున ఆమె తండ్రి వేరే రకంగా చెబుతున్నారు. సహాయకురాలిగా వెళ్లిన యువతి మొన్నటి జూన్‌లో మాయమైందని, అప్పటినుంచీ బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్నదని ఆయన ఆరోపిస్తున్నారు. పైగా, ఆమె విషయంలో తాము ఢిల్లీ హైకోర్టులో ఇప్పటికే కేసు దాఖలుచేసి ఉన్నామంటున్నారు. ఈ కేసుకు సంబంధించి అమెరికాలోగానీ, మరెక్కడాగానీ వ్యాజ్యం తీసుకురావడానికి వీల్లేదంటూ ఢిల్లీ హైకోర్టు ఇంజంక్షన్ ఇచ్చిందని ఆయన తెలిపారు. ఇందులో ఎవరి వాదన సరైందో, లోపం ఎక్కడున్నదో ఇంకా తేలవలసి ఉన్నది. ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు చట్టప్రకారం ఎలా వ్యవహరించాలో అలాగే చేశామని అమెరికా చెబుతోంది. అలా చేయడంలో ఎలాంటి ఉల్లంఘనలకూ పాల్పడలేదంటోంది.
దేవయాని చేసిందేమిటి...అందులోని తప్పొప్పులేమిటనే విషయంలోకి ఇప్పుడెవరూ వెళ్లడంలేదు. దేవయాని తండ్రి చెబుతున్నట్టు ఆమె సహాయకురాలు బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్నదా, లేదా అనేది కూడా ఇక్కడ అప్రస్తుతం. కానీ, దౌత్యవేత్తగా పనిచేస్తున్న అధికారుల విషయంలో అంతర్జాతీయ నియమాలు, ఒప్పందాలు ఏమి చెబుతున్నాయో తెలుసుకుని అందుకు అనుగుణంగా వ్యవహరించాల్సిన బాధ్యత అమెరికాకు ఉంది. ఆ బాధ్యతను అది సక్రమంగా నిర్వర్తించలేకపోయిందని జరిగిన ఘటననుబట్టే అర్ధమవుతున్నది. భర్త ఏదో పనిపై దూరప్రాంతానికి వెళ్లిన సమయంలో తన పిల్లలను పాఠశాలకు దిగబెట్టడానికి వెళ్లిన మహిళను ఉన్నట్టుండి అరెస్టు చేయాల్సిన అగత్యం ఏం వచ్చిందో అమెరికా అధికారులు చెప్పాలి. ఆమె డిప్యూటీ కాన్సుల్ జనరల్‌గా పనిచేస్తున్న వ్యక్తి. ఆరోపణలొచ్చాయని తెలిసిన వెంటనే మూడో కంటికి తెలియకుండా దేశం విడిచి పారిపోయే స్థితిలో ఆమె లేరు. దేవయానిపై వచ్చిన ఆరోపణలగురించి ముందు ఆమెకు తెలియాలి. అలాగే, వాటిని వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయం దృష్టికి, మన విదేశాంగ శాఖ దృష్టికి తీసుకెళ్లాలి. ముందస్తు సమాచారం ఇచ్చినంతమాత్రాన కొంప మునిగేదేమీ లేదు. అలా చేసివుంటే చట్టపరంగా తనవైపుగా తీసుకోవాల్సిన చర్యలేమిటో ఆమె నిర్ణయించు కునేవారు. ముందస్తు బెయిల్‌గానీ, మరోటిగానీ తెచ్చుకునేవారు. భారత్‌లోని కోర్టుల్లో తాము దాఖలుచేసిన పిటిషన్లపైనా, వాటిపై వచ్చిన ఆదేశాలపైనా వారికి వివరించి ఉండేవారు. ఇప్పుడు అమెరికా అధికారులు ఇంత హడావుడి చేశాక ఆమెకు మాన్‌హట్టన్ కోర్టు బెయిల్ మంజూరుచేసింది. దేశం విడిచి వెళ్లొద్దని ఆదేశించింది.
ఆమెను అరెస్టుచేయకుండానే, సంకెళ్లువేసి తీసుకెళ్లకుండానే ఇది జరిగేలా చేయడం పెద్ద కష్టంకాదు. ఆమె చట్టవిరుద్ధంగా ప్రవర్తించివుంటే, సహాయకురాలి విషయంలో అనుచితంగా ప్రవర్తించివుంటే వాటి పర్యవ సానాలను ఆమె అనుభవించాల్సిందే. అయితే, అమెరికా అధికారులు విచారణకు ముందే ఆరోపణలు రుజువైనంత హడావుడి ఎందుకు చేయాల్సి వచ్చింది? తమది అగ్రరాజ్యమని, తాము తల్చుకుంటే ఏమైనా చేయగలమని చెప్పడం తప్ప... దేవయాని తండ్రి అంటున్నట్టు తమ జాత్యహంకారాన్ని ప్రదర్శించుకోవడంతప్ప దీనిద్వారా అక్కడి అధికారులు సాధించిందేమైనా ఉందా?
అమెరికా తీరుకు మన దేశం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేయడంతోపాటు ఢిల్లీలోని అమెరికా రాయబారి నాన్సీ పావెల్‌ను పిలిపించి నిరసన తెలిపింది. కానీ, ఆ దేశం ఎదురు వాదనకు దిగుతోంది. దౌత్యవేత్తల విషయంలో వ్యవహరిం చాల్సిన తీరుకు సంబంధించిన వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించలేదంటున్నది.
దేవయాని చేసిన పని ఆమె దౌత్య విధుల్లో భాగం కాదుగనుక తమ చర్యల్లో దోషం లేదంటున్నది. కానీ, ఎలాంటి సమాచారమూ ఇవ్వకుండా దేవయానిని అర్ధం తరంగా అరెస్టుచేసి తీసుకెళ్లడం ఆమె విధులను ఆటంకం పర్చడమే అవుతుందన్న స్పృహ ఆ దేశానికి లోపిస్తున్నది. ఇంతకూ దౌత్య సంప్రదాయాల గురించి, మర్యా దల గురించి తెలుసునన్నట్టు చెబుతున్న అమెరికా ఇతర దేశాల్లో ప్రవరిస్తున్న తీరేమిటి? ఆ సంగతి వికీలీక్స్ పత్రాల్లో బట్టబయలై చాలాకాలమైంది. తనవారా, పరాయివారా అన్న విచక్షణ కూడా మరిచి అన్ని దేశాల అధినేతలపైనా అమెరికా గూఢచర్యానికి పాల్పడుతున్నదని ఆ దేశ పౌరుడు స్నోడెన్ వెల్లడించి ఎన్నాళ్లో కాలేదు. ఈమధ్యే మాస్కోలోని అమెరికా దౌత్యవేత్త ఒకరు గూఢచర్యానికి పాల్ప డుతున్నాడని ఆరోపించి, అతన్ని అవాంఛనీయమైన వ్యక్తిగా ప్రకటించింది రష్యా. దౌత్యపరమైన రక్షణలున్నాయి గనుక అతన్ని అరెస్టు చేయడంలేదని చెప్పింది. కనీసం ఈపాటి మర్యాదనైనా దేవయాని విషయంలో ఎందుకు పాటించలేదో అమెరికా సంజాయిషీ ఇవ్వాలి. తమకు భారత్‌తో చిరకాలంనుంచి ద్వైపాక్షిక సంబంధాలున్నాయని, అవి ఎప్పటిలాగే కొనసాగుతాయని ఆశిస్తున్నట్టు అమెరికా ప్రకటించింది. ఆశిస్తే సరిపోదు. అందుకు అనుగుణమైన ఆచరణ అవసరమని ఆ దేశం గుర్తించాలి. కాస్తయినా సున్నితత్వాన్ని ప్రదర్శించడం నేర్చుకోవాలి.
అమెరికా ఔచిత్య భంగం!
Published Sat, Dec 14 2013 11:26 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM
Advertisement