లోహ విహంగాల మృత్యు హేల | Metallic objects death game | Sakshi
Sakshi News home page

లోహ విహంగాల మృత్యు హేల

Published Tue, Apr 28 2015 2:17 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM

Metallic objects death game

అమెరికా దాదాపు గత పదిహేనేళ్లుగా సాగిస్తున్న మానవ రహిత వైమానిక యుద్ధంలోని ఇద్దరు పౌరుల మరణాలకు అసాధారణమైన రీతిలో ఆ దేశాధ్యక్షుడు ఈ నెల 23న క్షమాపణలు చె ప్పుకోవాల్సి వచ్చింది. దీంతో యుద్ధరంగంలో ద్రోన్‌లుగా పిలిచే మానవ రహిత విమానాల ప్రయోగం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2001 నుంచి అమెరికా, అఫ్గానిస్తాన్ యుద్ధంలో ‘ప్రిడేటర్ల’నే ద్రోన్‌లతో ‘హెల్‌ఫైర్’  క్షిపణులను ప్రయోగిస్తోంది. అప్పటి నుంచి ఈ దాడుల్లో పెద్ద సంఖ్యలో అమాయక పౌరులు బలైపోతూనే ఉన్నారు. ఈ పౌర మరణాలపైనేగాక, అసలు ఈ ద్రోన్‌ల యుద్ధమే అంతర్జాతీయ యుద్ధ నియమాలకు, మానవ హక్కుల ప్రకటనకు విరుద్ధమనే తీవ్ర విమర్శలను అమెరికా ఇంటాబయటా ఎదుర్కొంటోంది. అఫ్గాన్, పాకిస్థాన్, యెమెన్, సిరియా, సోమాలియా తదితర దేశాల్లో అమెరికా చేసిన, చేస్తున్న ద్రోన్ దాడుల మృతుల్లో అత్యధికులు పౌరులేనంటూ అంతర్జాతీయ మీడియా పలు కథనాలను వెలువరిస్తోంది.

 

ఆత్మరక్షణ కోసం చేసే యుద్ధాన్ని లేదా దాడులను మాత్రమే అంతర్జాతీయ చట్టాలు న్యాయసమ్మతంగా పరిగణిస్తాయి. పాక్‌పై అమెరికా యుద్ధం ప్రకటించలేదు. అయినా అక్కడా ద్రోన్ దాడులు సాగుతూనే  ఉన్నాయి. 2014 అక్టోబర్లో అమెరికా పాక్‌లో జరిపిన 400వ ద్రోన్ దాడిని పురస్కరించుకొని వేడుకను కూడా జరుపుకుంది. పాక్‌లో ద్రోన్ దాడుల మృతుల సంఖ్య 2,379 అని అది ప్రకటించింది. వారిలో 12 శాతం మాత్రమే మిలిటెంట్లుగా సీఐఏ గుర్తించిన వారని ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ తేల్చింది. వేల మంది పౌరులు మరణిస్తున్నా పట్టించుకోనిది ఇద్దరి మృతికి అమెరికా అధ్యక్షుడంతటి వాడే క్షమాపణ  చెప్పడం పెద్ద వార్తయింది. ఆ ఇద్దరూ తాలిబన్ల చేతుల్లో బందీలుగా ఉన్న అమెరికా, ఇటలీ జాతీయులైన సహాయ కార్యకర్తలు. డాక్టర్ వారెన్ వీన్‌స్టీన్ అనే అమెరికన్ 2011 నుంచి, గివొన్ని లో పోర్టో అనే ఇటాలియన్ 2012 నుంచి బందీలుగా ఉన్నారు. అఫ్గాన్ సరిహద్దుల్లోని పాక్ భూభాగం ఉత్తర వజీరిస్తాన్‌లో జనవరి 15న వారిద్దరూ ద్రోన్ దాడిలో మృతి చెందినట్టు అప్పట్లోనే పాక్ పాత్రికేయులు తెలిపారు. రెండున్నర నెలలకు ఆ వార్తను  ధృవీకరించారు. దేశ సర్వసేనానిగా ఈ ఘటనకు పూర్తి బాధ్యత వహిస్తున్నానంటూ బరాక్ ఒబామా మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని, హృదయపూర్వక క్షమాపణలను తెలిపారు. మరోవంక ఆ దాడి ‘‘అత్యున్నత స్థాయి ఇంటెలిజెన్స్ సమాచారం’’పై ఆధారపడి జరిగినదేననీ స్పష్టం చేశారు. మిగతా సమాచారమంతా ప్రభుత్వ రహస్యమన్నారు. కాగా ఆ దాడి జరిపిన చోట కచ్చితంగా ఎవరున్నారో తెలియదనీ, అల్‌కాయిదా నేతలు వచ్చిపోతుండే ఆవరణ అనే సమాచారంతోనే ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల సీనియర్ అధికారి ఒకరు ఆ దాడికి ఆదేశించారని శ్వేతసౌధమే తెలిపింది.

 

కచ్చితంగా లక్ష్యాలపైనే జరిగే ‘ప్రిసిషన్’ దాడులుగా పిలిచే ద్రోన్ దాడులు ఎంత గుడ్డిగా సాగుతున్నాయో స్పష్టమే. ‘‘ఏ ఒక్క ద్రోన్ దాడిలోనూ ఎవరిని చంపుతున్నారనేది తెలీనే తెలియదు’’అని అమెరికా పౌర హక్కుల సంఘం అంటోంది. అమెరికా సాగిస్తున్నది ఉగ్రవాద వ్యతిరేక అంతర్జాతీయ యుద్ధం కాబట్టి అది ఎక్కడ దాడి చేస్తే అది యుద్ధ ప్రాంతం, అక్కడి పౌర మరణా లన్నీ అనివార్యమైనవే అనే తర్కమే ఈ దాడులకు మార్గదర్శకత్వం వహిస్తోందని ఆ సంస్థ పేర్కొంది.


 పాక్ ప్రభుత్వాలు లాంఛనంగా తమ భూభాగంపై అమెరికా ద్రోన్ దాడులను ఖండిస్తున్నా అవి పాక్ తాలిబన్లు లక్ష్యంగా సాగుతున్నవి కాబట్టి మౌనంగా మద్దతు పలుకుతున్నాయి. అయినా ఈ నెల 7న పాక్‌లోని ఒక క్రిమినల్ న్యాయస్థానం ద్రోన్ దాడిలో ఒక పాత్రికేయుడ్ని, ఒక ఉపాధ్యాయుడ్ని, అతని కుమారుడ్ని చంపిన  కేసులో ఇద్దరు అమెరికన్ అధికారులు దోషులని తీర్పు చెప్పింది. 2009 నాటికి పాక్‌లోని సీఐఏ అత్యున్నతాధికారులుగా ఉన్న ఆ ఇద్దరూ 2010లోనే అమెరికాకు చేరారు. అమెరికా వారిని పాక్‌కు అప్పగించేది లేదని తేల్చేసింది. ఇలాంటి చిక్కులు వస్తాయనే అమెరికా తన ద్రోన్ స్థావరాలను ఇతర మిత్ర దేశాలకు మార్చేసింది. జర్మనీలోని రమ్‌స్టీన్‌లోని అలాంటి స్థావరం ఇటీవల రచ్చకెక్కింది. జర్మనీ చట్టాలు తమ భూభాగం నుంచి ఎవరు యుద్ధ నేరాలకు పాల్పడినా విచారించే హక్కును అక్కడి కోర్టులకు కల్పిస్తాయి. చట్టాలకు దొరక్కుండా నేరగ్రస్త ముఠాలు అనుసరించే పద్ధతుల్లో రమ్‌స్టీన్‌లోని ద్రోన్‌ల కమాండ్ సెంటర్లను అమెరికాలో ఏర్పాటు చేశారు. రమ్‌స్టీన్ నుంచి అఫ్గాన్, పాక్, యెమెన్‌లలో దాడులు జరుపుతున్న ద్రోన్‌ల పైలట్లు ఉండేది అమెరికాలో. కాబట్టి వారు జర్మన్ చట్టాలకు అతీతులు. చట్టాలను వంచించే ఇలాంటి పద్ధతులు మరింతగా అమెరికా ప్రతిష్టను దిగజారుస్తున్నాయనే విమర్శలను ఒబామా లెక్క చేయడం లేదు.
 
 ‘‘గుండెలు చెదిరిపోయేలా చేసే పౌర మరణాలకు కారణమౌతున్నా మన కాల్బలాలను దించడం కంటే ద్రోన్ దాడులే సురక్షిత ప్రత్యామ్నాయం’’ అని ఆయన 2013లోనే స్పష్టం చేశారు. సురక్షితమంటే తమ సైన్యం మరణాలను జీరో స్థాయికి తగ్గించడమనే అర్థం. కాబట్టి ఇకపై అమెరికా ఉగ్రవాదులున్న ప్రాంతంగా భావించిన ఎక్కడైనా ఈ ‘‘సురక్షిత ప్రత్యామ్నాయా’’న్నే అనుసరిస్తుంది. ఇంతవరకు తనకే పరిమితం చేసుకున్న ఈ ‘‘సురక్షిత ప్రత్యామ్నా యాన్ని’’ మిత్ర దేశాలకు కూడా అందించాలని ఫిబ్రవరిలో అది నిర్ణయించింది. మధ్యప్రాచ్యంలోని సౌదీ అరేబియా నుంచి ఈజిప్ట్ వరకు పలు దేశాలకు అమెరికా ప్రిడేటర్లు అందుతాయి. నేడు ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదుల చేతుల్లో ఉన్న ఆయుధాలన్నీ ఇరాక్ సేనలకు అమెరికా అందించినవే. అల్‌కాయిదా ఆయుధాలన్నీ అఫ్గాన్ ముజాహిదీన్‌లకు అది సమకూర్చినవే. కాబట్టి ఈ ‘‘సురక్షిత ప్రత్యామ్నాయం’’ ఉగ్రవాద మూకలకు అందదనుకోవడం హాస్యాస్పదం. అమెరికా ఆడుతున్న ఈ  ప్రమాద కరమైన ఆట మొత్తంగా ప్రపంచ పౌరులందరికీ, ప్రత్యేకించి సీమాంతర ఉగ్ర వాదమనే పెను ముప్పును ఎదుర్కొంటున్న మనకు మరింత ప్రమాదకరం. అందుకే ద్రోన్‌ల వ్యతిరేక అంతర్జాతీయ పోరాటం నేటి ఆవశ్యకత.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement