సున్నితమైన అంశాలతో వ్యవహరించేటపుడు తొట్రుపాటు ప్రదర్శిస్తే అది వికటించకమానదు. నెలరోజులక్రితం అధికారంలోకొచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్నిటా ఆచి తూచి వ్యవహరిస్తున్నట్టే కనిపించింది. అందుకు ప్రశంసలూ అందుకుంది. కానీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకం విషయంలో తోవ తప్పి తల బొప్పికట్టించుకున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్నడూలేని విధంగా సాక్షాత్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎం. లోధా... ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిందని బహిరంగంగా ఆరోపించే స్థితి ఏర్పడింది. మన దేశంలో న్యాయమూర్తుల నియామకాలను న్యాయమూర్తులే సభ్యులుగా ఉండే కొలీజియం వ్యవస్థ చూస్తుంది. ఇందులో పారదర్శకత కాస్తయినా లేదన్న విమర్శలున్నాయి. ఎవరిని ఎందుకు న్యాయమూర్తులుగా ఎంపిక చేస్తున్నారో లేదా నిరాకరిస్తున్నారో తెలియడంలేదన్నది ప్రధానమైన ఫిర్యాదు. ఈ కొలీజియం వ్యవస్థను ఒక తీర్పు ద్వారా అమల్లోకి తెచ్చిన జస్టిస్ జేఎస్ వర్మ సైతం తాను అనుకున్నది ఒకటైతే జరిగింది మరొకటని ఒక దశలో వ్యాఖ్యానించారు. సరే...యూపీఏ సర్కారు రెండో విడత అధికారంలోకొచ్చాక న్యాయ వ్యవస్థ ప్రమాణాలు, జవాబుదారీ బిల్లును రూపొందించింది. అందులో న్యాయమూర్తుల నియామకం, తొలగింపు వగైరా అంశాలు కూడా ఉన్నాయి. ఆ బిల్లుకు ఎన్డీఏ సర్కారు ఏయే మార్పులు తలపెట్టిందో, దాన్ని పార్లమెంటు ముందుకు ఎప్పుడు తీసుకురాదల్చుకున్నదో ఇంకా తెలియాల్సి ఉంది. ఈలోగానే కొలీజియం సిఫార్సు చేసిన మాజీ సొలిసిటర్ జనరల్ గోపాల్ సుబ్రహ్మణ్యం విషయంలో సంప్రదాయానికి భిన్నంగా పోయి వివాదాన్ని కొనితెచ్చుకుంది.
సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవులకు నలుగురిని ఎంపిక చేస్తూ కొలీజియం నిర్ణయం తీసుకుంది. వీరిలో ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తులుకాగా మరో ఇద్దరు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు రోహింటన్ నారిమన్, గోపాల్ సుబ్రహ్మణ్యం. న్యాయకోవిదులుగా సుప్రసిద్ధులైనవారిని సుప్రీంకోర్టు జడ్జీలుగా నేరుగా నియమించే సంప్రదాయం గతంలో ఉన్నా దాదాపు మూడు దశాబ్దాలుగా దాన్ని పాటించడంలేదు. సీనియారిటీని పరిగణనలోకి తీసుకుని హైకోర్టు న్యాయమూర్తులకే సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతులిస్తున్నారు. కొలీజియం పరిశీలించిన నారిమన్, సుబ్రహ్మణ్యంలిద్దరూ సొలిసిటర్ జనరల్స్‌గా పనిచేయడమే కాక సంచలనం కలిగించిన 2జీ స్పెక్ట్రమ్ కేసు మొదలుకొని ఎన్నో కేసుల్లో వాదించినవారు. వ్యక్తిగత ప్రవర్తన విషయంలోనైనా, వృత్తిపరమైన అంశాల్లోనైనా వారి విశ్వసనీయత తిరుగులేనిది. అయితే, చిత్రంగా ఎన్డీయే ప్రభుత్వం గోపాల్ సుబ్రహ్మణ్యాన్ని మినహాయించి మిగిలినవారి నియామకాలకు సంబంధించిన కొలీజియం సిఫార్సుకు ఆమోద ముద్ర వేసింది. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో తన అభిప్రాయాలను లేదా అభ్యంతరాలనూ తెలియజెబుతూ సంబంధిత ఫైళ్లను కొలీజియంకు కేంద్ర ప్రభుత్వం తిప్పి పంపుతుంది. అటుతర్వాత దానిపై కొలీజియం తుది నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పుడు అనుసరిస్తున్న నిబంధనల ప్రకారమైతే ప్రభుత్వ అభ్యంతరాలను బేఖాతరుచేసి తమ ఎంపికలను ఖరారుచేసుకునే వెసులుబాటు కొలీజియంకు ఉంది. కానీ, గోపాల్ సుబ్రహ్మణ్యం విషయంలో జరిగింది వేరు. ఆయన నియామకంపై మోడీ ప్రభుత్వానికి అభ్యంతరం ఉన్నదని తొలుత మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఆయనకు సంబంధించి ఫిర్యాదులు వచ్చినందువల్ల... సీబీఐ, ఐబీ నివేదికలు కూడా ఆయనకు వ్యతిరేకంగా ఉన్నందువల్ల సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవికి సుబ్రహ్మణ్యం తగరని ప్రభుత్వం భావిస్తున్నదని ఆ కథనాలు వివరించాయి. దీనికితోడు ఇందులో మరో అసాధారణ అంశం చోటుచేసుకుంది. నలుగురికి సంబంధించిన జాబితాను పంపినప్పుడు నలుగురిపైనా కేంద్రం తన అభిప్రాయాలను రాసిపంపాలి. గతంలో ఒకరిద్దరు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకం విషయంలో ఇలాగే జరిగింది. కానీ, ఎన్డీయే సర్కారు అందుకు భిన్నంగా వ్యవహరిం చింది. జాబితానుంచి గోపాల్ సుబ్రహ్మణ్యాన్ని మినహాయించింది. ఆ రకంగా కొలీజియంకున్న అధికారాలకు పరిమితులు విధించింది. ప్రభుత్వ అభ్యంతరాలను అవసరమైతే తోసిరాజని తుది నిర్ణయం తీసుకోవడానికి దానికున్న హక్కును బేఖాతరుచేసింది.
కొలీజియం వ్యవస్థ సరిగా లేదని కేంద్రం భావిస్తే దానికి తగిన ప్రత్యామ్నాయాన్ని వెదకడం తప్పేమీ కాదు. అందుకు సంబంధించిన బిల్లు పెండింగ్‌లో ఉన్నది కూడా. కానీ, ఈలోగా తీసుకునే నిర్ణయాలన్నీ అమల్లో ఉన్న విధానానికి అనుగుణంగానే ఉండాలి. నిర్ణయ ప్రక్రియ చుట్టూ ఊహాగానాలు అల్లుకొనడానికి అవకాశమివ్వడం, వ్యక్తుల ప్రతిష్ట మసకబారే స్థితి కల్పించడం మంచిదికాదు. ఇప్పుడు జరిగింది అదే. గోపాల్ సుబ్రహ్మణ్యం మనస్తాపం చెంది, న్యాయమూర్తిగా ఎంపికయ్యేందుకు వెలిబుచ్చిన సంసిద్ధతను రద్దుచేసుకుంటున్నట్టు ప్రకటించడంతో ఊరుకోక న్యాయవ్యవస్థ స్వతంత్రత దెబ్బతింటున్నా మౌనంగా మిగిలిపోయినందుకు సుప్రీంకోర్టును సైతం తూర్పారబట్టారు. జస్టిస్ లోధా రిటైరయ్యేవరకూ ప్రాక్టీస్‌కు దూరంగా ఉంటానని ప్రకటించారు. బహుశా అందువల్లే కావొచ్చు...జస్టిస్ లోధా ఈ విషయంలో ఏం జరిగిందో, తన వైఖరేమిటో బహిరంగపరచవలసి వచ్చింది. అన్నీ పద్ధతి ప్రకారమే జరిగాయని, న్యాయవ్యవస్థపై తమకు అత్యంత గౌరవభావం ఉన్నదని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఇస్తున్న ముక్తసరి సంజాయిషీకి విలువ లేదు. అలాంటి గౌరవం ఉన్నదని మాటల్లో చెప్పడమే కాదు...చేతలు కూడా అందుకు అనువుగా ఉండేలా చూసుకోవాలి. అది కేంద్ర ప్రభుత్వ కనీస బాధ్యత.
స్వయంకృత వివాదం!
Published Wed, Jul 2 2014 11:57 PM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement
Advertisement