స్వామి కార్యంతో పాటు స్వకార్యం నెరవేర్చుకునే ఘనులున్నప్పుడు ఏదీ సక్రమంగా సాగదు. ఉగ్రవాదం నిర్మూలనకు తీసుకునే చర్యలు పక్కదోవ పడుతున్నాయని తాజాగా ఢిల్లీలో బయటపడిన ఉదంతం రుజువు చేస్తున్నది. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థ తరఫున ఢిల్లీ నగరంలో హోళీ రోజున మారణకాండ సృష్టించడం కోసం వచ్చిన లియాకత్ అలీ షా అనే ఉగ్రవాదిని వలపన్ని పట్టుకున్నామని 2013లో ఢిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం ప్రకటించింది. కశ్మీర్ వాసి అయిన లియాకత్ పార్లమెంటుపై దాడి కేసులో ఉరిశిక్ష అమలైన అఫ్జల్ గురు మృతికి ప్రతీకారం తీర్చుకునే ఉద్దేశంతో నేపాల్‌నుంచి దేశంలోకి ప్రవేశించాడని ఆ విభాగం చెప్పింది. అతన్ని సకాలంలో వలపన్ని పట్టుకోలేకపోయి ఉంటే దేశ రాజధాని నగరంలో పెను విధ్వంసాన్ని సృష్టించేవాడని వివరించింది. తీరా ఇప్పుడు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) ఆ కేసును దర్యాప్తు చేశాక అతను నిరపరాధి అని తేలింది. అతని నుంచి స్వాధీనం చేసుకున్నట్టు చూపిన ఆయుధాలు కూడా పోలీసులు పెట్టినవేనని రుజువైంది. ఈ కేసులో డీసీపీ సంజీవ్‌కుమార్ యాదవ్‌సహా ఏడుగురు సిబ్బంది దోషులని ఎన్‌ఐఏ నిర్ధారణకొచ్చింది.
పదోన్నతులనూ, ఇతర రివార్డులనూ ఆశించి ఉగ్రవాదం బెడద పేరుతో పోలీసులు అమాయకులను ఇరికిస్తున్నారని హక్కుల సంఘాలు ఎప్పటినుంచో ఆరోపిస్తున్నాయి. ఒకపక్క ఉగ్రవాదులు అక్కడక్కడా పేలుళ్లకు పాల్పడి ప్రాణాలు తీస్తుంటే అలాంటి కేసుల్లో దోషులను పట్టుకోవడం పోలీసులకు ఓ పట్టాన సాధ్యంకావడం లేదు. అది సాధ్యం కావడం లేదు గనుక కొందరు అమాయకులను తప్పుడు కేసుల్లో నిందితులుగా చూపి, పెను ముప్పునుంచి దేశాన్ని కాపాడినట్టు చిత్రించబూనటం ప్రమాదకర పర్యవసానాలకు దారితీస్తుంది. ఉగ్రవాదం ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలూ ఎదుర్కొంటున్న ఒక ఉపద్రవం. కేవలం కఠినమైన చట్టాలవల్ల మాత్రమే దాన్ని రూపుమాపడం సాధ్యం కాదు. జాతి, మత, రాజకీయ విభేదాలు లేకుండా అందరూ సమష్టిగా పోరితే తప్ప ఉగ్రవాద భూతం కనుమరుగు కావడం కష్టం. అది సాధ్యంకావాలంటే భద్రతా విభాగాలు సమన్వయంతో సమర్థవంతంగా పనిచేయాలి. తమ ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయాలి. తమ వారిని అకారణంగా వేధిస్తున్నారన్న అభిప్రాయం ఏ వర్గంలోనైనా ప్రబలితే దానివల్ల సమాజంలో సామరస్యత చెడుతుందన్న స్పృహ ఉండాలి. ఈ విషయంలో ఢిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం రికార్డు ఏమంత గొప్పగా లేదు. నిజమైన దోషులను పట్టుకోవడానికి ఓపిగ్గా కేసు దర్యాప్తు చేయడంకాక, ఆదరాబాదరాగా ఎవరెవరినో నిందితులుగా చూపుతున్నారని గతంలో కూడా ఆ విభాగంపై ఆరోపణలు వినిపించాయి. అది దర్యాప్తు చేసిన కేసుల్లో శిక్ష రేటు 30 శాతం మించి లేదు. ఢిల్లీ యూనివర్సిటీలో లెక్చరర్‌గా పనిచేసిన కశ్మీర్‌కు చెందిన హక్కుల ఉద్యమకారుడు ఎస్‌ఏఆర్ గిలానీని 2001 పార్లమెంటు దాడి కేసులో నిందితుడిగా చూపినా ఆయన నిర్దోషి అని న్యాయస్థానాలు తేల్చిచెప్పాయి. మరో కశ్మీరీ జర్నలిస్టు ఇఫ్తెకర్ గిలానీ కేసు కూడా ఇలాగే ముగిసింది. 2006లో ఈశాన్య ఢిల్లీలో అయిదుగురు పేరుమోసిన నేరస్తులను ఎన్‌కౌంటర్‌లో హతమార్చామని ప్రకటించగా ఆ తర్వాత అది బూటకపు ఎన్‌కౌంటర్ అని మానవహక్కుల కమిషన్ నిర్ధారించింది. 2013లో కశ్మీర్‌కు చెందిన ఇద్దరు యువకుల్ని నిర్దోషులుగా నిర్ధారిస్తూ పదోన్నతుల కోసం ప్రత్యేక పోలీసు విభాగం ఈ కేసును సృష్టించిందని న్యాయస్థానం తేల్చిచెప్పింది.
ఉగ్రవాద ఘటనలు పెచ్చుమీరుతున్నాయన్న ఆదుర్దాతో కేంద్ర ప్రభుత్వం తీసుకునే చర్యలు చివరికిలా వికటించడం ఆందోళన కలిగించే అంశం. 1986లో ఢిల్లీ పోలీసు శాఖలో కీలకమైన కేసుల్ని ఛేదించడం కోసం ఈ ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పారు. తాము చట్టాలకూ, రాజ్యాంగానికీ అతీతం కాదని...దేశంలో సాధారణ పౌరులకు వర్తించే నిబంధనలన్నీ తమకూ వర్తిస్తాయని, చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తే తామూ చట్టం ముందు దోషులుగా నిలబడవలసివస్తుందన్న సంగతిని ఆ విభాగంలో పనిచేస్తున్నవారు విస్మరించారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే క్రమంలో తమకూ ఆ దుర్లక్షణాలు వస్తున్నాయని వారికి అర్ధంకావడంలేదు. వేలాదిమంది అమాయక పౌరులు తాము చేసిన నేరమేమిటో తెలియక జైళ్లలో మగ్గుతున్నారని హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. వాస్తవానికి ఎన్‌ఐఏ ఏర్పాటయ్యాక ఇలాంటి కేసులు చాలా వెలుగులోకొచ్చాయి. నేర దర్యాప్తులో ఎప్పటికప్పుడు అందుబాటులో కొచ్చే సమాచారం ఆధారంగా కేసును ఎంతో చాకచక్యంతో ఛేదించాల్సింది పోయి ఎవరో ఒకరిని దోషుల్ని చేసి, వారితో నేరాంగీకార ప్రకటన చేయించి చేతులు దులుపుకోవడం రివాజైంది. ఇది చాలదన్నట్టు తాము అప్రమత్తంగా ఉండి ఒక పెద్ద నేరం జరగకుండా ఛేదించగలిగామన్న కట్టుకథలల్లి అందులో కొందరు అమాయకులను ఇరికించే ధోరణి కూడా పెరుగుతున్నదని ఎన్‌ఐఏ బయటపెట్టిన తాజా ఉదంతం చెబుతోంది. తాము ఇచ్చిన సాక్ష్యాధారాలను సరిగా పరిగణించకుండా ఎన్‌ఐఏ తమపై అభాండం మోపుతున్నదని ప్రత్యేక పోలీసు విభాగం చేస్తున్న వాదనను ఎవరూ నమ్మలేరు. ఈ కేసు బలంగా ఉండాలన్న ఉద్దేశంతో పోలీసులు ఏకే-56ను, కొన్ని పేలుడు పదార్థాలనూ కూడా చూపారు. ఒక దొంగ కేసును సృష్టించడం కోసం పోలీసులకు ఆయుధాలు ‘రిజర్వ్’లో ఉండటం ఆందోళన కలిగించే అంశం. ఈ కేసులో ఎన్‌ఐఏ అధికారులు ప్రశంసనీయంగా దర్యాప్తు జరిపారు. లియాకత్ కేసులో బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోమని ఆ సంస్థ చేసిన సిఫార్సును మన్నించి కఠినంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఇప్పుడు కేంద్ర హోంశాఖపై ఉంది. దర్యాప్తు సంస్థలకు విశ్వసనీయత పెరగాలన్నా, చట్టబద్ధపాలనపై దేశ పౌరుల్లో విశ్వాసం ఏర్పడాలన్నా ఇది అత్యవసరం.
ప్రమాదకర ధోరణి
Published Tue, Feb 3 2015 1:03 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement
Advertisement