రాజకీయ నాయకులు నిరంతరం వార్తల్లో ఉండాలని కోరుకుంటారు.
రాజకీయ నాయకులు నిరంతరం వార్తల్లో ఉండాలని కోరుకుంటారు. తమ పేరు నిత్యం మార్మోగాలని ఆశిస్తారు. అధికారంలో ఉన్నవారికి అందుకు సంబంధించిన దిగులేమీ ఉండదు. అధికారిక సమావేశాలు, విధాన ప్రకటనలు వగైరాలవల్ల వద్దనుకున్నా ప్రచారం లభిస్తుంది. విపక్షంలో ఉండేవారు ఏ సమస్యపైన అయినా చురుగ్గా స్పందించే విధానంద్వారా...అధికార పక్షాన్ని గుక్కతిప్పుకోనీయకుండా చేసే కార్యాచరణద్వారా గుర్తింపు పొందాలి. ఏ పక్షంలో ఉన్నా వార్తల్లోకెక్కే తత్వం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీది. అయితే అది అదృష్టమనాలో, దురదృష్టమనాలో... ఒక్కోసారి అతిగా వ్యవహరించడంద్వారా, కొన్ని సందర్భాల్లో ఏం చేస్తున్నారో, ఏమయ్యారో తెలియకపోవడంద్వారా మాత్రమే ఆయన మీడియాలో గుర్తింపు పొందుతున్నారు. రాహుల్‌గాంధీ 56 రోజులపాటు సెలవుపై వెళ్లి నాలుగురోజుల క్రితం ఢిల్లీకి చేరుకున్నారు.
రాజకీయ నాయకులు కూడా మనుషులే గనుక, వారికి కూడా వ్యక్తిగత జీవితం ఉంటుంది గనుక అలా వెళ్లడాన్ని తప్పుబట్టాల్సిన అవసరం లేదు. అయితే, అందుకు ఎంచుకున్న సమయం విషయంలోనే అందరూ ఆశ్చర్య పోయారు. ఒకపక్క పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఎన్డీయే సర్కారు పనితీరుపై పార్లమెంటులో కాంగ్రెస్ నిప్పులు చెరుగుతోంది. భూసేకరణ బిల్లు లోక్‌సభ ముందుకొచ్చింది. అందుకు సంబంధించిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా రాష్ట్రపతి వద్దకు కాంగ్రెస్, వామపక్షాలతోసహా అందరూ కలిసికట్టుగా వెళ్లారు. అదే సమయంలో బొగ్గు కుంభకోణానికి సంబంధించి మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు సమన్లు జారీ అయ్యాయి. మీ వెనక మేమున్నామంటూ సోనియాతో సహా కాంగ్రెస్ హేమా హేమీలంతా ఆయన నివాసానికి వెళ్లి నైతిక మద్దతునిచ్చారు. మరోవైపు యూపీఏలో కొనసాగుతున్న కొన్ని పార్టీలూ, వెలుపలనున్న మరికొన్ని పార్టీలూ కలిసి ఒకే పార్టీగా ఆవిర్భవించనున్నట్టు ప్రకటించాయి. ఆయన స్థాయి నాయకుడు ఇలాంటి పరిణామాల్లో కనబడకుండా, వినపడకుండా శూన్యంలోకి జారిపోవడం అసాధారణమైన విషయం. రాహుల్‌ను నమ్ముకుని కాంగ్రెస్‌వంటి అతి పెద్ద పార్టీ రోజులు వెళ్లదీస్తోంది. గాంధీ కుటుంబంవల్లనే మళ్లీ గత వైభవాన్ని పొందగలనని తనకు తాను ధైర్యం చెప్పుకుంటోంది. కిందినుంచి మీది వరకూ అందరూ తననే నమ్ముకుని ఉన్న కీలక తరుణంలో రాహుల్ ఒక్కసారిగా ఎటో వెళ్లిపోతే వారందరూ దిగులుపడటంలో... అడిగినవారికి జవాబు చెప్పలేక సతమతమవడంలో వింతేముంది?
పార్టీ శ్రేణులనూ, నేతలనూ ఇలా ఇరుకునపడేయడం రాహుల్‌కు ఇది మొదటిసారి కాదు. నేర చరితులైన చట్టసభల సభ్యులకు సంబంధించి యూపీఏ ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్‌ను రూపొందించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపినప్పుడు ఏమైందో అందరికీ గుర్తుండే ఉంటుంది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి అజయ్ మాకెన్ మీడియా ప్రశ్నలకు ఉక్కిరిబిక్కిరై ఆ ఆర్డినెన్స్‌ను సమర్థించుకోవడానికి తిప్పలు పడుతున్న సమయంలో హఠాత్తుగా రాహుల్ అక్కడ ప్రత్యక్షమై... విషయమేమిటని అడగటం, ఆయన ఇంకా చెప్పడం పూర్తిచేయకుండానే ‘ఇదంతా నాన్సెస్. ఈ ఆర్డినెన్స్‌ను చెత్తబుట్టలో వేయాల’ంటూ ప్రకటన ఇచ్చేసి అక్కడినుంచి నిష్ర్కమించడం పూర్తయ్యాయి. ఇంకా వెనక్కు వెళ్తే రాజకీయాల్లో వారసత్వం సరికాదని రెండేళ్లక్రితం ప్రకటించి కాంగ్రెస్ శ్రేణుల్ని ఆయన ఇరకాటంలో పడేశారు. అధికారం విషంతో సమానమని, హైకమాండ్ సంస్కృతి తనకు నచ్చదని కుండబద్దలు కొట్టారు. తమ పార్టీతోసహా దేశంలోని పార్టీలన్నీ కొద్దిమంది వ్యక్తుల ప్రాబల్యంలో నడుస్తున్నాయని, ఇది మారాలని పిలుపునిచ్చారు. అధినేత కుమారుడు గనుక ఆయన తల్చుకుంటే ఏమైనా జరుగుతుందని... పార్టీలో అంతా మారిపోతుందని అందరూ భ్రమించారు. తీరా అదేమీ జరగలేదు. అసలు ఆయనే మారలేదు. ఎప్పటిలా అధికారం ఉన్న రాష్ట్రాల్లో తన వర్గం అనుకున్నవారికి పదవులు ఇప్పించడంలోనూ, ఎన్నికలొచ్చినప్పుడు టిక్కెట్ల పంపిణీలోనూ తన పాత్రను యథావిధిగా పోషించారు.
ఇంతకూ రాహుల్ 56 రోజులపాటు ఎక్కడికెళ్లారన్న విషయంలో చర్చ సాగుతూనే ఉంది. అది తప్పదు. ఆయన థాయ్ ఎయిర్‌వేస్ విమానంలో వచ్చారు గనుక ఆ దేశం వెళ్లి ఉంటారని కొందరంటుంటే, మయన్మార్ వెళ్లారని...అటు వెళ్లినట్టు తెలియకుండా ఉండటానికి థాయ్‌లాండ్ మీదుగా తిరిగొచ్చారని మరికొందరూ, వియత్నాం వెళ్లారని ఇంకొందరూ ఊహాగానాలు చేశారు. పార్టీకి జవసత్వాలివ్వడం కోసం సంస్థాగతంగా చేయాల్సిన మార్పులపైనా...వర్తమాన పరిణామాలను అవలోకనం చేసుకుని పార్టీకి దిశానిర్దేశం చేయడానికి సంబంధించిన ప్రణాళికపైనా లోతుగా ఆలోచించడం కోసం ఆయన ‘సెలవుపై’ వెళ్లారని పార్టీ పెద్దలు లీకులిచ్చారు. పార్టీ బాగుపడటం, పడకపోవడం మాట అటుంచి- ఆయనొస్తే తమ పదవులకు ఎసరు రావొచ్చని భయపడిన నేతలంతా ఒకపక్క... రాహుల్ ఎప్పుడు పూర్తిస్థాయిలో పగ్గాలు చేపడతారా, తమకెప్పుడు పదవుల వడ్డన ఉంటుందా అని ఎదురుచూసే నేతలంతా మరోపక్క చేరి పార్టీలో ఉన్న అంతర్గత పోరును బజారున పడేశారు. ఏ వర్గంవారైనా అందరూ 70 ఏళ్ల వయసు దాటినవారే. యువకులకు అవకాశం ఇవ్వాలన్న సంగతిని పార్టీ ఏనాడో మరిచిపోయినందువల్ల రాహుల్‌ను సమర్థించే వారిలో సైతం యువ నేతలు లేరు. తిరిగొచ్చాక పార్టీ నిర్వహించిన కిసాన్ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీపై రాహుల్ నిప్పులు చెరగడం, అందుకు సభికుల నుంచి స్పందన బాగానే రావడం... లోక్‌సభలో సైతం మోదీ సర్కారుపై ఆయన వ్యంగ్య వ్యాఖ్యలతో చెలరేగడం పార్టీ నేతలకు సంతృప్తి కలిగించి ఉంటుంది.
అందుకే దేశమంతా యాత్రలు చేయాలని, ఎన్డీయే విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను కూడగట్టాలని వారు రాహుల్‌ను బతిమాలుతున్నారు. అతిథి పాత్రలా వచ్చి నిష్ర్కమించాలనుకునే వారికి రాజకీయాల్లో చోటుండదు. ఏంచేసినా నిలకడగా, నికరంగా చేయాలి. దృఢంగా నిలబడాలి. సమస్యలపై స్పష్టమైన అవగాహనతో మాట్లాడాలి. అవసరమైనప్పుడల్లా పోరాడాలి. అప్పుడే నాయకుడిగా జనం గుర్తిస్తారు. నీరాజనాలు పడతారు. విచిత్రంగా మాట్లాడి, ప్రవర్తించి వార్తల్లోకెక్కడం వల్ల ప్రయోజనం కలగదని రాహుల్ తెలుసుకుంటే ఆయనకూ, పార్టీకీ కూడా మంచిది.