పూలమ్మినచోటే కట్టెలు అమ్మడం అంటే ఏమిటో ఇప్పుడు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి అనుభవంలోకి వస్తున్నది. పార్టీలో పదవి ఉన్నా లేకున్నా ఆయన తిరుగులేని నాయకుడిగానే చలామణి అయ్యారు.
పూలమ్మినచోటే కట్టెలు అమ్మడం అంటే ఏమిటో ఇప్పుడు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి అనుభవంలోకి వస్తున్నది. పార్టీలో పదవి ఉన్నా లేకున్నా ఆయన తిరుగులేని నాయకుడిగానే చలామణి అయ్యారు. కానీ, అదేం ప్రారబ్ధమో ఆయనకూ, విజయానికీ ఎప్పుడూ చుక్కెదురే. పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు బీహార్, ఉత్తరప్రదేశ్ ఎన్నికల బాధ్యతలను స్వీకరించి, ఆ రెండు రాష్ట్రాల్లోనూ ఒంటరి పోరు వ్యూహాన్ని ఖరారుచేశారు. ఇది బెడిసికొట్టి కాంగ్రెస్ తీవ్రంగా నష్టపోయింది. ఏణ్ణర్ధంక్రితం కీలకమైన పార్టీ ఉపాధ్యక్ష పదవి తీసుకున్నాక విలేకరుల సమావేశాలు పెట్టి కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడటం ప్రారంభించారు. ప్రధానితోసహా ఎవరినీ ఏనాడూ వద ల్లేదు. కేవలం వారసత్వంవల్లే ఇలా మాట్లాడే వెసులుబాటు కలిగినా... అవకాశం వచ్చినప్పుడల్లా వారసత్వ రాజకీయాలనూ చెరిగిపారేశారు. అధికారానికి చేరువగా ఉన్నా ఆయన తనను తాను తటస్థుడిగా భావిం చుకుని అధికారం విషంతో సమానమని మాట్లాడారు. అది తనకు సరిపడని విషయమన్నట్టు చెప్పారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో కాళ్లకు బలపం కట్టుకు తిరిగినా ఓటర్లు ఆ పార్టీని కనికరించక రెండం కెల స్థానాలకు సరిపెట్టారు. ఫలితంగా పార్టీలో ఒక్కో గొంతే ధిక్కార స్వరం వినిపిస్తున్నది. మిత్రులు సైతం నిలదీయడం మొదలుపెట్టారు. అసోంలో విద్యామంత్రి, సీనియర్ నేత హిమంత బిశ్వ శర్మ పార్టీ అభిప్రాయానికి భిన్నంగా అక్కడి ముఖ్యమంత్రి తరుణ్ గోగోయ్‌పై నిప్పులు చెరిగారు. మంత్రి పదవినుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటిం చారు. మహారాష్ట్రలోనూ ఇదే పరిస్థితి. ముఖ్యమంత్రి పృధ్వీరాజ్ చవాన్ నాయకత్వంలో తాము పనిచేయలేమని అక్కడి మంత్రి నారా యణ్ రాణే నిర్మొహమాటంగా చెప్పారు. ఇలాంటి ‘విఫల నేతల’తో కలిసి ప్రయాణించి పార్టీకి దాపురించబోయే ఓటమిలో భాగస్వామిని కాదల్చుకోలేదన్నారు. మహారాష్ట్రలో ఈ ఏడాది ఆఖరుకు అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. అసోం అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉంది. ఈ రెండుచోట్లా తిరుగు బాటు చేసిన నేతలకు ముఖ్యమంత్రి పదవు లపై మోజున్న మాట నిజమే. నారాయణ్ రాణే అయితే కాంగ్రెస్‌లో చేరిననాడే తనకు ముఖ్యమంత్రి పదవిని స్తామని వాగ్దానం చేశారని నేరుగా చెప్పారు.
ఇలాంటి స్థితి ఏర్పడటానికి ఎవరినైనా తప్పుబట్టేముందు పార్టీ అధినేతలు తమను తాము ప్రశ్నించుకోవాల్సి ఉంది. రాష్ట్రాల్లోని లెజిస్లే చర్ పార్టీల మనోగతాన్ని లెక్కచేయకుండా సీల్డ్ కవర్లలో నిర్ణయాలను పంపి రుద్దే వైఖరే ఇలాంటి అసంతృప్తికి కారణమవుతున్నది. ఎమ్మెల్యే లందరూ మెచ్చినవారికి పట్టంగడితే అలాంటివారు స్థానికంగా బలపడ తారేమో, తమకు పక్కలో బల్లెంలా మారతారేమోనన్న భయంతోనే ఈ సీల్డ్ కవర్ రాజకీయాన్ని కొనసాగిస్తున్నారు. పృథ్వీరాజ్ చవాన్ అలా వచ్చినవారే. ఇక తరుణ్ గోగోయ్ విషయానికొస్తే ఆయన నాయక త్వంలో వరసగా మూడుసార్లు పార్టీ అసోంలో విజయం సాధించినా ఆయనను అదుపులో ఉంచుకోవడం కోసం అసంతృప్తవాదులను ఎప్ప టికప్పుడు పార్టీ నాయకత్వం ప్రోత్సహిస్తూనే ఉంది. ఏతావాతా రెండు చోట్లా ఇప్పుడు పార్టీకి సంకట స్థితి దాపురించింది. రాహుల్‌గాంధీకి పార్టీ కీలక బాధ్యతలు కట్టబెట్టాక ఆయన ఇలాంటి ధోరణులను అరికట్టడంపై దృష్టి సారించివుంటే వేరుగా ఉండేది. స్థానికులు మెచ్చిన నేతలకు పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ అవకాశమిచ్చి వారు స్థిమితంగా పనిచేసుకునేలా వెసులుబాటు కల్పిస్తే మంచి ఫలితాలు వచ్చేవి. పార్టీ తిరుగులేని స్థితిలో ఉండేది. అందుకు భిన్నంగా అధిష్టానం ఆశీస్సులతో ఎప్పటిలాగే నడిచిన రాజకీయాల పర్యవసానంగా రాష్ట్రాల్లో పాలన పడకేసింది. అసంతృప్తి నానాటికీ పెరిగింది. కానీ, రాహుల్‌కు ఇదంతా పట్టినట్టు లేదు. ఆయన తనదైన ప్రపంచంలో ఉండిపోయారు. కొత్త కొత్త ప్రయోగాలు చేయడంలోనే కాలంవెళ్లబుచ్చారు. ఎన్నికల రాజకీయాల్లో తలపండిన నేతలను కాదని యువరక్తాన్ని ఎక్కించాలన్న ఆత్రుతలో ఇంటర్వ్యూల ద్వారా కొత్త నేతలను ఎంపికచేశారు. వారిలో కొందరికి ఎన్నికల్లో పోటీచేసే అవకాశం కల్పించారు. వాస్తవానికి బీహార్, యూపీ ఎన్నికలప్పుడే ఆ ప్రయోగం విఫలమైంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల ముందు అమెరికాలో జరిగే ప్రైమరీ ఎన్నికల నమూనాను అనుసరించడానికి ప్రయత్నించారు. కానీ, అలాంటివారంతా ఓటమిపాలయ్యారు. ఇప్పుడు పార్టీలో ఏర్పడిన అసంతృప్తిని చల్లార్చడానికి ఏంచేయాలో తెలియని స్థితిలో రాహుల్‌గాంధీ ఉంటే, దీనిపై ఎలాంటి చర్యలు అవసరమవుతాయో అర్ధంకాక సోనియాగాంధీ అయోమయపడు తున్నారు. మహారాష్ట్రలో అయితే మరో ఆరునెలల్లో ఎన్నికలు జరగబో తున్నాయి. ఈ దశలో ముఖ్యమంత్రి పదవినుంచి చవాన్‌ను తప్పిం చినా అది పార్టీకి ముప్పు కలిగిస్తుంది. అలాగని కొనసాగించినా రాణే రూపంలో వచ్చిపడిన తిరుగుబాటు పర్యవసానంగా అక్కడ వేరే ఫలితాలు వచ్చే స్థితి కనిపించడంలేదు. ఇక అసోంలో తరుణ్ గోగోయ్‌ను సమర్థించాలని రాహుల్ నిర్ణయించాకే అక్కడి మంత్రి ధిక్కార స్వరం వినిపించారు. పార్టీలో అంతర్గత విభేదాలు ఇలావుంటే మహారాష్ట్రలో ఎన్సీపీ కాంగ్రెస్‌కు బాహాటంగానే షాకులిస్తున్నది. త్వరలో ఎన్నికలు జరగబోయే జమ్మూ-కాశ్మీర్‌లో ఇక కాంగ్రెస్‌తో కలిసి పోటీచేసేది లేదని నేషనల్ కాన్ఫరెన్స్ ప్రకటించింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల ఫలితాల ద్వారా దేశ ప్రజలు తమకేమి సందేశం ఇచ్చారో ఇప్పటికైనా గ్రహించి పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని ప్రతిష్టిస్తే, రాష్ట్రాల్లోని పార్టీ నేతలు ఏం కోరుకుంటున్నారో గుర్తిస్తే కాంగ్రెస్ కాస్తయినా కోలుకుంటుంది. లేకపోతే మళ్లీ మళ్లీ వైఫల్యాలనే మూటగట్టుకోవాల్సి వస్తుంది.