
సాహిత్య డైరీ
వాన వాన వాన...
నిన్న కురిసిన
క్రూర ఘోర మనోహర వర్షంలో
పడవలా తేలింది నగరం
ఒకటి రెండు వందలు వేలు లక్షల పడవలై
అది ట్రాఫిక్ జామ్‌గా మారింది
ఆఫీసు ఆకాశం నుంచి అమాంతం
ట్రాఫిక్‌లోకి దూకి
తప్పుకొని తప్పుకొని ఏ రాత్రికో గూటికి చేరి
ఒళ్లంతా రెక్కలుగా విప్పి
ఒక్కసారి విదిల్చాను
అప్పుడు ఇంట్లో కురిసింది వాన
పిల్లలూ నేనూ పడవలమై
రాత్రంతా ఎవరి తెరచాపలను వాళ్లం మరమ్మతు చేసుకొని
ఒకే తీరాన్ని చేరుకున్నట్టు ఒకటే నవ్వుకున్నాము
తెల్లారి తలుపు తెరిస్తే ఎర్రని ఎండపిట్ట
ముక్కుతో ముద్దుగా నా ఒళ్లంతా పొడిచింది
నాకేమీ తెలియదంటూ ఒక మేఘశకలం
నా కళ్లను తాకి చెట్టును తాకి తుర్రుమంది
-బి. ప్రసాదమూర్తి