లాక్‌డౌన్ మొదలైనప్పటినుంచీ అష్టకష్టాలు పడుతున్న వలసజీవులకు ఎట్టకేలకు విముక్తి లభించే రోజొచ్చింది. వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కార్మికులందరినీ స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతి నిస్తూ, అందుకవసరమైన మార్గదర్శకాలను బుధవారం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ విడుదల చేసింది. వీరితోపాటు పర్యాటకులు, తీర్థయాత్రలకు వెళ్లి వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్నవారు, చదువుల నిమిత్తం వేరే రాష్ట్రాల్లో వుంటున్న విద్యార్థులు కూడా తమ సొంత గూళ్లకు చేరడానికి అవకాశం ఏర్పడింది. తమది కాని ప్రాంతంలో రోజుల తరబడి వుండాల్సిరావడం, దగ్గరున్న సొమ్ములు నానాటికీ హరించుకుపోవడం, స్వస్థలాల్లో వదిలివచ్చిన కుటుంబాల స్థితిగతులపై బెంగ వగైరాలన్నీ వీరందరినీ చుట్టుముట్టాయి. దానికితోడు పొట్టనిండేదెలా అన్న సమస్య, తెచ్చుకున్న ప్రాణావసర మందులు అయిపోతూ, ఎక్కడా దొరక్కపోవడం వంటివన్నీ ఆందోళనను మరింత పెంచాయి. అయితే ఇతర వర్గాలు ఎలాగోలా తమ గోడు వినిపించుకోగలవు. వారి గురించి పట్టించుకునేవారూ తారసపడతారు.
ఏదోమేరకు సమస్య పరిష్కారమవుతుంది. కానీ వలస జీవుల వేదన పూర్తిగా భిన్నం. వారు కొత్తగా అక్కడికొచ్చినవారు కాదు. ఏనాటినుంచో ఆ నగరాన్నో, పట్టణాన్నో ఆధారం చేసుకుని జీవనం సాగిస్తున్నవారు. కానీ హఠాత్తుగా ఎవరికీ ఏమీ కానివారయ్యారు. బతకడానికి ఏమాత్రం సౌకర్యవంతంగా లేని గూడును కూడా ఖాళీ చేయమనే యజమానులు, సర్వం స్తంభించిపోవడంతో జేబులోవున్న కొద్ది సొమ్మూ ఖాళీ అయ్యే స్థితి వలసజీవులను వేధించింది. అంతకుమించి స్వస్థలాల్లో తమ వాళ్లను గురించిన బెంగ వారిని మరింత కుంగదీసింది. కొందరు వెనకా ముందూ ఆలోచించకుండా వెనువెంటనే నడకదారి పట్టారు. వెళ్లాల్సిన దూరం వందల కిలోమీటర్లా, వేల కిలోమీటర్లా... గమ్యం చేరగలమా, లేదా వంటి ప్రశ్నలేమీ వారు వేసుకోలేదు. కొందరు నిర్భాగ్యులకది ఆఖరి పయనం అయింది.
ఒంట్లో సత్తువ తగ్గి, తినడానికేమీ దొరక్క, చివరకు దప్పిక తీర్చుకునే దారి కూడా లేక 25మంది మరణించారు. అందులో పన్నెండేళ్ల బాలిక మొదలుకొని యువకులు, వృద్ధులవరకూ ఎందరో వున్నారు. ఈ వలస జీవులు దశాబ్దాల తరబడి ఆ నగరాలనూ, పట్టణాలనూ ఆధారం చేసుకుని జీవనం సాగిస్తూవుండొచ్చుకానీ...తమ కాయకష్టం ద్వారా వారు సృష్టించిన, సృష్టిస్తున్న సంపద అపారమైనది. సంక్షోభం ముంచుకొచ్చేసరికి వీరు ఎవరికీ కాకుండా పోయారు. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ఆదుకునే ప్రయత్నాలు చేశాయి. కానీ అవి అందుబాటులోకి రాని వారెందరో వున్నారు. కనుకనే లాక్‌డౌన్ విధించి దాదాపు 40 రోజులకు చేరువవుతున్నా ఇంకా నడకదారిన పోతున్నవారు దేశమంతటా కనబడుతూనే వున్నారు. కొన్నిచోట్ల వలసజీవులు తిరగబడుతున్న ఉదంతాలూ చోటుచేసుకుంటున్నాయి.
వలసజీవుల కష్టాలు ఎలాంటివో తెలియాలంటే వారి జీవితాల్లోకి తొంగిచూడాలి. ఒక స్వచ్ఛంద సంస్థ 11,000 మందికి పైగా వలస కార్మికులను సర్వే చేస్తే దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు వెలుగులోకొచ్చాయి. అందులో సగంమంది వద్ద ఒక పూట కడుపునిండా తినడానికి అవసరమైన ఆహారపదార్థాలు కూడా లేవు. 74 శాతంమంది వద్ద రూ. 300 కన్నా తక్కువ మొత్తం వుంది. 89 శాతంమందికి యజమానులు వేతనాలు ఎగ్గొట్టారు. గ్రామసీమల నుంచి పట్టణాలకూ, నగరాలకూ వలస వెళ్లినవారు మొత్తం 12 కోట్లమంది వుంటారని అంచనా. 1991లో మొదలైన ఆర్థిక సంస్క రణల వల్ల లభించిన ఆరుకోట్లకుపైగా ఉద్యోగాల్లో 92 శాతం అనిశ్చితమైనవి. ఇలాంటి అనిశ్చితిలో పనిచేస్తున్న కార్మికులు తమ శ్రమతో సృష్టిస్తున్న సంపద జీడీపీలో పదిశాతం. ఇంత సంపద సృష్టించినా సంక్షోభం వచ్చేసరికి వీరంతా సమస్యల్లో కూరుకుపోయారు. నిజానికి లాక్‌డౌన్ విధిం చడం, ఎక్కడివారిని అక్కడ ఉంచడం ఎంతో అవసరం.
వీరంతా స్వస్థలాలకు తరలివెళ్లివుంటే కరోనా మహమ్మారి పల్లెసీమల్లో పెను విపత్తు సృష్టించేది. దాన్ని నియంత్రించడం అసాధ్యమయ్యేది. దశాబ్దాలుగా అసంఘటిత రంగంలో పనిచేస్తున్నవారి సంక్షేమానికి అవసరమైన చట్టాలు సరిగా లేకపోవడం, వున్నవాటిని కూడా సమర్థవంతంగా అమలు చేయించలేని ప్రభుత్వాల వైఖరి కార్మికులను ఈ సంక్షోభ సమయంలో నిస్సహాయుల్ని చేశాయి. ఇలాంటి విపత్తులెదురైన పక్షంలో కనీసం రెండు మూడునెలలు జీవించడానికి సరిపడా మొత్తం లభించేలా తగిన పథకాలు రూపొం దించి అమలు చేస్తే, వారు ఎవరికీ భారం కాకుండా వుండేవారు. నిర్మాణరంగం మొదలుకొని అనేక రంగాల్లో ఏళ్లతరబడి పనిచేసినా, వారి పేరు ఏ రిజిస్టర్‌కీ ఎక్కని దుస్థితి వుండబట్టే ఆ వలసజీవులు రెక్కలు తెగిన పక్షులుగా మారారు. దానికితోడు లాక్‌డౌన్ ప్రకటనకు ముందే షెల్టర్లు ఎన్ని వున్నాయో, ఎంతమందికి అక్కడ ఆవాసం కల్పించవచ్చునో, ఎన్నిటిని షెల్టర్లుగా మార్చవలసి వుంటుందో... వలసజీవులకు ఆహారపదార్థాలు అందించడంతోపాటు మందులు వగైరా సమ కూర్చడానికి ఎంత వ్యయం అవుతుందో లెక్కలేసి, తగిన మార్గదర్శకాలు జారీచేసివుంటే బాగుం డేది. వలసజీవుల్లో అత్యధికులు దళితులు, ఆదివాసీలు, మైనారిటీలే. వీరిలో చాలామంది సీజనల్ పనులు చేసుకుని బతికేవారే.
ఈ కరోనా మహమ్మారి ఎన్నో గుణపాఠాలు నేర్పింది. సంక్షోభ సమయాల్లో వలసజీవులకు ఆసరాగా నిలిచే పథకాలను రూపొందించడం, అందుకు తగిన విధానాలను ఖరారు చేయడం ప్రభుత్వాలకు పెద్ద సవాలు. అలాగే మన ఆరోగ్య వ్యవస్థలను ప్రక్షాళన చేసుకోవడం, విపత్తు లేర్పడినప్పుడు అవి సమర్థవంతంగా పనిచేసేలా తీర్చిదిద్దడం ఎంతో అవసరం. కేంద్రం తాజా నిర్ణయంతో స్వస్థలాలకు చేరే వలసజీవులకు ప్రశాంత జీవనం సాగేందుకు అవసరమైన సదుపాయాలు ప్రభుత్వాలు కల్పించాలి. వారి పునరావాసానికి అనువైన పథకాలు కూడా రచించాలి.
Comments
Please login to add a commentAdd a comment